ప్రస్తుతం భారత క్రికెట్‌లో రెండు పేర్లు మార్మోగిపోతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ముంబై ఆటగాళ్లు, అన్నదమ్ములు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఖాన్ బ్రదర్స్ ప్రపంచ క్రికెట్‌లోనూ హాట్ టాపిక్‌గా మారారు.
వచ్చీ రాగానే ఇరగదీసిన సర్ఫరాజ్..
దేశవాలీ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ ఖాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చీ రాగానే తనదైన మార్కును చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్ట్‌తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.
సంచలనాల ముషీర్..
సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ విషయానికొస్తే.. 18 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ అన్న అడుగుజాడల్లోనే నడుస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగించి, పరుగుల వరద (7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 360 పరుగులు) పారించిన ముషీర్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగి అద్భుతమైన సెంచరీతో ఇరగదీశాడు.
శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ముషీర్.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీని ముషీర్ 179 బంతుల్లో పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై సేఫ్ జోన్‌లోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
ఎందుకంత హైప్..
క్రికెట్‌లో అన్నదమ్ములు కలిసి ఆడటం, ఇద్దరూ అద్భుతంగా రాణించడం వంటి ఘటనలు గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ ఖాన్ బ్రదర్స్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఎందుకంటే సర్ఫరాజ్, ముషీర్‌లకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వెనుక చాలా కష్టం దాగి ఉంది. సర్ఫరాజ్, ముషీర్‌ల తండ్రి నౌషద్ ఖాన్ పేదరికంతో పోరాడి ఈ ఇద్దరి కెరీర్‌ల కోసం జీవితాన్నే త్యాగం చేశాడు.
సర్ఫరాజ్ టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాక నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment