
అక్టోబర్ 13న హైదరాబాద్ టి20
భారత్‌లో ఆసీస్ పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల పర్యటన ఈ నెల 12నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు చెన్నైలో ఆసీస్ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ఐదు వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లలో భారత్‌తో తలపడుతుంది. ఈ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కాగా... రెండు రోజుల్లో బీసీసీఐ దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అక్టోబర్ 13న చివరి టి20 మ్యాచ్ జరుగుతుంది.
ఇంగ్లండ్ పర్యటన కూడా...
2018లో ఇంగ్లండ్‌లో భారత్ సుదీర్ఘ పర్యటన వివరాలను కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. 3 జూలైనుంచి 11 సెప్టెంబర్ వరకు సాగే ఈ టూర్‌లో భారత్, ఇంగ్లండ్ ఐదు టెస్టులు, 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లలో తలపడతాయి. ముందుగా టి20లు, వన్డేలు... ఆ తర్వాత ఐదు టెస్టులు ఉంటాయి. బర్మింగ్‌హామ్, లార్డ్స్, నాటింగ్‌హామ్, సౌతాంప్టన్, ఓవల్‌లను టెస్టు వేదికలుగా ఖరారు చేశారు. 2014లో ఆఖరి సారిగా ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత్ 5 టెస్టుల సిరీస్‌ను 1–3తో కోల్పోయింది.