అన్న సర్ఫరాజ్, తండ్రి నౌషద్ ఖాన్‌తో ముషీర్ (PC: sarfrazkhan insta)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు?!.. అయితే, అందుకు కెరీర్‌ను మూల్యంగా చెల్లించే పరిస్థితి రాకూడదనే జాగ్రత్తపడుతున్నానంటున్నాడు భారత యువ సంచలనం ముషీర్ ఖాన్!
కాగా క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. టీమిండియాలో పాతుకుపోయిన విషయం తెలిసిందే. టీనేజ్‌లోనే కోట్లు కొల్లగొట్టి స్టార్లుగా మారిపోయిన వాళ్లూ ఉన్నారు. అందుకే.. ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు.
ముషీర్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే! అయితే, అనుకున్న వెంటనే అతడికి ఛాన్స్ రాలేదు. గతేడాది వేలంలో పేరు నమోదు చేసుకున్న 19 ఏళ్ల ముషీర్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు.
అయితే, ఆ సమయంలో తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని.. టీ20 ఫార్మాట్ గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు తనకు మరింత సమయం దొరికిందని సంతోషంగా చెప్తున్నాడు ఈ ఏడాది ‘రంజీ’ ఫైనల్ హీరో ముషీర్ ఖాన్.
నాన్న చెప్పాడు
‘‘ఐపీఎల్‌లో నా పేరు లేదు. అయినా.. మరేం పర్లేదు.. టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టి.. టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేయాలని మా నాన్న చెప్పారు. ఆ క్రమంలో సరైన సమయంలో ఐపీఎల్‌లో చోటు కూడా దక్కుతుందన్నారు.
ఈరోజు కాకపోతే.. రేపైనా ఐపీఎల్‌లో నేను తప్పక అవకాశం దక్కించుకుంటానని బలంగా చెప్పారు. నిజానికి ఈసారి నేను ఎంపిక కాకపోవడమే మంచిదైంది. టీ20 క్రికెట్‌ను నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని రకాలుగా పొట్టి ఫార్మాట్ కోసం సిద్ధం కావాలి’’ అని ముషీర్ ఖాన్ పీటీఐతో చెప్పుకొచ్చాడు.
మా అన్నయ్యే నాకు స్ఫూర్తి
ఇక తన అన్న సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ..‘‘ ఆట పట్ల మా అన్నయ్యకు ఉన్న అంకిత భావం, అతడి బ్యాటింగ్ శైలి నాకెంతో నచ్చుతాయి. మా ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లే ముందు అతడే నాలో ధైర్యం నింపాడు.
ఫైనల్ అని ఒత్తిడిలో కూరుకుపోతే మొదటికే మోసం వస్తుందని.. సాధారణ మ్యాచ్‌లలాగే అక్కడా ఆడాలని చెప్పాడు’’ అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముషీర్ ఖాన్ 136 పరుగుల(సెకండ్ ఇన్నింగ్స్)తో చెలరేగి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తద్వారా ముంబై రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ గెలవడంలో భాగమై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ముషీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
సర్ఫరాజ్‌కూ నో ఛాన్స్
కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్‌కోట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్. అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి.. రంజీలోనూ అదరగొట్టాడు.
ఇప్పటి వరకు అతడు కేవలం ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ను సైతం ఐపీఎల్-2024 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అంతకు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment