
రహానే అదరహో:సఫారీలకు భారీ లక్ష్యం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే అదరగొట్టాడు.
ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో మరో శతకాన్ని నమోదు చేశాడు. రహానే(100 నాటౌట్ ;206 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సఫారీ బౌలర్లకు మరోసారి పరీక్షగా నిలిచి సెంచరీ సాధించాడు. దీంతో సఫారీలపై వరుస ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రహానే .. స్వదేశంలో వరుసగా రెండు శతకాల్ని సాధించిన గుర్తింపు పొందాడు. దీంతో పాటు రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు నమోదు చేసిన ఐదో భారత బ్యాట్స్ మెన్ గా నిలవడం మరో విశేషం. ఈరోజు ఆటలో రహానే సెంచరీ చేసిన అనంతరం టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 267/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ఓవరాల్ గా 480 పరుగుల ఆధిక్యం సాధించి.. సఫారీలకు భారీ లక్ష్యాన్నినిర్దేశించింది.
190/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ఆదిలోనే విరాట్ వికెట్ ను నష్టపోయింది. జట్టు స్కోరు 211 పరుగుల వద్ద ఉండగా విరాట్ ఐదో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. విరాట్ కోహ్లి(88;165 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, అబాట్, తాహీర్ లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులు చేయగా, సఫారీలు 121 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ ముగించారు.