కరాచీ: ఇటీవల దుబాయ్‌లో జరిగిన బాక్సింగ్ బౌట్‌లో ఫిలీప్పిన్స్ బాక్సర్ కార్నడో తనోమోర్‌ను కేవలం 82 సెకండ్లలో నాకౌట్ చేసి దిగ్విజయంగా స్వదేశానికి వచ్చిన పాకిస్తాన్ ప్రొఫెషనల్ బాక్సర్ మహ్మద్ వసీంకు చేదు అనుభవమే ఎదురైంది. దేశం తరఫున విజయం సాధిస్తే అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మహ్మద్ వసీంకు కనీస స్వాగత ఏర్పాట్లు చేయలేదు. దీన్ని ఘోర అవమానంగా భావించిన వసీం.. ‘తాను పాకిస్తాన్ టాలెంట్‌ను ప్రపంచ వేదికపై చాటడానికి మాత్రమే వెళతాను. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతాల కోసం నేను ఫైట్ చేయడం లేదు. ప్రతీ క్యాంప్, ప్రతీ టూర్, ప్రతీ ట్రైయినింగ్ నాకు ముఖ్యమే. పాకిస్తాన్ బాక్సింగ్ టాలెంట్‌ను ప్రపంచం గుర్తించాలనే కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు.
దీనిపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందిస్తూ.. ఇదేనా తమ దేశ హీరోల్ని గౌరవించుకునే విధానం అంటూ ధ్వజమెత్తాడు. ‘నేను వసీంకు పాక్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. దేశం తరఫున ఎవరైనా సత్తా చాటితే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మన హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అనేది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇవే నా క్షమాపణలు. నువ్వు తర్వాత బౌట్‌లో గెలిచినప్పడు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటా. నీ విజయానికి ఇవే నా అభినందలు’ అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ పది బౌట్లలో పాల్గొన్న వసీం.. ఒకదాంట్లో మాత్రమే పరాజయం చూసి తొమ్మిది బౌట్లలో గెలుపు అందుకున్నాడు. ఇందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment