మూడు నెలల తరువాత ఫీల్డ్ లోకి అజ్మల్!
లాహోర్: సస్పెన్షన్ వేటు పడ్డ పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ మూడు నెలల అనంతరం ఫీల్డ్ లోకి దిగాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా లాహోర్ లో శుక్రవారం కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్ లో అజ్మల్ బౌలింగ్ చేశాడు. పాకిస్థాన్- ఎ తరుపున కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేసిన అజ్మల్ ఒక వికెట్టు తీసి 23 పరుగులు ఇచ్చాడు. చెన్నైలో బయోమెకానిక్ పరీక్షకు పంపడానికి ముందు కెన్యాతో జరిగే చివరి రెండు వన్డేల్లో బరిలోకి దించాలని పీసీబీ నిర్ణయించడంతో ఈ మ్యాచ్ లో అజ్మల్ పాల్గొన్నాడు.
ఆరు ఓవర్లు వేసిన అజ్మల్ బౌలింగ్ వివిధ యాక్షన్లలో వేయగా, దూస్రాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు నెలల అనంతరం బౌలింగ్ చేసిన తన యాక్షన్ పై అజ్మల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. తాను తిరిగి ప్రపంచకప్ నాటికి జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్న కారణంతో గత సెప్టెంబర్ లో సయీద్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించింది.