వారియర్స్‌దే సిరీస్
రెండో టి20లోనూ విజయం
57 పరుగులతో ఓడిన బ్లాస్టర్
వెటరన్స్ పరుగుల మోత
హోస్టన్: దిగ్గజ క్రికెటర్లు అమెరికా అభిమానులకు ఈ సారి ఫుల్ వినోదాన్ని పంచారు. వార్న్ వారియర్స్, సచిన్ బ్లాస్టర్స్ ఆటగాళ్లు టి20 మ్యాచ్‌లో పోటీ పడి పరుగుల మోత మోగించడంతో స్థానిక మినట్ మెయిడ్ పార్క్ దద్దరిల్లింది. చివరకు ఈ మ్యాచ్‌లోనూ వారియర్స్‌దే పైచేయి అయింది. సమష్టి ప్రదర్శనతో వార్న్ సేన 57 పరుగుల తేడాతో సచిన్ బ్లాస్టర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 262 పరుగుల భారీ స్కోరు చేయగా...అనంతరం బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా వార్న్ జట్టు ఆల్‌స్టార్స్ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో దాదాపుగా 28 వేల మంది ప్రేక్షకులు హాజరు కావడం సిరీస్ సక్సెస్‌ను చూపిస్తోంది. చివరిదైన మూడో మ్యాచ్ శనివారం (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) లాస్ ఏంజెల్స్‌లో జరుగుతుంది.
చెలరేగిన సంగక్కర
కుమార సంగక్కర (30 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో వారియర్స్ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ముఖ్యంగా తన మాజీ సహచరుడు మురళీధరన్ బౌలింగ్‌ను చితకబాదుతూ 3 సిక్సర్లు 2 ఫోర్లు కొట్టిన అతను స్వాన్ బౌలింగ్‌లోనూ 10 బంతుల్లోనే 24 పరుగులు రాబట్టాడు. సంగ, కలిస్ (23 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి మూడో వికెట్‌కు 43 బంతుల్లోనే 91 పరుగులు జత చేయగా, ఆ తర్వాత సంగక్కర, పాంటింగ్ (16 బంతుల్లో 41; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) 23 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. వారియర్స్ జట్టులో హేడెన్ (15 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ (22 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడగా...చివర్లో సైమండ్స్ (6 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), రోడ్స్ (8 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) 13 బంతుల్లో అభేద్యంగా 38 పరుగులు జత చేశారు. బ్లాస్టర్స్ బౌలర్లలో క్లూసెనర్‌కు 2 వికెట్లు దక్కాయి.
పోరాడిన పొలాక్
బ్లాస్టర్స్ తరఫున షాన్ పొలాక్ (22 బంతుల్లో 55; 1 ఫోర్, 7 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా అది జట్టు విజయానికి సరిపోలేదు. అక్రం బౌలింగ్‌లోనే 3 సిక్సర్లు బాదిన పొలాక్, సైమండ్స్ బౌలింగ్‌లో 4 భారీ సిక్సర్లు కొట్టాడు. తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడి అభిమానులను ఆనందపర్చిన సచిన్ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సక్లాయిన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (16), గంగూలీ (12), లారా (19), జయవర్ధనే (5), క్లూసెనర్ (21) విఫలం కావడంతో బ్లాస్టర్స్‌కు ఓటమి తప్పలేదు. సైమండ్స్‌కు 4 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ మొత్తం కలిపి 38 సిక్సర్లు నమోదు కావడం విశేషం!