అజిత్ అగార్కర్(ఫైల్‌ఫొటో)
ముంబై: ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో ఓ వెలుగు వెలిగిన మాజీ పేసర్ అజిత్ అగార్కర్ జాతీయ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. శుక్రవారం(జనవరి 24వ తేదీ) దరఖాస్తులకు డెడ్‌లైన్ కావడంతో అగార్కర్ చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి రేసులోకి వచ్చేశాడు. ఇప్పటివరకూ సెలక్టర్ల పదవికి అప్లై చేసుకున్న వారిలో అగార్కర్ బాగా గుర్తింపు పొందిన క్రికెటర్ కాబట్టి అతనికే చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా పనిచేసిన అగార్కర్ తాను సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధృవీకరించాడు.
భారత్ తరఫున 26 టెస్టులు,191 వన్డేలు, మూడు టీ20లు ఆడిన అనుభవం అగార్కర్‌ది. అన్ని ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లను అగార్కర్ ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలో 288 వికెట్లు సాధించి ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అగార్కర్ ఆడుతున్న సమయంలో వేగవంతంగా 50 వన్డే వికెట్లను సాధించిన ఘనతను నమోదు చేశాడు. 23 మ్యాచ్‌ల్లోనే 50 వన్డే వికెట్లు సాధించాడు. ఆపై అగార్కర్ రికార్డును శ్రీలంక బౌలర్ మెండిస్(19 మ్యాచ్‌లు) బ్రేక్ చేశాడు.
ప్రస్తుత కమిటీలో పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్ జోన్), సెలెక్టర్ గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుండగా సందీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్) మరో ఏడాది కొనసాగనున్న సంగతి తెలిసిందే.
సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖులు
అజిత్ అగార్కర్(ముంబై), చేతన్ శర్మ(హరియాణా), నయాన్ మోంగియా(బరోడా), లక్ష్మణ్ శివరామకృష్ణన్(తమిళనాడు), రాజేశ్ చౌహాన్( మధ్యప్రదేశ్), అమే ఖురేషియా(మధ్యప్రదేశ్), గ్యానేంద్ర పాండే(యూపీ)
Comments
Please login to add a commentAdd a comment