సచిన్ రికార్డును అధిగమించాడు!
చెస్టర్ లీ స్ట్రీట్: మాస్టర్ బ్లాస్టర్, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పిన్న వయసులో టెస్టుల్లో నెలకొల్పిన పదివేల పరుగుల రికార్డును ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అధిగమించాడు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్ లో కుక్ ఈ ఫీట్ ను సాధించాడు. శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభం అయ్యేనాటికి పదివేల పరుగుల రికార్డును అందుకోవడానికి 36 పరుగుల దూరంలో ఉన్న కుక్ .. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కుక్ 16, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 15 పరగులు చేసి నిరాశపరిచాడు. అయితే ఈ రికార్డును కుక్ రెండో ఇన్నింగ్స్ లో సవరించాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అయితే పదివేల పరుగుల రికార్డును చేరుకున్నప్పుడు సచిన్ వయసు 31 ఏళ్ల 10 నెలలు. కాగా, కుక్ వయసు ప్రస్తుతం 31 ఏళ్ల 4 నెలలు.
దీంతో పాటు పదివేల పరుగుల మార్కును చేరుకున్న 12వ ఆటగాడిగా కుక్ నిలిచాడు. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్ తరపున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ కుక్ కావడం మరో విశేషం. 1987లో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పది వేల పరుగుల మార్కును చేరుకున్న తొలి క్రికెటర్ గా గుర్తింపు సాధించగా, ఆపై ఆరు సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు అలెన్ బోర్డర్ ఆ ఘనతను చేరాడు. టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన వారిలో స్టీవ్ వా, బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లిస్, మహేలా జయవర్ధనే, శివనారాయణ్ చందర్ పాల్, కుమార సంగక్కారాలు ఉన్నారు.