న్యూఢిల్లీ:. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో నాలుగు వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన భారత ఓపెనర్ అజ్యింకా రహానేకు ట్వంటీ 20 సిరీస్ లో చోటు దక్కలేదు. వన్డేల్లో శిఖర్ ధావన్ స్థానంలో ఆడిన రహానే తొలి వన్డే మినహా మిగతా వన్డేల్లో విశేషంగా రాణించాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ లో రహానే 5, 55, 70, 53, 61 స్కోర్లతో మెరిశాడు. అయినప్పటికీ భారత జట్టులో పోటీ ఎక్కువ ఉన్న కారణంగా త్వరలో ఆసీస్ తో ఆరంభం కానున్న మూడు ట్వంటీ 20ల సిరీస్ లో రహానేకు స్థానం దక్కలేదు. తన ఉద్వాసనపై స్పందించిన రహానే.. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నాడు.
'నేను సెలక్టర్లు నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. అవును.. ఇటీవల కాలంలో మేము చాలా ఎక్కువ క్రికెట్ ఆడాం. ఇక్కడ జట్టు మేనేజ్ మెంట్, సెలక్టర్లు ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నారో దాన్ని స్వాగతిస్తున్నా'అని రహానే తెలిపాడు. అయితే జట్టులో ఉన్న పోటీతత్వం గురించి రహానేను అడగ్గా.. తమ జట్టులో విపరీతమైన పోటీ ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, అది అవసరం కూడా అంటూ బదులిచ్చాడు. అలా ఉన్నప్పుడే జట్టులోని సభ్యులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తూ ఉంటారన్నాడు.
'నాకిచ్చిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని దాదాపు సద్వినియోగం చేసుకుంటానికే యత్నించా. నా ఫామ్ పై సంతృప్తిగా ఉన్నా. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఆట మరింత మెరుగైంది. ఈ సిరీస్ వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా. కాకపోతే హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చడంలో విఫలమయ్యా. ఈసారి మరొకసారి ఆ అవకాశాన్ని వదులుకోను. హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మారుస్తా'అని రహానే తెలిపాడు. ఆసీస్ తోట్వంటీ 20 సిరీస్ కు రహానే కు ఉద్వాసన చెప్పగా, ధావన్ కు అవకాశం దక్కింది. మరొకవైపు అశ్విన్, రవీంద్ర జడేజాలకు సైతం ట్వంటీ 20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.