T 20
-
విశాఖలో విజయగర్జన
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ తీరం ఎట్టకేలకు టీమిండియాను విజయతీరానికి చేర్చింది. ఓపెనింగ్ హిట్టయినా... మిడిలార్డర్ నిరాశపరిచింది. అయితే బౌలింగ్ కూడా సూపర్ హిట్ కావడంతో భారత్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. మూడో టి20లో టీమిండియా 48 పరుగులతో దక్షిణాఫ్రికాపై గెలిచి సిరీస్‌లో 1–2తో నిలబడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్ (29; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. హర్షల్ పటేల్ (4/25) నిప్పులు చెరగగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (3/20; రెండు క్యాచ్‌లు) తిప్పేశాడు. ఈనెల 17న రాజ్‌కోట్‌లో నాలుగో టి20 జరుగుతుంది. రుతురాజ్ తుఫాన్ ఓపెనర్లు రుతురాజ్, కిషన్ బ్యాటింగ్ తుఫాన్‌కు శ్రీకారం చుట్టారు. రబడ వేసిన మూడో ఓవర్లో 4, 6 కొట్టిన రుతురాజ్... నోర్జే వేసిన ఐదో ఓవర్‌ను ఫోర్లతో చితగ్గొట్టేశాడు. వరుస 4, 4, 4, 4, 4, 0లతో 20 పరుగులొచ్చాయి. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు 57/0. ఐదో ఓవర్ నుంచి రన్‌రేట్ 9కు దిగలేదు. రుతురాజ్ 30 బంతుల్లోనే (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇషాన్ కూడా అడపాదడపా భారీ షాట్లు ఆడుతూ స్కోరు పెంచాడు. షమ్సీ తొమ్మిదో ఓవర్లో ఒక సిక్స్, ఫోర్ బాదాడు. పదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన కేశవ్ మహరాజ్ తన తొలిఓవర్లోనే భారత సునామీ ఆరంభాన్ని దెబ్బతీశాడు. రుతురాజ్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వికెట్ల విలవిల ఓపెనర్ల దూకుడుతో కనీసం 200 పైచిలుకు స్కోరు గ్యారంటీ అనిపించింది. అయితే సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్స్ పట్టు సడలించారు. ఇషాన్ 31 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తయ్యాక వరుస ఓవర్లలో మొదట శ్రేయస్ అయ్యర్ (14), తర్వాత ఇషాన్ ఔటయ్యారు. అనంతరం వచ్చిన హిట్టర్లు పంత్ (6), దినేశ్ కార్తీక్ (6) చేతులెత్తేశారు. çహార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) కొట్టిన ఫోర్లతో స్కోరు 179 పరుగులకు చేరింది. సఫారీ కుదేల్ దక్షిణాఫ్రికా గత మ్యాచ్‌ల జోరుకు 180 పరుగుల లక్ష్యం ఏమంత కష్టం కానేకాదు. కానీ భారత బౌలర్ల పట్టుదలకు క్రీజులోకి వచ్చిన 11 మందిలో ఏ ఒక్కరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. పవర్ ప్లేలోనే సఫారీ ఓపెనర్లు బవుమా (8), హెండ్రిక్స్ (23) పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన ప్రిటోరియస్ (20), డసెన్ (3), క్లాసెన్‌లకు చహల్ స్పిన్ ఉచ్చు బిగించాడు. మరోవైపు హర్షల్ నిప్పులు చెరగడంతో దక్షిణాఫ్రికా 100 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. మిల్లర్ (3), క్లాసెన్ అవుటయ్యాక సఫారీ విజయానికి దూరమైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి అండ్ బి) కేశవ్ 57; ఇషాన్ (సి) హెండ్రిక్స్ (బి) ప్రిటోరియస్ 54; శ్రేయస్ (సి) నోర్జే (బి) షమ్సీ 14; పంత్ (సి) బవుమా (బి) ప్రిటోరియస్ 6; హార్దిక్ (నాటౌట్) 31; దినేశ్ కార్తీక్ (సి) పార్నెల్ (బి) రబడ 6; అక్షర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–97, 2–128, 3–131, 4–143, 5–158. బౌలింగ్: రబడ 4–0–31–1, పార్నెల్ 4–0–32–0, నోర్జే 2–0–23–0, ప్రిటోరియస్ 4–0–29–2, షమ్సీ 4–0–36–1, కేశవ్ 2–0–24–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) అవేశ్ (బి) అక్షర్ 8; హెండ్రిక్స్ (సి) చహల్ (బి) హర్షల్ 23; ప్రిటోరియస్ (సి) పంత్ (బి) చహల్ 20; డసెన్ (సి) పంత్ (బి) చహల్ 1; క్లాసెన్ (సి) అక్షర్ (బి) చహల్ 29; మిల్లర్ (సి) రుతురాజ్ (బి) హర్షల్ 3; పార్నెల్ (నాటౌట్) 22; రబడ (సి) చహల్ (బి) హర్షల్ 9; కేశవ్ (సి) కార్తీక్ (బి) భువనేశ్వర్ 11; నోర్జే రనౌట్ 0; షమ్సీ (సి) అవేశ్ ఖాన్ (బి) హర్షల్ పటేల్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–23, 2–38, 3–40, 4–57, 5–71, 6–100, 7–113, 8–126, 9–131, 10–131. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–21–1, అవేశ్ ఖాన్ 4–0–35–0, అక్షర్ పటేల్ 4–0–28–1, చహల్ 4–0–20–3, హర్షల్ పటేల్ 3.1–0–25–4. -
‘లాలా ఐ యామ్ సారీ’.. బౌలర్ క్షమాపణలు
ఇస్లామాబాద్: దాయాది దేశంలో రసవత్తరంగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2020 ఎలిమినేషన్ దశకు చేరుకుంది. లాహోర్ ఖలందర్, ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య కరాచీలో ఆదివారం జరిగిన ఎలిమినేటర్-2 మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని డకౌట్ చేసిన లాహోర్ బౌలర్ హారిస్ రావూఫ్ అతనికి క్షమాపణలు చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ 14 వ ఓవర్లో ఈ విశేషం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ముల్తాన్ జట్టు 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకొచ్చిన అఫ్రిదిని రావూఫ్ మొదటి బంతికే డకౌట్ చేశాడు. రావూఫ్ విసిరిన ఇన్‌స్వింగర్ అఫ్రిది కాళ్ల మధ్యలోంచి చొచ్చుకెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో తన ఫేవరెట్ ఆటగాడికి రావూఫ్ రెండు చేతులు జోడించి నవ్వుతూ దండం పెట్టాడు. ‘లాలా ఐ యామ్ సారీ’ అంటూ మ్యాచ్ అనంతరం వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. కాగా, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 157 పరుగులే చేసిన ముల్తాన్ జట్టు పరాజయం పాలైంది. లాహోర్ జట్టు ఫైనల్స్‌కి చేరింది. నవంబర్ 17న కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. (చదవండి: ఆస్ట్రేలియా టూర్‌పై కరోనా ప్రభావం!) LALA I'M SORRY 😭🙏🏾#HBLPSLV #PhirSeTayyarHain #MSvLQ pic.twitter.com/QoMJG5Lhht — PakistanSuperLeague (@thePSLt20) November 15, 2020 -
టీ20 లీగ్‌లో భారీ స్కోరు నమోదు
అనంతపురం : ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో భారీ స్కోరు నమోదైంది. శనివారం అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన టైటాన్స్ జట్టు 81 పరుగులతో వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టైటాన్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎస్. తరుణ్ (28 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (45) ఆకట్టుకున్నాడు. హేమంత్ (30), క్రాంతి కుమార్ (37), సలేష్ (22), డి. చైతన్య (30) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన వారియర్స్ ఎలెవన్ 18.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. సాయిరామ్ (38 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. కె. క్రాంతి (26), ప్రణీత్ (21), కరన్ (22) పరవాలేదనిపించారు. లెజెండ్స్ ఎలెవన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ 6 వికెట్లతో గెలుపొందింది. మొదట లెజెండ్స్ ఎలెవన్ 19.5 ఓవర్లలో 136 పరుగులు చేసింది. కరన్ షిండే (38), చరణ్ సాయితేజ (25) రాణించారు. 137 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నరేన్ రెడ్డి (40 నాటౌట్) ఆకట్టుకున్నాడు. -
ముగ్గురు కెప్టెన్లను ప్రకటించిన బీసీసీఐ
న్యూఢిల్లీ: కరోనా అడ్డంకులను దాటుకుని అభిమానులకు వినోదం పంచుతున్న ఐపీఎల్-2020 కి తోడుగా మహిళల మినీ ఐపీఎల్ సంరంభం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. యూఏఈలోని షార్జా వేదికగా జరిగే ‘మహిళల టి20 చాలెంజర్ టోర్నీ’ జట్లకు సారథులను నియమించింది. సూపర్ నోవాస్ టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌కు స్మృతి మంధాన, వెలాసిటీ టీమ్‌కు మిథాలి రాజ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారని పేర్కొంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనుంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రియా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటారు. కాగా, 2018 లో మొదలైన మహిళల మినీ ఐపీఎల్లో తొలుత సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు మాత్రమే ఉండేవి. ఈసారి ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌ని కొత్తగా చేర్చారు. (చదవండి: మహిళా క్రికెటర్లకు పిలుపు!) (చదవండి: ‘క్వారంటీన్ నిబంధనలు మారవు’) -
సిరీస్ విజయం వేటలో..
భారత జట్టు న్యూజిలాండ్ గడ్డపై రెండు సార్లు టి20 సిరీస్‌లు ఆడింది. ఒకసారి 0–2తో, మరోసారి 1–2తో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు మూడో ప్రయత్నంలో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునే అరుదైన అవకాశం మన జట్టుకు వచింది. టీమిండియా తాజా ఫామ్ చూస్తే అది అసాధ్యంగా ఏమీ కనిపించడం లేదు. ఇరు జట్ల తొలి పోరు హోరాహోరీగా సాగగా, రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థి పూర్తిగా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో మూడో టి20లో కూడా సత్తా చాటి 3–0తో ముందంజ వేయాలని కోహ్లి సేన భావిస్తుండగా... సొంతగడ్డపై పేలవ ఫామ్‌లో సతమతమవుతున్న కివీస్ ఇక్కడైనా పోరాడి సిరీస్ కాపాడుకోగలదా చూడాలి. హామిల్టన్: టి20 ప్రపంచ కప్ ఏడాదిలో భారత జట్టు సన్నాహకం జోరుగా సాగుతోంది. న్యూజిలాండ్‌లో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన తీరు జట్టు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఇప్పుడు ఇదే ఊపులో మరో మ్యాచ్ కూడా గెలిస్తే తొలిసారి కివీస్ గడ్డపై టి20 సిరీస్ భారత్ సొంతమవుతుంది. భారత జట్టు ఫామ్‌లో ఉండగా, సీనియర్ బౌలర్ల గైర్హాజరులో న్యూజిలాండ్ బలహీనంగా తయారైంది. రాహుల్‌ను ఆపతరమా! భారత జట్టుకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి కోహ్లి, రోహిత్లకంటే కూడా లోకేశ్ రాహుల్‌పైనే ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదు. గత కొంత కాలంగా చెలరేగిపోతున్న ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ రెండు వరుస అర్ధ సెంచరీల తర్వాత మరో మెరుపు ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాడు. పిచ్‌లతో పని లేకుండా చెలరేగిపోతున్న రాహుల్‌ను ఆరంభంలోనే అడ్డుకోలేకపోతే కివీస్‌కు కష్టాలు తప్పవు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ కూడా అదే తరహా ఫామ్‌లో ఉన్నాడు. టీమ్‌లో నాలుగో స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్న అతను మళ్లీ చెలరేగేందుకు సిద్ధం. కోహ్లి బ్యాటింగ్ గురించి కూడా ఎలాంటి ఆందోళన లేదు. అయితే సగటు అభిమాని రోహిత్ శర్మ నుంచి అతని స్థాయి ఇన్నింగ్స్ ఒకటి ఆశిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో రోహిత్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాని పాండే, జడేజాలు ఈసారి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఆల్‌రౌండర్ దూబేతో మన బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. 20 ఓవర్ల మ్యాచ్‌లో దిగువ స్థాయి వరకు బ్యాటింగ్ అవసరం ఉండకపోవచ్చు కాబట్టి భారత్ బౌలింగ్‌లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా సైనీకి చోటు ఇవ్వవచ్చు. ఇక బుమ్రా, షమీలు తుది జట్టులో ఖాయం కాగా, ఎప్పటిలాగే చహల్, కుల్దీప్లలో ఒకరికే చాన్స్. ఆదుకునేది ఎవరు? ఆతిథ్య న్యూజిలాండ్‌కు మాత్రం ఏదీ అచ్చి రావడం లేదు. తొలి మ్యాచ్‌లో 200కు పైగా భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను అప్పగించిన ఆ జట్టు గత మ్యాచ్‌లో విఫలమైంది. ముఖ్యంగా బుమ్రా నాలుగు ఓవర్లను సమర్థంగా ఎదుర్కోవడం ఆ జట్టుకు పెద్ద సంకటంగా మారింది. మధ్య ఓవర్లలో జడేజా కూడా పూర్తిగా కట్టి పడేస్తుండటంతో పరుగులు సాధించడం అసాధ్యంగా మారింది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసినా రెండో టి20లో ఆ జట్టు కనీస స్కోరు సాధించడంలో విఫలమైంది. బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈసారి కూడా బ్యాటింగ్‌నే కివీస్ నమ్ముకుంది. ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు విలియమ్సన్, టేలర్ జట్టు బ్యాటింగ్ భారం మోయాల్సి ఉంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా కాకుండా పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా నాలుగో స్థానంలో ఆడిన గ్రాండ్‌హోమ్ ఘోరంగా విఫలమయ్యాడు. అతడు తన మెరుపులు చూపిస్తే టీమ్ కోలుకోవచ్చు. ఈ వేదికపై ఆడిన 9 మ్యాచ్‌లలో 7 గెలవడం కివీస్‌కు స్ఫూర్తినిచ్చే అంశం. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పాండే, దూబే, జడేజా, షమీ, బుమ్రా, చహల్, శార్దుల్/సైనీ. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మన్రో, గ్రాండ్‌హోమ్, టేలర్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, సోధి, సౌతీ, బెన్నెట్, టిక్నర్/కుగ్లీన్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. గత ఐదు టి20 మ్యాచ్‌లలో మూడు సార్లు జట్లు 190కి పైగా స్కోర్లు చేశాయి. ఏడాది క్రితం ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో కివీస్ 212 పరుగులు చేసి కూడా కేవ లం 4 పరుగులతోనే భారత్‌పై నెగ్గగలిగింది. వర్ష సూచన లేదు. -
ఆడుతూ... పాడుతూ...
భారత అప్రతిహత విజయాల్లో మరో మ్యాచ్ చేరింది. పరుగుల వరద పారిన తొలి టి20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఇప్పుడు స్వల్ప లక్ష్యాన్నీ అంతే అనాయాసంగా అందుకొని సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా జడేజా, బుమ్రా, షమీ కలిసి తమ పదునైన బౌలింగ్‌తో కివీస్ బ్యాట్స్‌మెన్ రెక్కలు కట్టేయగా... ఆ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న రాహుల్, శ్రేయస్ అయ్యర్ భారత్‌ను సాధికారికంగా గెలిపించారు. గత మ్యాచ్ జరిగిన మైదానమే అయినా ఈసారి పిచ్ భిన్నంగా స్పందించడంతో పరుగులు తీసేందుకు ఇరు జట్లు ఇబ్బంది పడినా... చివరకు సరైన వ్యూహంతో ఆడిన టీమిండియాదే పైచేయి అయింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం మన ఖాతాలో చేరింది. ఆక్లాండ్: ఒక టి20 మ్యాచ్‌లో, అదీ ప్రపంచంలోనే అతి చిన్న మైదానంలాంటి వేదికలో వరుసగా 41 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా బాదకుండా ఇన్నింగ్స్ సాగడం చాలా అరుదు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో, భారత బౌలింగ్ ఎంత చక్కగా పడిందో అనేదానికి ఈ ఉదాహరణ చాలు! పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ సీఫెర్ట్ (26 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. జడేజాకు 2 వికెట్లు దక్కాయి. తన 4 ఓవర్ల కోటాలో జడేజా ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లోకేశ్ రాహుల్ (50 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్సర్లు) మూడో వికెట్‌కు 67 బంతుల్లో 86 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 బుధవారం హామిల్టన్‌లో జరుగుతుంది. ఆకట్టుకున్న బౌలర్లు... పిచ్ క్రమంగా నెమ్మదించే అవకాశం ఉందని భావించిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. శార్దుల్ వేసిన తొలి ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో గప్టిల్ తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. తొలి ఐదు ఓవర్లలో కివీస్ 39 పరుగులు చేసింది. అయితే శార్దుల్ వేసిన చివరి పవర్‌ప్లే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గప్టిల్ ఆఖరి బంతికి వెనుదిరగడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత యజువేంద్ర చహల్, శివమ్ దూబే పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. దాంతో ఒత్తిడికి లోనైన మన్రో (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత జడేజా దెబ్బకు కివీస్ కుదేలైంది. తన తొలి ఓవర్లో గ్రాండ్‌హోమ్ (3)ను అవుట్ చేసిన అతను, మరుసటి ఓవర్లో కీలకమైన కెపె్టన్ కేన్ విలియమ్సన్ (14) వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత పరుగులు రావడమే గగనంగా మారింది. పేరుకు టి20 అయినా బౌండరీలే కనిపించలేదు. ఎట్టకేలకు చహల్ వేసిన 16వ ఓవర్లో న్యూజిలాండ్ కొంత ఊపిరి పీల్చుకుంది. ఈ ఓవర్లో సీఫెర్ట్ వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. 11 పరుగుల వద్ద రాస్ టేలర్ (18) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి వదిలేసినా భారత్‌కు పెద్ద నష్టం జరగలేదు. ధాటిగా పరుగులు చేయాల్సిన చివరి దశలో కూడా భారత బౌలర్ల ధాటికి కివీస్ చేతులెత్తేసింది. ఆఖరి 4 ఓవర్లలో ఆ జట్టు 23 పరుగులే చేయగలిగింది. రోహిత్ విఫలం... తొలి మ్యాచ్‌లాగే మరోసారి రోహిత్ శర్మ నిరాశపర్చాడు. సౌతీ వేసిన మొదటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అనంతరం అదే ఓవర్ చివరి బంతికి రోహిత్ (8) వెనుదిరిగాడు. కోహ్లి (11)ని కూడా చక్కటి బంతితో సౌతీనే బోల్తా కొట్టించాడు. ఈ దశలో మరోసారి రాహుల్, అయ్యర్ జోడి జట్టును ఆదుకుంది. గత మ్యాచ్‌తో పోలిస్తే పిచ్ నెమ్మదిగా ఉండటం, బంతులు సరిగ్గా బ్యాట్ మీదకు రాకపోవడంతో వీరిద్దరు ఆరంభంలో నిలదొక్కుకునేందుకు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో చక్కటి సమన్వయంతో సింగిల్స్‌తో పరుగులు రాబట్టారు. ఒక దశలో ఐదు వరుస ఓవర్లలో ఒకే ఒక ఫోర్ వచ్చింది. అయితే 54 బంతుల్లో విజయానికి 70 పరుగులు కావాల్సిన దశలో ఈ జోడీ దూకుడు పెంచింది. సోధి ఓవర్లో భారీ సిక్సర్‌తో అయ్యర్ అడుగు వేయగా... బెన్నెట్ ఓవర్లో రాహుల్ వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ బాదాడు. అంతకు ముందు ఓవర్లో రాహుల్‌ను రనౌట్ చేసే (42 పరుగుల వద్ద) సునాయాస అవకాశాన్ని టిక్నర్ చేజార్చడంతో కివీస్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. ఆ తర్వాత మరింత చెలరేగి నాలుగు బంతుల వ్యవధిలో రెండు సిక్సర్లు, ఫోర్ బాదిన అయ్యర్ మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. శివమ్ దూబే (4 బంతుల్లో 8 నాటౌట్) కొట్టిన భారీ సిక్సర్‌తో భారత్ విజయం ఖాయమైంది. ఛేదనలో భారత్ చివరి 48 పరుగులను 21 బంతుల్లోనే సాధించడం విశేషం. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) కోహ్లి (బి) శార్దుల్ 33; మన్రో (సి) కోహ్లి (బి) దూబే 26; విలియమ్సన్ (సి) చహల్ (బి) జడేజా 14; గ్రాండ్‌హోమ్ (సి) అండ్ (బి) జడేజా 3; టేలర్ (సి) రోహిత్ (బి) బుమ్రా 18; సీఫెర్ట్ (నాటౌట్) 33; సాన్‌ట్నర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–48; 2–68; 3–74; 4–81; 5–125. బౌలింగ్: శార్దుల్ 2–0–21–1; షమీ 4–0–22–0; బుమ్రా 4–0–21–1; చహల్ 4–0–33–0; దూబే 2–0–16–1; జడేజా 4–0–18–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) టేలర్ (బి) సౌతీ 8; రాహుల్ (నాటౌట్) 57; కోహ్లి (సి) సీఫెర్ట్ (బి) సౌతీ 11; అయ్యర్ (సి) సౌతీ (బి) సోధి 44; దూబే (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–8; 2–39; 3–125. బౌలింగ్: సౌతీ 3.3–0–20–2; బెన్నెట్ 3–0–29–0; టిక్నర్ 3–0–34–0; సాన్‌ట్నర్ 4–0–19–0; సోధి 4–0–33–1. ►1 అంతర్జాతీయ టి20ల్లో న్యూజిలాండ్‌పై భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. ►2 అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్ల జాబితాలో రోహిత్ శర్మను (39 క్యాచ్‌లు) మూడో స్థానానికి నెట్టి కోహ్లి (40 క్యాచ్‌లు) రెండో స్థానానికి ఎగబాకాడు. సురేశ్ రైనా (42 క్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ►ప్రదర్శనపరంగా మాకు ఇది మరో మంచి రోజు. ముఖ్యంగా బౌలింగ్ విభాగం గురించి చెప్పుకోవాలి. మేం అనుకున్న ప్రణాళికను బాధ్యతతో సరిగ్గా అమలు చేసిన బౌలర్లు మ్యాచ్‌ను శాసించారు. కనీసం 160 పరుగులు చేయగలిగే ఈ మైదానంలో 132 పరుగులు చాలా చిన్న స్కోరు. కివీస్‌ను అలా నియంత్రించగలిగాం. దానికి తగిన విధంగానే ఛేదనలో మా బ్యాటింగ్ సాగింది. గ్రౌండ్ పరిమితులు, పిచ్ స్పందిస్తున్న తీరును అర్థం చేసుకొని ఒక కెపె్టన్‌గా నా వ్యూహాలు అమలు చేశాను. జడేజా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్లందరూ తమ వంతు పాత్ర పోషించారు. దీనికి తోడు ఫీల్డింగ్‌లో మా చురుకుదనం బౌలింగ్‌కు అదనపు బలంగా మారిందంటే అతిశయోక్తి లేదు. –కోహ్లి, భారత కెప్టెన్ -
మెరిపించారు...గెలిపించారు
స్టేడియం చిన్నదై ఉండొచ్చేమో కానీ... టీమిండియాకు ఎదురుపడిన లక్ష్యం పెద్దది. గెలవాలంటే ఓవర్‌కు 10 పరుగుల చొప్పున బాదాల్సిందే. సరిగ్గా భారత్ కూడా అదే చేసింది. ఐదో ఓవర్ ముగియక ముందే 50, తొమ్మిదోది పూర్తికాకుండానే వంద, 15వ ఓవర్లోనే 150 ఇలా చకాచకా ఛేదనకు అవసరమైన పరుగుల్ని ఇటుకల్లా పేర్చేసింది. రాహుల్, కోహ్లిలకు దీటుగా ఒత్తిడిలోనూ శ్రేయస్ అయ్యర్ దంచేయడం ఇక్కడ విశేషం. ఆక్లాండ్: భారత బ్యాటింగ్ దళం మెరుపు దాడికి దిగింది. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్ చెల్లాచెదురైంది. లోకేశ్ రాహుల్ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి (32 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ముగ్గురూ ఒకరిని మించి ఒకరు దంచి కొట్టడంతో 200 పైచిలుకు లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలోనే ఛేదించింది. ఇలా న్యూజిలాండ్ పర్యటనకు కోహ్లి సేన ఘనమైన శుభారంభాన్నిచి్చంది. తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (26 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాస్ టేలర్ (27 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), మన్రో (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత భారత్ మరో ఓవర్ మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి విజయం సాధించింది. రేపు ఇదే వేదికపై రెండో టి20 జరుగుతుంది. ఎదురుదెబ్బ పడినా... కివీస్ నిర్దేశించిన లక్ష్యం 204. కొండంత లక్ష్యఛేదనలో ఓపెనింగ్ జోడీ అదరగొట్టాలి. కానీ రెండో ఓవర్లోనే భారత్‌కు ఎదురుదెబ్బ! ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (7) జట్టు స్కోరు 16 వద్దే ఔటయ్యాడు. ఇంకా చేయాల్సింది 188 పరుగులు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇటీవల జోరుమీదున్న రాహుల్‌కు కెపె్టన్ కోహ్లి జతయ్యాడు. ఇద్దరు వేగంగా పరుగులు జతచేశారు. కుదిరినపుడు ఫోర్... బంతి చెత్తగా పడితే సిక్సర్‌తో స్కోరును నడిపించారు. దీంతో భారత్ 4.5 ఓవర్లలోనే 50కి చేరింది. సౌతీ వేసిన ఆ ఐదో ఓవర్లో రాహుల్ వరుసగా 6, 4 బాదాడు. ఆ మిస్సింగ్... పెద్ద టరి్నంగ్! ఆరో ఓవర్ మొదలైంది. రెండో బంతి పడింది. దీన్ని రాహుల్ కవర్స్‌లో ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా సౌతీ చేతికి చిక్కింది. పరుగు తీసేందుకు రాహుల్ ముందుకొచ్చి ఆగి... కెప్టెన్ కోహ్లినీ ఆగమన్నాడు. ఆలోపే కోహ్లి సగం పిచ్‌ను మించే దాటాడు. సౌతీ నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో బంతిని విసరగా వికెట్లను తాకకుండా మిడాన్‌లోకి వెళ్లింది. ఔట్ తప్పదనుకున్న రాహుల్ డీలా పడగా అది మిస్ కావడంతో పరిగెత్తాడు. మిడాన్ నుంచి ఫీల్డ్ అయిన బంతిని మరోసారి వికెట్లకు తాకించడంలో బౌలర్ బెనెట్ విఫలమయ్యాడు. దీంతో 30 సెకన్లలో రెండుసార్లు రాహుల్ రనౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇది తర్వాత విధ్వంసానికి, విజయానికి టరి్నంగ్ అయ్యింది. అయ్యర్ కాదు ఫైర్... అలా బతికి పోయిన రాహుల్ దంచేపనిలో పడిపోయాడు. సాన్‌ట్నర్ వేసిన 8వ ఓవర్లో రాహుల్ 4, 6తో ఫిఫ్టీకి చేరువయ్యాడు. తొమ్మిదో ఓవర్ నాలుగో బంతిని సిక్స్‌గా మలచడంతో అతని అర్ధసెంచరీ 23 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తవడంతో పాటు జట్టు వంద పరుగులు 8.4 ఓవర్లలోనే దాటేసింది. ఆ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రాహుల్ పదో ఓవర్ ఆఖరి బంతికి సౌతీ క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు. సోధికి ఈ వికెట్ దక్కింది. స్వల్ప వ్యవధిలోనే కోహ్లిని టిక్నెర్ ఔట్ చేయడంతో భారత్ సీనియర్లను కోల్పోయింది. ఈ దశలో జట్టును గెలిపించే బాధ్యతని అయ్యర్ తీసుకున్నాడు. సిక్స్, ఫోర్ కొట్టిన దూబే (13)ను సోధి పెవిలియన్ చేర్చడంతో 15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 151/4. గెలవాలంటే 30 బంతుల్లో 53 చేయాలి. పాండే అండతో శ్రేయస్ అయ్యర్... సోధి, బెన్నెట్, సౌతీల బౌలింగ్‌లో విజృంభించాడు. సోధి ఓవర్లో సిక్స్ బాధిన అయ్యర్... బెన్నెట్ వరుస బంతుల్ని బౌండరీలకు తరలించాడు. ఆఖరి 12 బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా... సౌతీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 6, 4 బాదిన అయ్యర్ 26 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆఖరి బంతికి సిక్స్‌తో ముగింపునిచ్చాడు. మన్రో, కేన్, టేలర్ జోరు... అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను దడదడలాడించారు. ఓపెనర్లు గప్టిల్ (19 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), మన్రో తొలి వికెట్‌కు 7.5 ఓవర్లలో 80 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బౌండరీ దగ్గర రోహిత్ అద్భుత క్యాచ్‌తో గప్టిల్ ఆటకు తెరపడింది. ఈ జోడీని శివమ్ దూబే విడగొట్టగా... తర్వాత క్రీజ్‌లోకి వచి్చన కెపె్టన్ విలియమ్సన్ మరింత రెచి్చపోయాడు. మన్రోను శార్దుల్... గ్రాండ్‌హోమ్ (0)ను జడేజా పెవిలియన్ చేర్చారు... కెపె్టన్‌కు జతయిన టేలర్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇద్దరు 25 బంతుల్లోనే అర్ధ శతకాలను పూర్తిచేసుకున్నారు. 15.3 ఓవర్లలో కివీస్ స్కోరు 150కి చేరింది. ఆఖరి ఓవర్లో 200 పరుగులు దాటింది. శార్దుల్, దూబే, జడేజా, బుమ్రా, చహల్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) రోహిత్ (బి) దూబే 30; మన్రో (సి) చహల్ (బి) శార్దుల్ 59; విలియమ్సన్ (సి) కోహ్లి (బి) చహల్ 51; గ్రాండ్‌హోమ్ (సి) దూబే (బి) జడేజా 0; రాస్ టేలర్ (నాటౌట్) 54; సీఫర్ట్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 1; సాన్‌ట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–80, 2–116, 3–117, 4–178, 5–181. బౌలింగ్: బుమ్రా 4–0–31–1, శార్దుల్ 3–0–44–1, షమీ 4–0–53–0, చహల్ 4–0– 32–1, దూబే 3–0–24–1, జడేజా 2–0–18–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) టేలర్ (బి) సాన్‌ట్నర్ 7; రాహుల్ (సి) సౌతీ (బి) సోధి 56; కోహ్లి (సి) గప్టిల్ (బి) టిక్నెర్ 45; శ్రేయస్ (నాటౌట్) 58; దూబే (సి) సౌతీ (బి) సోధి 13; మనీశ్ పాండే (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–16, 2–115, 3–121, 4–142. బౌలింగ్: సౌతీ 4–0–48–0, సాన్‌ట్నర్ 4–0– 50–1, బెన్నెట్ 4–0–36–0, టిక్నెర్ 3–0–34–1, సోధి 4–0–36–2. *ఒకే అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఐదు అర్ధ సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. *అంతర్జాతీయ టి20ల్లో 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కిది నాలుగోసారి. *అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఆరేళ్ల తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అర్ధ సెంచరీ సాధించాడు. చివరిసారి అతడు 2014లో దక్షిణాఫ్రికాపై అర్ధ సెంచరీ చేశాడు. -
ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్..!
స్వదేశంలో ఎన్ని సిరీస్ విజయాలు సాధించినా విదేశీ గడ్డపై భారత క్రికెట్ సాధించే ఘనతలు ఇచ్చే కిక్కే వేరు! సొంతగడ్డపై వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆ్రస్టేలియాలను మట్టికరిపించిన తర్వాత టీమిండియా ఇప్పుడు కివీస్ మైదానాల్లో మరో సవాల్‌కు సిద్ధమైంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి న్యూజిలాండ్‌లో మన టీమ్ సుదీర్ఘంగా పర్యటిస్తూ మూడు ఫార్మాట్లలో కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతోంది. ఈ ఏడాది అక్టోబరులో టి20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టు సన్నాహకాలకు, కూర్పు నిర్ణయించేందుకు పొట్టి ఫార్మాట్లో రాబోయే మ్యాచ్‌లన్నీ కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో భారత్ బయట తొలి సమరానికి కోహ్లి సేన సై అంటోంది. వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత కివీస్‌తో భారత్ తలపడం ఇదే తొలిసారి. ఆక్లాండ్: భారత క్రికెట్ జట్టు తమ టి20 చరిత్రలో ఎన్నడూ ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఇప్పుడు తొలిసారి న్యూజిలాండ్‌తో అలాంటి పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇటీవల స్వదేశంలో వరుస విజయాలతో టీమిండియా అమితోత్సాహంతో కనిపిస్తుండగా, కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో పాటు కీలక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్న కివీస్ స్వదేశంలో కోలుకోవాలని పట్టుదలగా ఉంది. గత ఏడాది ఇదే కివీస్ పర్యటనలో భారత్ టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. రాహుల్‌కే కీపింగ్! భారత జట్టు తమ ఆఖరి టి20 మ్యాచ్‌లో ఇటీవల శ్రీలంకతో పుణేలో ఆడింది. నాటి మ్యాచ్ తుది జట్టును చూస్తే పెద్దగా మార్పులు అవసరం లేకుండానే టీమ్ ఇక్కడా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. రోహిత్ శర్మతో పాటు రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. కోహ్లి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాహుల్ కీపర్‌గా నిలదొక్కుకున్నాడు కాబట్టి అదే వ్యూహాన్ని కొనసాగించవచ్చు. కోహ్లి, అయ్యర్, మనీశ్ పాండేలు ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. అయితే స్వదేశంలో ఐదుగురు బౌలర్లతోనే ఆడిన భారత ఈసారి ఆరో బౌలర్‌ను ఎంచుకునే అవకాశం కనపిస్తోంది. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే బరిలోకి దిగితే అతని బౌలింగ్ ఇక్కడి పిచ్‌లపై పనికొస్తుంది కూడా. అప్పుడు పంత్‌కు మరోసారి నిరాశ తప్పదు. ఏడో స్థానంలో జడేజా లేదా సుందర్‌లో ఒకరినే ఎంచుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. భారత జట్టు ఇటీవలి ఫామ్ ప్రకారం చూస్తే వేదిక విదేశీ గడ్డ అయినా పెద్దగా ఇబ్బంది పడటం లేదు. అన్ని రంగాల్లో ప్రత్యరి్థకంటే మనదే పైచేయిగా కనిపిస్తోంది. స్వదేశంలో పటిష్టంగా... బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ...ముగ్గురు అగ్రశ్రేణి పేస్ బౌలర్లు గాయాలతో ఈ సిరీస్‌కు దూరం కావడంతో న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ పదును తగ్గింది. దాంతో హామిష్ బెన్నెట్లాంటి బౌలర్లను ఆ జట్టు తిరిగి పిలవాల్సి వచి్చంది. స్కాట్ కుగెలిన్ కూడా ఏమాత్రం ప్రభావం చూపగలడనేది సందేహమే. అయితే సౌతీ లాంటి వెటరన్ చెలరేగిపోగలడు. ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని కూడా కివీస్ భావిస్తోంది. సాన్‌ట్నర్, సోధిలకు భారత్‌పై మంచి రికార్డే ఉంది. బ్యాటింగ్‌లో అందరూ అనుభవజు్ఞలైనవారే ఉండటం కివీస్ బలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్వదేశంలో గప్టిల్ ఎప్పుడైనా ప్రమాదకారినే. కెపె్టన్ విలియమ్సన్, మరో సీనియర్ రాస్ టేలర్‌ల ఆటపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ కూడా చెలరేగిపోగలడు. యువ జట్లు కూడా... అండర్–19 ప్రపంచ కప్‌లో పోరు బ్లూమ్‌ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): ఒక వైపు భారత్, న్యూజిలాండ్ సీనియర్ జట్లు టి20 పోరులో తలపడుతుండగా ప్రపంచానికి మరో మూలన ఇవే జట్ల కుర్రాళ్లు అమీతుమీకి సిద్ధమయ్యారు. అండర్–19 ప్రపంచకప్‌లో భాగం గా నేడు గ్రూప్ ‘ఎ’లో భారత్, కివీస్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు శ్రీలంక, జపాన్లపై విజయాలతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో చోటు సంపాదించుకోగా, కివీస్ కూడా క్వార్టర్స్ చేరింది. టీమిండియాలో కుర్రాళ్లంతా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం విశేషం. కివీస్ గడ్డపైనే...: భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య నేడు రెండో అనధికారిక వన్డే క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పాండే, దూబే, జడేజా/ సుందర్, కుల్దీప్, షమీ, బుమ్రా, సైనీ న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, సీఫెర్ట్, టేలర్, గ్రాండ్‌హోమ్,సాన్‌ట్నర్, సోధి, సౌతీ, కుగెలీన్, బెన్నెట్ పిచ్, వాతావరణం ఈడెన్ పార్క్ మైదానం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. మరీ చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయం. ఇటీవల కివీస్–ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా ఇదే కనిపించింది. అయితే వాతావరణంతో మాత్రం సమస్యే. మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. పూర్తిగా కాకపోయినా ఏదో ఒక దశలో అంతరాయం కలిగించవచ్చు. ►‘న్యూజిలాండ్ జట్టుతో ప్రతీకారమా? అసలు అలాంటి ఊహ కూడా మాకు రాదు. ఒక వేళ ప్రతీకారంగా భావించాలని అనుకున్నా ఇలాంటి మంచి జట్టుతో అలా చేయలేం. కివీస్ జట్టు సభ్యులందరితో మేం చాలా బాగా కలిసిపోతాం’ – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
డ్రయర్‌తో ఆరబెట్టి.. ఐరన్ బాక్స్‌తో ఇస్త్రీ చేశారు!
అందరూ అనుకున్నట్లుగా టి20 ప్రపంచకప్ ఏడాది భారత్ తొలి అడుగు మెరుపులతో పడలేదు. ప్రత్యర్థి శ్రీలంక కోరుకున్నట్లుగా ఆతిథ్య జట్టు పరాజయం పాలవ్వలేదు. ఎవరూ ఊహించనట్లుగా చినుకులు మైదానాన్ని ముంచెత్తాయి. కప్పి ఉంచిన కవర్లకేమో చిల్లులు పడ్డాయి. అసలు ఒక్కబంతి అయినా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. గువాహటి: టాస్ పడనైతే పడింది... కానీ బంతి పడలేదు. బ్యాట్ బరిలోకే దిగలేదు! 2020లో తొలి టి20 మెరుపులపై... అభిమానుల ఆసక్తిపై నీళ్లు చల్లుతూ వరుణుడు ముంచెత్తాడు. దీంతో భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇక్కడి బర్సపర అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరగాల్సిన తొలి టి20 మ్యాచ్ రద్దయ్యింది. అస్సాం క్రికెట్ అసోసియేషన్ నిర్వాకం కూడా ఈ రద్దులో ఓ భాగమైంది. చిల్లులున్న కవర్లతో పిచ్‌ను కప్పి ఉంచగా... కురిసిన నీరు కురిసినట్లుగా పిచ్‌లోకి ఇంకింది. దీంతో తడిసి ముద్దయిన పిచ్‌పై మ్యాచ్ అసాధ్యమని అంపైర్లు తేల్చేశారు. టి20ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో, రాష్ట్ర క్రికెట్ సంఘంపై అసంతృప్తితో భారంగా మైదానం వీడారు. మంగళవారం ఇండోర్‌లో రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఆసక్తిగా స్టేడియానికొస్తే... విజయంతో ఈ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభిద్దామని ఇటు టీమిండియా... ఎంతో ఆసక్తిగా ప్రత్యక్షంగా మెరుపుల మ్యాచ్ చూడాలని అటు అభిమానులు స్టేడియానికి వస్తే... అకాల వర్షం అమాంతం ముంచెత్తింది. టాస్ వేశాక... ఆటగాళ్లు బ్యాట్‌తో మెరుపులు మెరవాల్సిన చోట వరుణుడు చినుకులు కురిపించాడు. దీంతో ఎంతసేపటికీ ఆట మొదలేకాలేదు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ అయిన జరుగుతుందని ప్రేక్షకులు వర్షంలో తడుస్తూ ఎదురుచూసినా... స్టేడియం సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ ముచ్చటా తీరలేదు. అంపైర్లతో అసహనం వ్యక్తం చేస్తున్న కోహ్లి స్టేడియం సిబ్బంది చిల్లులు పడిన కవర్లను పిచ్‌పై కప్పేసింది. అదేమో వాననీటితో తడిపేసింది. ఈ నిర్లక్ష్యం ఓ మ్యాచ్‌నే నష్టపరచలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో ధనం, పలుకుబడి ఉన్న బీసీసీఐ పరువును గంగలో కలిపేసింది. మరీ చౌకబారుగా స్టేడియం సిబ్బంది శ్రమించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. హెయిర్ డ్రయర్ (వెంట్రుకలను ఆరబెట్టే మెషిన్)తో, బట్టలను ఇస్త్రీ చేసుకునే ఐరన్ బాక్స్‌లతో పిచ్‌ను ఆరబెట్టే పనిచేయడం అస్సాం క్రికెట్ సంఘాన్ని నవ్వుల పాలు చేసింది. దండిగా డబ్బులున్నా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురించి ఎప్పుడు చెప్పుకున్నా... తొలి మాట అత్యంత ధనవంతమైన బోర్డు అనే. ఇంతటి సుసంపన్నమైన బోర్డుకు అనుబంధమైన రాష్ట్ర సంఘంలో ఇదేం దుస్థితి అనే విమర్శలు వెల్లువెత్తాయి. చాలా ఏళ్లుగా బోర్డు రాష్ట్ర సంఘాలన్నింటికీ విరివిగా నిధులు పంపిణీ చేస్తోంది. ఇవి ఏ వేలల్లో... లక్షల్లో కాదు ఏకంగా కోట్లలోనే నిధులిస్తుంది. అంత పెద్ద మొత్తంలో నిధులు అందుకునే క్రికెట్ సంఘం వద్ద పిచ్‌ను కప్పే నాణ్యమైన కవర్లే ఉండవా అనేది కొన్ని కోట్ల మెదళ్లను తొలిచే ప్రశ్న. హెయిర్ డ్రయర్‌తో పిచ్‌ను ఆరబెడుతున్న వ్యక్తికి కోహ్లి సూచనలు అస్సాం సంఘం తీరు మరీ ఇంత అధ్వాన్నంగా ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. మ్యాచ్‌ను నిర్వహిస్తే క్రికెట్ అభిమానులకు వినోదమే కాదు... ప్రకటనల రూపేణా ప్రసారకర్తకు, టికెట్లు, గ్రౌండ్ రైట్స్ రూపంలో రాష్ట్ర సంఘానికి కోట్లలో డబ్బు వచ్చేది. ఇప్పుడు ఒక్క బంతి అయిన పడకపోవడంతో అమ్ముకున్న టికెట్ల డబ్బును కూడా తిరిగి చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిక్కచ్చిగా వ్యవహరించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మాత్రం కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ మ్యాచ్ నిర్వహణ ఉండనే ఉండదు. అదే జరిగితే అస్సాం క్రికెట్ సంఘం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. -
కొత్త ఏడాది...పాత ప్రత్యర్థి!
భారత్ వర్సెస్ శ్రీలంక! సగటు క్రికెట్ అభిమానికి ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ‘మళ్లీ వచ్చిందా’... అనిపించడం ఇటీవల చాలా సహజంగా మారిపోయింది. స్వదేశమైనా, ప్రత్యర్థి మైదానమైనా, లేక తటస్థ వేదిక అయినా ఈ రెండు జట్లు తరచుగా తలపడుతుండటంతో ఫ్యాన్స్‌కు కూడా ఇలాంటి మ్యాచ్‌పై కొంత ఆసక్తి తగ్గిందనడంలో తప్పు లేదు. ఇప్పుడు మరోసారి అదే పాత ప్రత్యర్థి పోరుతోనే కొత్త ఏడాదిని మొదలు పెట్టేందుకు భారత్ సన్నద్ధమైంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఖరారు కాని ఈ సిరీస్ అనూహ్యంగా టీమిండియా షెడ్యూల్లో వచ్చి చేరింది. టి20 వరల్డ్ కప్ ఏడాది అయిన 2020లో కోహ్లి సేన విజయంతో శుభారంభం చేస్తుందా చూడాలి. గువాహటి: కొంత విరామం, కొత్త సంవత్సరం వేడుకలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. ‘మిషన్ 2020’ అంటూ ఈ ఏడాది టి20 ప్రపంచ కప్ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా అదే ఫార్మాట్‌తో బోణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడి బర్సపర స్టేడియంలో నేడు జరిగే తొలి టి20లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు సంబంధించి గత కొన్నాళ్లుగా ఇక్కడ జరుగుతున్న నిరసనలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ నిర్వహణ సాఫీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. బుమ్రా పునరాగమనం... గత కొంతకాలంగా శ్రీలంకతో సిరీస్‌లకు తమ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ వచి్చన భారత్ ఈసారి కూడా దానిని పాటించింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. దాంతో రాహుల్‌తో పాటు సీనియర్ శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయనున్నాడు. గాయాలు, ఫామ్‌లేమితో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ధావన్‌కు ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కాలంటే ఇప్పటి నుంచే పలువురు ఆటగాళ్లు తమ సత్తాను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇటీవల వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో ఆడిన తుది జట్టుతో పోలిస్తే ఎక్కువ మార్పులకు అవకాశం లేదు. కోహ్లి, అయ్యర్, పంత్‌లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. వీరికి శివమ్ దూబే జత కలిస్తే భారత్ భారీ స్కోరును అడ్డుకోవడం ప్రత్యరి్థకి కష్టమైపోతుంది. జడేజా బ్యాటింగ్ కూడా జట్టుకు అదనపు బలం. అన్నింటికన్నా చెప్పుకో వాల్సింది బుమ్రా పునరాగమనం గురించే. ఆగస్టులో వెస్టిండీస్‌తో కింగ్స్టన్ టెస్టు తర్వాత గాయంతో స్వదేశంలో జరిగిన మూడు సిరీస్‌లకు దూరమైన బుమ్రా తిరిగి మైదానంలోకి వస్తున్నాడు. బుమ్రా రాకతో భారత బౌలింగ్ బలం పెరిగిపోగా... తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు కూడా అతనికి ఇది మంచి అవకాశం కానుంది. రాత మారేనా! 2014 టి20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. ఇది మినహాయిస్తే గత దశాబ్ద కాలం లో ఆ జట్టు ఏ దశలోనూ భారత్‌ను ఇబ్బంది పెట్టలేకపోయింది. టీమిండియా ఎదురుగా లంక బలహీనంగా మారిపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే 2008 జులై తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో (మూడు ఫార్మాట్లలో కలిపి) ఒక్కదాంట్లో కూడా లంక గెలవలేదు. అటు టి20 కెపె్టన్‌గా మలింగ రికార్డు పేలవం గా ఉంది. అతని సారథ్యంలో ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఓడితే ఒకటే గెలిచింది! ఈ నేపథ్యంలో పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు. ఇటీవల పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై టి20 సిరీస్‌లో ఓడించిన లంక... కొద్ది రోజులకే ఆ్రస్టేలియాలో పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసింది. అయితే ఈ ఫార్మాట్లో ఒకటి, రెండు సంచలన ప్రదర్శనలకు కూడా జట్టు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి లంక అలాంటి అద్భుతాన్ని ఆశిస్తోంది. నాలుగు రోజుల టెస్టులకు ‘నో’... టి20 తుది జట్టును ఎంచుకోవడంలో మాకెప్పుడూ సమస్య లేదు. ఐపీఎల్లో అందరూ బాగా ఆడేవారే. ప్రతీ ఒక్కరు అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధం అన్నట్లుగానే ఉంటారు. వీరిలోంచి జట్టు అవసరాలకు అనుగుణంగా ఆ సమయంలో ఎవరు సరిపోతారో ఎంచుకుంటే చాలు ప్రపంచ కప్ టీమ్ రెడీ అయినట్లే. ఒత్తిడి సమయంలో ఎవరు రాణించగలరో రాబోయే సిరీస్‌లలో తెలుస్తుంది. ముఖ్యంగా టాపార్డర్‌పైనే ఆధారపడకుండా ఆరు, ఏడు స్థానాల్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి బాగా ఆడగలిగే వారుంటేనే ఐసీసీ టోర్నీలో విజయాలు లభిస్తాయి. మా పేస్ బౌలర్లలో అందరికీ ఒక్కో ప్రత్యేకత ఉంది కాబట్టి ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం భారత్‌కు మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నట్లే. ఇటీవల టెస్టులను నాలుగు రోజులకు పరిమితం చేయాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. నేను దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు నాలుగు రోజులంటారు. ఆ తర్వాత మూడు రోజులు కావాలంటారు. ఆపై టెస్టులకు ఆదరణ తగ్గిందంటే ఏం చెబుతాం. నా అభిప్రాయం ప్రకారం క్రికెట్‌కు మూలంలాంటి ఫార్మాట్‌ను మనం కదిలించవద్దు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి నేను ఎలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. ప్రతీ అంశంపై రెండు వర్గాల నుంచి భిన్నమైన వాదనలు ఉంటాయి. మనం ఒకటి చెబితే ఇంకొకరు మరొకటి చెప్పవచ్చు. కాబట్టి దీనిపై పూర్తి సమాచారం, అవగాహన లేకుండా ఏమీ మాట్లాడను. –కోహ్లి, భారత కెప్టెన్ తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, దూబే, జడేజా, సుందర్, కుల్దీప్/ చహల్, శార్దుల్, బుమ్రా. శ్రీలంక: మలింగ (కెపె్టన్), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, కుశాల్ పెరీరా, మాథ్యూస్, షనక, ఉడాన, హసరంగ, లహిరు కుమార/రజిత. పిచ్, వాతావరణం మంచి బ్యాటింగ్ వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. గత వారం రోజులుగా గువాహటిలో వర్షాలు కురిసినా ఇప్పు డు ఆగిపోవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడకపోవచ్చు. -
హడలెత్తించిన కరీమ్
లక్నో: అఫ్గానిస్తాన్ మీడియం పేస్ బౌలర్ కరీమ్ జనత్ (5/11) రెచ్చిపోయాడు. దీంతో రెండో టి20లో అఫ్గానిస్తాన్ 41 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలుపొంది సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత అఫ్గాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. కరీమ్ (26; 5 ఫోర్లు), హజ్రతుల్లా (26; 3 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం విండీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. కరీమ్ బంతులకు విండీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆల్‌రౌండ్ షోతో మురిపించిన కరీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. చివరి టి20 ఆదివారం జరుగుతుంది. -
దీప్తి సూపర్ బౌలింగ్
సూరత్: ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ (3/8) అద్భుత ప్రదర్శనకు తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమైన టి20 సిరీస్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టి20లో భారత్ 11 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. స్మృతి మంధాన (21), జెమీమా రోడ్రిగ్స్ (19) ఫర్వాలేదనిపించారు. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం షెఫాలీ వర్మ (0) ఖాతా తెరవకుండానే ఔటయింది. షబ్నిమ్ ఇస్మాయిల్ (3/26), నడైన్ డిక్లెర్క్ (2/10) వరుసగా వికెట్లు పడగొట్టడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా... మిగ్నాన్ డు ప్రీజ్(43 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాయంతో చివరి వరకు పోరాడింది. 3 బంతుల్లో 12 పరుగులు అవసరమైన స్థితిలో డు ప్రీజ్, ఎంలాబా (0)లను ఔట్ చేసిన రాధా యాదవ్ భారత్‌కు విజయాన్ని ఖాయం చేసింది. పూనమ్ యాదవ్ (2/25), రాధా యాదవ్ (2/29), పేసర్ శిఖా పాండే (2/18) ఆకట్టుకున్నారు. ►2 భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన రెండో పిన్న వయసు్కరాలిగా షఫాలీ వర్మ (15 ఏళ్ల 239 రోజులు) గుర్తింపు పొందింది. గతంలో గార్గి బెనర్జీ 14 ఏళ్ల 162 రోజుల వయసులో (1978లో) భారత్‌కు వన్డేలో ప్రాతినిధ్యం వహించింది. -
మ్యాచ్ జరిగే అవకాశాలు 50–50..!!
భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరిగిన గత టి20 సిరీస్‌లలో కనీసం ఒక్క మ్యాచ్‌నైనా అడ్డుకున్న వరుణుడు... ఈసారి గరిష్టంగా రెండు మ్యాచ్‌లను దెబ్బకొట్టేలా ఉన్నాడు. ఇప్పటికే ధర్మశాల తొలి టి20 వాన కారణంగా రద్దవగా... ఆదివారం బెంగళూరులో జరగాల్సిన మూడో మ్యాచ్‌కూ వాన ముప్పు పొంచి ఉంది. శనివారం ఇక్కడి వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం మ్యాచ్ జరిగే అవకాశాలు 50–50నే అన్నట్లున్నాయి. పూర్తిగా రద్దయిన పక్షంలో 1–0 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌ను గెల్చుకుంటుంది. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో భారత్ నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడగా... రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడిపోయింది. బెంగళూరు: వచ్చే ఏడాది జరుగనున్న టి20 ప్రపంచ కప్‌నకు సమాయత్తం అవుతూ, అందుకుతగ్గ యువ ఆటగాళ్లను పరీక్షించే ప్రయత్నంలో ఉన్న టీమిండియా... రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను అలవోకగానే ఓడించింది. బెంగళూరులో ఆదివారం జరిగే మూడో టి20లోనూ ఇదే జోరును ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా సంపూర్ణ ఆధిపత్యంతో టెస్టు సిరీస్‌కు వెళ్లాలని భావిస్తోంది. బలాబలాలరీత్యా కోహ్లి సేన ముందు సఫారీలు నిలవడం కష్టమే. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ మ్యాచ్‌కు రెండు జట్లు చెరో మార్పుతో బరిలో దిగనున్నాయి. మార్పు ఆ ఒక్కటేనా? భారత్ ఈ మ్యాచ్‌లో ఎడంచేతి వాటం స్పిన్నర్ కృనాల్ పాండ్యా స్థానంలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్‌ను ఆడించొచ్చు. బౌండరీలు చిన్నవి కాబట్టి ఒక స్పిన్నర్‌ను తగ్గించుకుని ఖలీల్ అహ్మద్‌ను మూడో పేసర్‌గా ఎంచుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నా ఇందుకు ఆస్కారం తక్కువే. ఈ మైదానంలో 2018 నుంచి పేసర్లు ఓవర్‌కు సగటున 9.8 పరుగులిస్తే... స్పిన్నర్లు 8.1 చొప్పునే ఇచ్చారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలాగూ మూడో పేసర్‌గా పనికొస్తాడు. ప్రత్యర్ధి బలహీనతల దృష్ట్యా చూసినా టీమిండియా స్పిన్‌పైనే ఎక్కువ ఆధారపడుతుంది. టాప్ –3లో ధావన్ ఫామ్‌లోకి రావడం ఆందోళన తగ్గించింది. తోడుగా రోహిత్, కోహ్లి చెలరేగితే సఫారీ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. సఫారీ... గెలవాలంటే సవాలే! భారత్‌పై అదీ భారత్‌లో నెగ్గాలంటే సహజంగానే ఏ జట్టయినా అసాధారణంగా ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దక్షిణాఫ్రికా దీనికిమించి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. తొలి టి20లో కెపె్టన్ డికాక్ ఒక్కడే పరిస్థితులకు తగ్గట్లు ఆడాడు. బవుమా మొదట ఫర్వాలేకున్నా చివర్లో వేగం చూపలేకపోయాడు. ఓపెనర్ హెన్డ్రిక్స్, మిడిలార్డర్లో డసెన్, మిల్లర్ ధాటిగా బ్యాటింగ్ చేస్తేనే టీమిండియాకు భారీ లక్ష్యాన్ని విధించగలుగుతుంది. నోర్టెను పక్కనపెట్టి... టి20ల్లో రోహిత్‌ను మూడుసార్లు ఔట్ చేసిన రికార్డున్న పేసర్ డాలాను తీసుకోనున్నారు. ప్రధాన పేసర్ రబడ తొలి మ్యాచ్‌లో కనీస ప్రభావం చూపలేదు. మిగతా బౌలర్ల సంగతి వదిలేస్తే ఈ మ్యాచ్‌లో అతడు సత్తా చాటితేనే జట్టు పోటీ ఇవ్వగలుగుతుంది. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెపె్టన్), అయ్యర్, పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా/రాహుల్ చహర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, నవదీప్ సైనీ. దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), హెన్డ్రిక్స్, డసెన్, బవుమా, మిల్లర్, ఫెలూక్వాయో, ప్రిటోరియస్, ఫార్చూన్, రబడ, డాలా, షమ్సీ. పంత్.. నిర్భీతి నుంచి నిర్లక్ష్యానికి ఇప్పుడు అందరి కళ్లూ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పైనే. భయం లేకుండా ఆడతాడన్న మంచి పేరుతో జట్టులోకి వచి్చన అతడు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటున్నాడన్న చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. వన్డే ప్రపంచ కప్ సెమీస్, విండీస్ పర్యటన, రెండో టి20లో పరిస్థితులను గ్రహించకుండా పంత్ కొట్టిన షాట్లు; ఔటైన తీరు విమర్శలకు తావిచ్చాయి. శ్రేయస్ అయ్యర్‌ను కాదని మరీ నంబర్–4లో దింపుతూ ప్రతిభ చాటేందుకు మంచి వేదిక సిద్ధం చేస్తున్నా పంత్ సది్వనియోగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో సంజు సామ్సన్ వంటివారి పేర్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి శ్రేయస్ అయ్యర్ ఉన్నందున పంత్‌ను ఐదో స్థానంలో దింపడమే జట్టుకు ఉపయోగకరం. జట్టు్ట మేనేజ్మెంట్ మాత్రం మరోలా ఆలోచిస్తూ అతడిని ముందుకు పంపుతోంది. ఇది చివరకు పంత్ కెరీర్‌కే ఇబ్బందిగా మారేలా ఉంది. -
కోహ్లి కొడితే... మొహాలీ మనదే...
విరాట్ కోహ్లి విరచిత మరో విజయం... మొహాలీలో తాను ఆడిన గత టి20 మ్యాచ్‌లో అద్భుతం చేసిన కోహ్లి బుధవారం అదే వేదికపై మరోసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు... బ్యాటింగ్‌లో కోహ్లికి తోడు ధావన్ రాణించడంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. సాధారణ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టీమిండియా బౌలర్ల సమష్టి ప్రదర్శనకు నిలవలేక దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో భారత్‌కు గెలుపు సులువైంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై భారత్‌కిదే తొలి టి20 విజయం కావడం విశేషం. మొహాలీ: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భారత్ బోణీ చేసింది. ఇక్కడ జరిగిన రెండో టి20లో 7 వికెట్లతో సఫారీలను చిత్తు చేసి 1–0తో ఆధిక్యం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ డి కాక్ (37 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... బవుమా (43 బంతుల్లో 49; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. దీపక్ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (52 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... ధావన్ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఆదివారం బెంగళూరులో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... రెండో వికెట్‌కు 45 బంతుల్లో 57 పరుగులు... డి కాక్, బవుమా మధ్య సాగిన ఈ భాగస్వామ్యం మినహా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో చెప్పుకోవడానికేమీ లేదు. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సఫారీ బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కోలేకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. పవర్‌ప్లేలో దక్షిణాఫ్రికా 39 పరుగులు చేయగలిగింది. ఆరు బంతుల వ్యవధిలో డి కాక్, వాన్ డర్ డసెన్ (1) డగౌట్ చేరడంతో సఫారీ జట్టు భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. సైనీ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు సహా 16 పరుగులు రావడంతో దక్షిణాఫ్రికా 150 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించగలిగింది. కోహ్లి అలవోకగా... ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (12) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నోర్టే వేసిన రెండో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతను అదే స్కోరు వద్ద ఫెలుక్వాయో బౌలింగ్‌లో ఎల్బీగా దొరికిపోయాడు. అయితే ధావన్, కోహ్లి అలవోకగా షాట్లు ఆడుతూ స్కోరును చకచకా పరుగెత్తించారు. రబడ ఓవర్లో ధావన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, ప్రిటోరియస్ బౌలింగ్‌లో కోహ్లి ఆకట్టుకునే సిక్సర్‌తో అలరించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 47 బంతుల్లో 61 పరుగులు జోడించిన తర్వాత ధావన్ అవుటయ్యాడు. అనంతరం రిషభ్ పంత్ (4) మరో పేలవ షాట్‌కు వెనుదిరిగి తనపై విమర్శలకు మళ్లీ అవకాశం కలి్పంచాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో 40 బంతుల్లో అతని 22వ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా రెండు భారీ సిక్సర్లు బాదిన కోహ్లి... అయ్యర్ (16 నాటౌట్) తోడుగా ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. జెర్సీ నంబర్ మారింది! కెరీర్ ఆరంభం నుంచి శిఖర్ ధావన్ జెర్సీ నంబర్ 25గానే ఉంది...దానిని అదృష్ట సంఖ్యగా చెబుతూ కొనసాగిస్తూ వచ్చాడు. అతడి ట్విట్టర్ అకౌంట్ కూడా Sdhawan 25గా కనిపిస్తుంది. బుధవారం మ్యాచ్‌లో మాత్రం 42 నంబర్ జెర్సీతో బరిలోకి దిగాడు. టెస్టు జట్టులో ఇప్పటికే చోటు కోల్పోయిన శిఖర్...గాయంతో వన్డే వరల్డ్కప్నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. విండీస్‌తో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కూడా అతను విఫలమయ్యాడు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా అతని స్థానంపై సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అదృష్టం మార్పును కోరుకుంటూ అతను ఏదైనా సంఖ్యాశాస్త్రం ప్రకారం 42కు మారినట్లుగా చెబుతున్నారు! సూపర్ క్యాచ్‌లు... సఫారీ ఇన్నింగ్స్‌లో డి కాక్ ఇచి్చన క్యాచ్‌ను కెప్టెన్ విరాట్ అందుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. సైనీ బౌలింగ్‌లో డి కాక్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి బౌలర్ తల మీదుగా పైకి లేచింది. అటు వైపు దగ్గరలో కూడా లేని కోహ్లి మిడాఫ్నుంచి అనూహ్య వేగంతో దూసుకొచ్చాడు. బంతి కింద పడిపోతున్న దశలో ఎడమ చేతితో అద్భుత రీతిలో దానిని అందుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ధావన్ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్ అద్భుతంగా అందుకున్న తీరుకు కూడా అంతే స్థాయిలో ప్రశంసలు దక్కాయి. బౌండరీ వద్ద ఏ మాత్రం అవకాశం లేని చోట మిల్లర్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. -
41బంతుల్లో సెంచరీ
డబ్లిన్: స్కాట్లాండ్ ఓపెనర్ హెన్రీ జార్జ్ మున్సే టి20 క్రికెట్లో రికార్డులతో అదరగొట్టాడు. ముక్కోణపు టి20 టోరీ్నలో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మున్సే 41 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో మున్సే 56 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో మున్సే రెండో స్థానంలో నిలిచాడు. మున్సే, కెపె్టన్ కోయిట్జర్ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. ఇది ఏ వికెట్ౖకైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. వీరిద్దరి ధాటికి స్కాట్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. మున్సే రికార్డులు ►41 బంతులు: ఫాస్టెస్ట్ సెంచరీ జాబితాలో రెండో స్థానం. డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), రోహిత్ శర్మ (భారత్), సుదేశ్ విక్రమశేఖర (చెక్ రిపబ్లిక్) 35 బంతుల్లోనే సెంచరీ సాధించారు. ►14 సిక్సర్లు: ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌లో రెండో స్థానం. గతంలో హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) 16 సిక్సర్లు కొట్టగా... ఫించ్ కూడా 14 సిక్సర్లు బాదాడు. ►32 పరుగులు: మ్యాక్స్ ఒ డౌడ్ వేసిన ఒక ఓవర్లో మున్సే 32 పరుగులు (6,4,4,6,6,6) కొట్టాడు. యువరాజ్ సింగ్ (36) తర్వాత ఒక ఓవర్లో బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే. గతంలో మరో మూడు సందర్భాల్లో ఒకే ఓవర్లో 32 పరుగులు వచ్చినా...అవి ఒకే బ్యాట్స్‌మన్ చేయలేదు. -
వాన ముంచెత్తింది
ధర్మశాల: భారత్–దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా... వరుణుడి చుట్టపు చూపు పలకరింపు తప్పదేమో! ఔను మరి... రికార్డులు ఇదే విషయం చెబుతున్నాయి. గత మూడు సిరీస్ (2011–12, 2015–16, 2017–18)లలో ఏదో ఒక మ్యాచ్‌నైనా అడ్డుకున్న వర్షం వరుసగా నాలుగో సిరీస్‌లోనూ నేనున్నానంటూ వచ్చేసింది. దీంతో ఆదివారం ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టి 20 రద్దయింది. మధ్యాహ్నం నుంచే వాతావరణం మేఘావృతమై ఉండగా... సాయంత్రానికి వాన మొదలైంది. అంపైర్లు పిచ్‌ను తనిఖీ చేయాల్సిన పని లేకుండా, ఔట్ ఫీల్డ్‌ను పదేపదే పరిశీలించాల్సిన అవసరం రానంతగా తెరపి లేకుండా కురిసింది. దీంతో కనీసం టాస్ కూడా పడలేదు. తుది జట్ల ప్రకటన సైతం చేయలేదు. మైదానంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా, ఆటకు ఏమాత్రం వీలుకానంతగా వర్షం పటడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. మ్యాచ్ ప్రారంభ సమయం (రాత్రి గం.7) నుంచి 50 నిమిషాలు వేచి చూసిన అనంతరం ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి తెలిసిపోయిన ప్రేక్షకులు అంతకు అరగంట ముందు నుంచే స్టేడియం నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఈ నెల 18న బుధవారం మొహాలీలో జరుగనుంది. కుర్రాళ్లకు నాలుగైదు అవకాశాలే: కోహ్లి వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని... లభించిన నాలుగైదు అవకాశాల్లోనే తమను తాము నిరూపించుకోవాలని జట్టులోని కుర్రాళ్లకు టీమిండియా కెపె్టన్ విరాట్ కోహ్లి సూచించాడు. కెరీర్ ఆరంభంలో తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని అతడు చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచ కప్ ముందు మాకు గరిష్టంగా 30 మ్యాచ్‌లున్నాయి. ప్రస్తుతం తీవ్ర పోటీ వాతావరణంలో ఉన్నాం. అందుకని కాసిన్ని అవకాశాలనే ఒడిసిపట్టాలి. వాస్తవానికి వీటిని తక్కువనే భావించాలి. అరంగేట్రం సమయంలో నేను కూడా పదిహేను చాన్సులు వస్తాయని భావించలేదు. ఇప్పుడు జట్టులోనూ ఇదే మనస్తత్వం ఉంది. దీనిని తెలుసుకుని రాణించినవారే నిలవగలుగుతారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఓవైపు టి20 ప్రపంచ కప్‌నకు సన్నద్ధమవుతూనే టెస్టు చాంపియన్íÙప్ పైనా దృష్టిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో జట్టును పటిష్ట పరిచే దిశగా, విజయాలు సాధించే విధంగా యువకులను సమయానుకూలంగా పరీక్షిస్తామని చెప్పుకొచ్చాడు. -
‘7 బంతుల్లో 7 సిక్సర్లు’
ఢాకా:ముక్కోణపు టి20 టోరీ్నలో అఫ్గానిస్తాన్ 28 పరుగులతో జింబాబ్వేను చిత్తుచేసింది. ముందుగా అఫ్గాన్ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (30 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మొహమ్మద్ నబీ (18 బంతుల్లో 38; 4 సిక్సర్లు) చెలరేగి 51 బంతుల్లో 107 పరుగులు జోడించారు. వీరిద్దరు కలిసి ఒక దశలో వరుసగా 7 బంతుల్లో 7 సిక్సర్లు బాదడం విశేషం. 17వ ఓవర్ చివరి 4 బంతులను నబీ సిక్సర్లు కొట్టగా...18వ ఓవర్ తొలి 3 బంతులను జద్రాన్ సిక్సర్లుగా మలిచాడు. అనంతరం జింబాబ్వే 7 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. -
విండీస్ సిరీస్‌కు సై
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. హార్దిక్‌ది గాయయా? విశ్రాంతా? మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్‌కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్‌లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్‌కు వచ్చేసరికి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా మళ్లీ మిస్... అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్‌కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్‌నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్‌లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్‌తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు. టెస్టు జట్టు: సభ్యులు 16 ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్. ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్‌గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్‌కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్‌గా తీసుకున్నారు. ఆసీస్ టూర్లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్‌ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది. వన్డే జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్‌మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్‌పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు. టి20 జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్‌కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్‌కు పరిగణించలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్‌గా వ్యవహరిస్తాడు. -
ఆదివారానికి వాయిదా!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరుగనున్న మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌కు శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ జట్టు ఎంపిక ఆదివారానికి వాయిదా పడింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంతవరకు అందుబాటులో ఉంటాడు? వెటరన్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం రెండు రోజుల తర్వాతే లభించనుంది. శుక్రవారం నాటి సమావేశం వాయిదాకు బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన ఒక కారణం కాగా, అందరు ఆటగాళ్ల ఫిట్నెస్ నివేదికలు శనివారం నాటికి అందే వీలుండటం మరో కారణంగా తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి ఇప్పటివరకు సెలక్షన్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఎంపిక వివరాలు ఆయన పేరిటే విడుదలయ్యేవి. కొత్త రాజ్యాంగం ప్రకారం కార్యదర్శిని ఈ బాధ్యత నుంచి తప్పించారు. సెలక్షన్ కమిటీ ఛైర్మనే... కన్వీనర్‌గా ఉంటారు. ఈ విషయమై క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ), బీసీసీఐ మధ్య సంఘర్షణ నెలకొంది. కొత్త నిబంధన ప్రకారం క్రికెట్ కమిటీ సమావేశాల్లో బోర్డు ఆఫీస్ బేరర్లు, సీఈఓ పాల్గొనడానికి వీల్లేదు. మరోవైపు విజయ్ శంకర్, శిఖర్ ధావన్‌ల ఫిట్నెస్ నివేదికలు కూడా ఇంకా బోర్డు అందలేదు. దాంతో జట్టు ఎంపికను ఆదివారానికి వాయిదా వేశారు. -
విదేశీ టి20లపై యువరాజ్ ఆసక్తి
న్యూఢిల్లీ: భారత జట్టు నుంచి స్థానం కోల్పోయిన వెటరన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ విదేశీ టి20 టోర్నీలపై ఆసక్తి కనబరుస్తున్నాడు. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పి... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతితో విదేశాల్లో జరిగే ప్రైవేట్ టి20 టోర్నీల్లో ఆడాలని భావిస్తున్నాడు. ‘యువరాజ్ బోర్డు నుంచి స్పష్టత కోరుతున్న మాట వాస్తవమే. కెనడాలో జరిగే ‘జి టి20’, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లలో జరిగే ‘యూరో టి20’లలో ఆడాలనుకుంటున్నాడు. అయితే అతను రిటైరైనా కూడా బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత్‌లో రిజిస్టర్ టి20 ప్లేయర్. ఈ నేపథ్యంలో ప్రైవేట్ టి20లో ఆడే వెసులుబాటు ఉందో లేదో ఓసారి చూసుకోవాలి’ అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. కరీబియన్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు భారత జట్టు మాజీ సభ్యుడు ఇర్ఫాన్ పఠాన్‌కు ఇటీవల బోర్డు నిరాకరించింది. -
హార్దిక్ పాండ్యా ఫిట్
ముంబై: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ఫిట్నెస్ అందుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటననుంచి తిరిగొచ్చిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్‌లకు దూరమైన అతను వెన్ను గాయంనుంచి కోలుకొని ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నాడు. గురువారం అతను ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. మరో వైపు కోల్‌కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ కమలేశ్ నాగర్కోటి వరుసగా రెండో ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం సీజన్‌కు దూరం కానున్నాడు. 2018లో కూడా కమలేశ్ గాయంతో చివరి నిమిషంలో ఐపీఎల్‌నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో కోల్‌కతా కేరళ పేసర్ సందీప్ వారియర్‌ను తీసుకుంది. ఈ ఏడాది రంజీల్లో 44 వికెట్లు తీసి కేరళ విజయాల్లో కీలక పాత్ర పోషించిన వారియర్... 2013–15 మధ్య ఐపీఎల్లో ఆర్సీబీ జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. -
సిరీస్ అప్పగించారు
గువాహటి: భారత మహిళలు మళ్లీ పొట్టి ఫార్మాట్లో చేతులెత్తేశారు. వరుసగా రెండో టి20లోనూ ఓటమి పాలై, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను ఇంగ్లండ్ చేతుల్లో పెట్టేశారు. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. మిథాలీరాజ్ చేసిన 20 పరుగులే టాప్‌స్కోర్! ఇంగ్లండ్ బౌలర్లు బ్రంట్ 3, స్మిత్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ వ్యాట్ (64 నాటౌట్; 6 ఫోర్లు) కడదాకా నిలబడి జట్టును గెలిపించింది. ఏక్తా బిష్త్‌కు 2 వికెట్లు దక్కాయి. ఒక్కరైనా 20 దాటలేదు... టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించిన హర్లీన్ (14), కెప్టెన్ స్మృతి మంధాన (5 బంతుల్లో 12; 2 సిక్సర్లు) శుభారంభం అందించలేకపోయారు. పేసర్ క్యాథరిన్ బ్రంట్ ఓపెనర్ స్మృతిని, తర్వాత వచ్చిన జెమీమా (2)ను పెవిలియన్ చేర్చింది. ఇక్కడి నుంచి మొదలైన పతనం ఎక్కడా ఆగలేదు. మిథాలీ రాజ్ (20), దీప్తిశర్మ (18), భారతి ఫుల్మాలి (18) ఇలా అందరిదీ అదే దారి. పరుగుల్లో వేగం లేదు. చెప్పుకోదగ్గ వ్యక్తిగత స్కోరూ లేదు. 50 పరుగులకు ముందే 3 వికెట్లు... వంద లోపే 7 వికెట్లు..! ఎవరూ 20 పరుగులకు మించి చేయలేకపోయారు. గెలిపించిన వ్యాట్... చేసింది తక్కువ స్కోరైనా... దీన్ని నిలబెట్టుకునే పనిలో ఆతిథ్య బౌలర్లు చక్కగా శ్రమించారు. కెప్టెన్ హీథెర్‌నైట్ (2) సహా బీమోంట్ (8), జోన్స్ (5), సీవర్ (1)లను ఔట్ చేశారు. దీంతో 56 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ డానియెల్ వ్యాట్ పోరాటంతో జట్టును గెలిపించింది. విన్ఫీల్డ్ (29; 4 ఫోర్లు) తో కలిసి ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. దీప్తి శర్మ, రాధాయాదవ్, పూనమ్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. పొట్టి ఫార్మాట్లో భారత్‌కిది వరుసగా ఆరో పరాజయం. ఆఖరి టి20 శనివారం ఇక్కడే జరుగుతుంది. -
మ్యాక్స్‌వెల్‌డన్
వామ్మో మ్యాక్స్‌వెల్...! ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడం అంటే ఏమిటో చాటుతూ, సిసలైన టి20 ఇన్నింగ్స్‌ను చూపుతూ, వీర విహారం ఎలా ఉంటుందో కళ్లకు కడుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగి బెంగళూరులో ఆస్ట్రేలియాకు అద్భుత విజయాన్ని అందించాడు. క్లిష్టపరిస్థితుల్లోనూ వెన్ను చూపకుండా పోరాడి పొట్టి ఫార్మాట్లో తన మూడో శతకం బాదిన అతడు... కంగారూలకు టి20 సిరీస్ కానుకగా ఇచ్చాడు. విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో తుది ఫలితం కూడా అదే విధంగా వచ్చింది. బెంగళూరు: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో రెండో టి20లోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. టీమిండియా బౌలింగ్‌ను ఆటాడుకుంటూ అతడు చెలరేగడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్‌పై తొలిసారిగా టి20 సిరీస్‌ను (2–0తో) నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) తనదైన స్థాయిలో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెటరన్ ధోని (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు. అనంతరం ఆసీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ డార్సీ షార్ట్ (28 బంతుల్లో 40; 6 ఫోర్లు) సాయంతో ఛేదనను ముందుకు నడిపించిన మ్యాక్స్‌వెల్... పీటర్ హ్యాండ్స్కోంబ్ తోడుగా మ్యాచ్ ను ముగించాడు. మ్యాక్స్‌వెల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మార్చి 2న హైదరాబాద్‌లో జరుగుతుంది. రాహుల్ మరోసారి... ఓపెనర్లు ధావన్ (14), రాహుల్ ఆచితూచి ఆడటంతో భారత ఇన్నింగ్స్ నింపాదిగా ప్రారంభమైంది. గత మ్యాచ్ విశ్రాంతి తర్వాత బరిలో దిగిన ధావన్ టచ్ దొరక్క ఇబ్బందిపడ్డాడు. రాహుల్ మాత్రం కుదురుకున్నాక సొంత నగరంలో స్వేచ్ఛగా ఆడాడు. జే రిచర్డ్సన్, కమిన్స్ వేసిన 5, 6 ఓవర్లలో రెండేసి వరుస సిక్స్‌లు బాదాడు. కమిన్స్ బౌలింగ్‌లో కాళ్ల మీద పడిన బంతిని అద్భుత రీతిలో సిక్స్‌గా పంపాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. మరో అర్ధ శతకం చేసే ఊపులో కనిపించిన అతడు... కూల్టర్ నైల్ వేసిన బంతిని షాట్ ఆడబోయి రిచర్డ్సన్కు క్యాచ్ ఇచ్చాడు. రెండు ఓవర్ల అనంతరం ధావన్ కూడా వెనుదిరిగాడు. పార్ట్‌టైమ్ బౌలర్ షార్ట్‌పై భారీ షాట్‌తో ప్రతాపం చూపబోయి పంత్ (1) ఔటయ్యాడు. దుమ్మురేపిన కోహ్లి, ధోని... 23 బంతులు, మూడు వికెట్లు, 13 పరుగులు...! 8 నుంచి 11వ ఓవర్ మధ్య మన జట్టు పరిస్థితిది. స్కోరు 74/3. ప్రత్యర్థి బౌలర్లు లైన్‌కు కట్టుబడుతూ బంతులేస్తుండటంతో కోహ్లి క్రీజులో ఉన్నా పరుగుల రాక కష్టమైంది. తీరు చూస్తే విశాఖ మ్యాచ్ తరహాలోనే భారత్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, ఈ దశలో కెప్టె న్కు జత కలిసిన ధోని ఆసీస్‌కు పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ధోని మొదటినుంచీ ధాటిగా ఆడే ఉద్దేశంలో కనిపించాడు. జంపా (17వ) ఓవర్లో 3 పరుగులు రావడం మినహాయిస్తే వీరి జోరుకు అడ్డే లేకపోయింది. 7, 9, 9, 14, 22, 19, 15 పరుగుల చొప్పున ఓవర్ ఓవర్‌కు సాధ్యమైనన్ని జోడించుకుంటూ పోయారు. కూల్టర్ నైల్ వేసిన 16వ ఓవర్లో కోహ్లి హ్యాట్రిక్ సిక్స్‌లతో తడాఖా చూపాడు. 29 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తయింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో షార్ట్‌కు బంతినివ్వడం ప్రేక్షకులకు మునుపటి ధోనిని చూసే వీలు కల్పించింది. తనదైన శైలిలో బలమైన షాట్లతో మహి ఈ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో అలరించాడు. వీరిద్దరూ సరిగ్గా 50 బంతుల్లో 100 పరుగులు జోడించి స్కోరును అమాంతం పైకి తీసుకెళ్లారు. ఆఖరి ఓవర్లో ధోని ఔటయ్యాక వచ్చిన దినేశ్ కార్తీక్ (3 బంతుల్లో 8 నాటౌట్) రెండు బౌండరీలు కొట్టగా... లాంగాఫ్ సిక్స్‌తో కోహ్లి తనదైన శైలిలో ముగింపునిచ్చాడు. ఆసీస్... అతడొక్కడే! ఓపెనర్ స్టొయినిస్ (7)ను సిద్ధార్థ్ కౌల్, కెప్టెన్ అరోన్ ఫించ్ (8)ను విజయ్ శంకర్ త్వరగానే పెవిలియన్ పంపడంతో భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. అయితే, మరో ఓపెనర్ డార్సీ షార్ట్... మ్యాక్స్‌వెల్‌కు అండగా నిలిచాడు. ఏమాత్రం తగ్గకుండా ఆడిన వీరిద్దరూ 43 బంతుల్లోనే 73 పరుగులు జోడించి జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. 12వ ఓవర్లో షార్ట్‌ను శంకర్ ఔట్ చేసినా మ్యాక్సీ మొత్తం బాధ్యతను తీసుకున్నాడు. హ్యాండ్స్కోంబ్ (18 బంతుల్లో 20 నాటౌట్) సహాయ పాత్ర పోషించాడు. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా షాట్లు కొడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూసిన మ్యాక్స్‌వెల్... 30 బంతుల్లో 60 పరుగులు అవసరమైన స్థితిలో చహల్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్స్‌లు సహా 16 పరుగులు రాబట్టి మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గేలా చేశాడు. తదుపరి వరుసగా బుమ్రా బౌలింగ్‌లో 12, కౌల్ ఓవర్లో ఏకంగా 18 పరుగులు రావడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. 50 బంతుల్లో మ్యాక్స్‌వెల్ శతకం పూర్తయింది. బుమ్రా 5 పరుగులే ఇచ్చి 19వ ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసినా, చివరి ఓవర్లో ప్రత్యర్థి 9 పరుగులు చేయకుండా కౌల్ అడ్డుకోలేకపోయాడు. జోరులో ఉన్న మ్యాక్సీ సిక్స్, ఫోర్‌తో మ్యాచ్‌ను కంగారూల పరం చేశాడు. ►1కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. స్వదేశంలో కోహ్లి కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్లలో కలిపి 16 సిరీస్‌లు ఆడింది. 14 సిరీస్‌లలో గెలిచింది. మరో సిరీస్‌ను ‘డ్రా’ చేసుకొని తాజా టి20 సిరీస్‌లో ఓడింది. ►3 అంతర్జాతీయ టి20ల్లో మ్యాక్స్వెల్కిది మూడో సెంచరీ. దీంతో అతడు కొలిన్ మున్రో (న్యూజిలాండ్) సరసనæ నిలిచాడు. నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. ►1 వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను ఓడిపోవడం భారత్‌కిదే తొలిసారి. ఈ సిరీస్‌కంటే ముందు న్యూజిలాండ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది. -
9 ఆలౌట్... 9మంది సున్నా!
పుదుచ్చేరి: ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ తాపత్రయపడుతోంటే ఫలితాలు మాత్రం నానాటికీ తీసికట్టుగా ఉంటున్నాయి. పురుషుల క్రికెట్ కొంతలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ... దేశవాళీ మహిళల క్రికెట్లో ఒకదానికి మించి మరోటి చెత్త ప్రదర్శనలు నమోదు అవుతున్నాయి. గతంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ కేవలం 2 పరుగులకే ఆలౌట్ కాగా... నాగాలాండ్, మణిపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 136 వైడ్లు నమోదు అయ్యాయి. తాజాగా బీసీసీఐ సీనియర్ మహిళల టి20 టోర్నీలోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతం కావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల క్రికెట్ ‘జోక్’గా మారింది. గురువారం మధ్యప్రదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘ఈ’ మ్యాచ్‌లో మిజోరాం 13.5 ఓవర్లలో కేవలం 9 పరుగులకే ఆలౌటైంది! ఏకంగా 9 మంది బ్యాట్స్‌మెన్ ‘సున్నా’కే పరిమితమయ్యారు. అపూర్వ భరద్వాజ్ (25 బంతుల్లో 6; 1 ఫోర్) మాత్రమే పరుగుల ఖాతా తెరవగా, 3 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. తర్వాత మిజోరాం బౌలర్లు 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వడంతో... మధ్యప్రదేశ్ ఒక ఓవర్ మాత్రమే ఆడి 10 పరుగులు చేసి గెలిచింది. -
టి20ల నుంచి రోహిత్‌కు విశ్రాంతి!
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ముందు అనవసర ప్రయోగాలకు వెళ్లకుండా... ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అయితే, కొంతకాలంగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మపై భారం తగ్గించేందుకు రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ పర్యటన చివర్లో తప్పుకొన్న కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ సారథ్య పగ్గాలందుకుంటాడు. శుక్రవారం సమావేశం కానున్న సెలెక్టర్లు టి20 సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేయనున్నారని సమాచారం. ప్రపంచ కప్ ముందు ఇదే చివరి సిరీస్ కాబట్టి జట్టు మేనేజ్మెంట్ కూడా తొలి మూడు వన్డేలకు ప్రయోగాలు చేసే ఉద్దేశంలో లేదు. చివరి రెండు మ్యాచ్‌లకు మాత్రం ఓపెనర్ శిఖర్ ధావన్‌కు విశ్రాంతినిచ్చి కేఎల్ రాహుల్‌ను దింపుతుంది. పనిభారం తగ్గించేందుకు నలుగురు పేసర్లను రొటేషన్ ప్రకారం ఆడించనుంది. -
దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్
జొహన్నెస్‌బర్గ్: కీలకదశలో వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (29 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్ (27 బంతుల్లో 45; ఫోర్, 4 సిక్స్‌లు) మెరిశారు. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 90; 13 ఫోర్లు, సిక్స్), హుస్సేన్ తలత్ (55; 7 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడారు. ఒకదశలో 16 ఓవర్లలో 147/1తో పటిష్టంగా కనిపించిన పాక్ తొమ్మిది బంతుల తేడాతో ఆజమ్, తలత్ వికెట్లను కోల్పోవడంతో విజయంపై ఆశలు వదులుకుంది. మూడో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. -
మిల్లర్ మెరుపు ఫీల్డింగ్
కేప్‌టౌన్: మైదానంలో నాలుగు క్యాచ్‌లు...రెండు రనౌట్లు... తొలి టి20లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ప్రదర్శన ఇది. ఆరుగురు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతని ఫీల్డింగ్ నైపుణ్యంతో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (45 బంతుల్లో 78; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రీజా హెన్డ్రిక్స్ (41 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 బంతుల్లోనే 131 పరుగులు జోడించడం విశేషం. ఉస్మాన్ షిన్వారికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 186 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ షోయబ్ మాలిక్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), హుస్సేన్ తలత్ (32 బంతుల్లో 40; 5 ఫోర్లు), బాబర్ ఆజమ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. -
వరుణుడి అడ్డుపుల్ల
మెల్బోర్న్: ప్చ్...! టీమిండియాకు మళ్లీ నిరాశ! చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను పడగొట్టిన తర్వాత... స్వల్ప లక్ష్యాన్ని అందుకుని సిరీస్‌లో నిలుద్దామని ఆశించిన కోహ్లి సేనకు వరుణుడు సైంధవుడిలా అడ్డుపడ్డాడు. రెండుసార్లు ఆగినట్టే ఆగిన వాన... భారత్ ఛేదనకు దిగనుందనే సరికి మళ్లీ మొదలైంది. దీంతో ఆస్ట్రేలియాతో శుక్రవారం రెండో టి20 రద్దయింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... భువనేశ్వర్ (2/20), ఖలీల్ అహ్మద్ (2/39) ధాటికి 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులే చేసింది. బెన్ మెక్‌డెర్మాట్ (30 బంతుల్లో 32 నాటౌట్) టాప్ స్కోరర్. బుమ్రా, కుల్దీప్, కృనాల్ పాండ్యా పొదుపుగా బంతులేసి ఒక్కో వికెట్ తీశారు. సరిగ్గా ఇదే సమయానికి వర్షం గంటపైగా సమయం అంతరాయం కలిగించింది. తర్వాత డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులుగా నిర్దేశించారు. కానీ, అంతలోనే జల్లులు మొదలై ఆటకు వీలుకాలేదు. అరగంట తర్వాత మరోసారి లక్ష్యాన్ని 5 ఓవర్లలో 46 పరుగులుగా సవరించి మ్యాచ్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, వరుణుడు ఇందుకూ అవకాశం ఇవ్వలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ ఆదివారం సిడ్నీలో జరుగనుంది. బౌలర్లు కట్టడి చేశారు ఆసీస్ ఇన్నింగ్స్‌లో యువ ఆల్‌రౌండర్ మెక్‌డర్మాట్ మినహా మిగతావారు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కెప్టెన్ ఫించ్ (0)ను రెండో బంతికే ఔట్ చేసి భువనేశ్వర్ ఇచ్చిన శుభారంభాన్ని ఆసాంతం కొనసాగించిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. మధ్యలో రెండు క్యాచ్‌లు నేలపాలైనా ఆ ప్రభావం పడకుండా చూశారు. పేస్ త్రయంలో భువీ, ఖలీల్ వికెట్ల వేట కొనసాగించగా, బుమ్రా (1/20) ఎప్పటిలాగే పరుగులు నిరోధించాడు. క్రిస్ లిన్ (13)ను స్లో బంతితో బోల్తాకొట్టించిన ఖలీల్... డీయార్సీ షార్ట్ (14)ను బౌల్డ్ చేశాడు. స్టొయినిస్ (4) బుమ్రా బౌలింగ్‌లో డీప్ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆసీస్ 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లతో తనను కలవరపెట్టిన మ్యాక్స్‌వెల్ (19)ను చక్కటి స్పిన్‌తో కృనాల్ పాండ్యా పెవిలియన్ పంపాడు. కుల్దీప్... క్యారీ (4) పని పట్టాడు. మెక్‌డెర్మాట్‌కు జత కలిసిన కూల్టర్‌నీల్ (9 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో స్కోరు వంద దాటింది. ఖలీల్ వేసిన 18వ ఓవర్లో... ఆండ్రూ టై రెండు ఫోర్లు, మెక్‌డెర్మాట్ సిక్స్ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లో బుమ్రా 10 పరుగులిచ్చాడు. మోస్తరు లక్ష్యాన్ని భారత్ ఛేదించేలా కనిపించిన పరిస్థితుల్లో వర్షం అంతా మార్చేసింది. -
బుమ్రా లేని లోటు కనిపిస్తోంది
భారత్, ఇంగ్లండ్ జట్లు టి20 సిరీస్ లో తమ సత్తాను ప్రదర్శించి మున్ముందు ఎలాంటి ఆటను మనకు అందించబోతున్నాయో సంకేతమిచ్చాయి. మ్యాచ్‌లో ఒకవేళ కఠినమైన పరిస్థితిలో నిలిచినా... బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ కోలుకునేందుకు ఈ అదనపు 30 ఓవర్ల ఆట ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్ ఇటీవలే ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగలేదనేది వేరే విషయం. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్‌లో లోటు కనిపించింది. అయితే చివరి వన్డేలో బట్లర్ మెరుపు సెంచరీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు 90కి పైగా పరుగులు చేయడం ఇంగ్లండ్ జట్టు సమర్థతకు నిదర్శనం. గతంలో అయితే ఏదో కొంత పోరాడటం తప్ప ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌కు దాసోహమైపోయేది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించని తత్వం మోర్గాన్ నేతృత్వంలోని కొత్త జట్టులో కనిపిస్తోంది. టి20ల్లో చూసినట్లు జట్టు బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వారి బౌలింగ్ ఇంకా పూర్తి స్థాయిలో కుదురుకోకపోయినా, ఈ ఫార్మాట్లో చాలా మంది ఇతర జట్ల కెప్టెన్లు, కోచ్‌లకు అది సాధారణ సమస్యే. భారత్ కూడా కుల్దీప్, చహల్ ఇద్దరినీ ఆడించాలా లేకా ఒకే స్పిన్నర్‌ను ఎంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. బ్యాటింగ్ విభాగంలో శిఖర్ ధావన్ విషయంలో కొంత ఆందోళన ఉంది. చివరి టి20లో అద్భుత సెంచరీ సాధించిన రోహిత్ అలవోకగా ఈ ఫార్మాట్లోకి మారిపోగలడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివరి ఓవర్లలో భువనేశ్వర్‌తో జోడీగా చెలరేగిపోయే బుమ్రా లేని లోటు కచ్చితంగా కనిపిస్తోంది. బ్రిస్టల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ జోరును అడ్డుకున్న పాండ్యాపై రెండు రకాల బాధ్యతలూ ఉన్నాయి. భారత్ జోరు మీద కనిపిస్తున్నా, సొంతగడ్డపై ఇంగ్లండ్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారనేది అంచనా వేయడం కష్టం. -
మహిళలకూ మహదవకాశం
సెంచూరియన్: భారత మహిళల క్రికెట్ జట్టు ముంగిట అరుదైన ఘనత. దీనిని అందుకోవాలంటే మాత్రం బుధవారం దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగే నాలుగో టి20లో విజయం సాధించాలి. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు చేజిక్కించుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30కు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అనంతరం ఇదే మైదానంలో పురుషుల జట్ల పోరాటం ఉంటుంది. యాదృచ్ఛికమే అయినా... గెలిస్తే రెండు భారత జట్లూ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌లను సొంతం చేసుకుంటాయి. ఐదు మ్యాచ్‌ల మహిళల సిరీస్‌లో ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ సేన 2–1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు అలవోకగా గెలిచినా... మూడో మ్యాచ్‌లో అనవసర షాట్లతో మన జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో ప్రత్యర్థికి పుంజుకొనే అవకాశం చిక్కింది. ఈసారి అలాంటి ఉదాసీనతకు తావివ్వకుండా సామర్థ్యం మేరకు ఆడితే తిరుగుండదు. -
టి20లోనూ పాకిస్తాన్ చిత్తు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన పాకిస్తాన్ ఆట టి20ల్లోనూ మారలేదు. ఫలితంగా తొలి టి20లోనూ ఆ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (41 బంతుల్లో 41; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... హసన్ అలీ (23) ఫర్వాలేదనిపించాడు. సౌతీ, రాన్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి విజయాన్నందుకుంది. 8 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయినా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కొలిన్ మున్రో (43 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రూస్ (26), రాస్ టేలర్ (22 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ గురువారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. -
మేఘమా ఉరమకే ఈ పూటకి!
తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 118... రెండో మ్యాచ్‌లో భారత్ 118... పైగా వర్షం ఆటంకం కలిగించిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఆరు ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేదు. తాజా సిరీస్‌లో పరుగుల పరిస్థితి ఇది. భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరులో ఇప్పటి వరకు అభిమానులకు ఆశించిన ధనాధన్ వినోదం దక్కలేదు. ఇక ఇప్పుడు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20లోనైనా బ్యాట్స్‌మెన్ విరుచుకు పడతారా? వన్డే సిరీస్‌లాగే ఇది కూడా భారత్ ఖాతాలో చేరుతుందా? లేక నిరాశాజనక పర్యటనను కంగారూలు విజయంతో ముగిస్తారా? హైదరాబాద్ మ్యాచ్ ఎవరి ఖాతాలో చేరుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. వర్షం, భారీ వర్షం, అతి భారీ వర్షం... గత కొద్ది రోజులుగా భాగ్యనగర వాసులకు ఈ పదాలు రొటీన్లో భాగంగా మారిపోయాయి. నగరాన్ని వరుసగా వానలు ముంచెత్తుతున్న సమయంలో క్రికెట్ అభిమాని మాత్రం వరుణ దేవుడిని ఒక్కరోజు సెలవు తీసుకొమ్మని కోరుకుంటున్నాడు. వానలో కాకుండా పరుగుల వానలో తాము తడిసి ముద్దవ్వాలని పరితపిస్తున్నాడు. ఆటగాళ్లంతా సిరీస్ విజయం కోసం సిద్ధమైనా... ఆటమాత్రం వాన రాకడపైనే ఆధారపడి ఉంది. సాక్షి, హైదరాబాద్ : సొంతగడ్డపై ఏడాది ఆరంభంలో టెస్టు సిరీస్, ఇటీవల వన్డే సిరీస్‌లలో ఆస్ట్రేలియాపై స్పష్టమైన ఆధిక్యం కనబర్చిన భారత జట్టు ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకొని మూడు ఫార్మాట్ల ముచ్చటను పూర్తి చేయాలని భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా నేడు జరిగే చివరి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. అటు తనకు అచ్చొచ్చిన మైదానంలో మరో విజయం సాధించి సగర్వంగా స్వదేశం వెళ్లాలని ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా తాత్కాలిక సారథి డేవిడ్ వార్నర్ కూడా పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది. రాహుల్ లేదా కార్తీక్‌కు చాన్స్... రెండో టి20 మ్యాచ్‌లో భారత్ టాప్–4 అనూహ్య వైఫల్యం జట్టుకు పరాజయం తప్ప మరో దారి లేకుండా చేసింది. దాని నుంచి పాఠం నేర్చుకొని అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. రోహిత్, ధావన్‌లతో పాటు కోహ్లి కూడా సత్తా చాటాల్సి ఉంది. అయితే నాలుగో స్థానంలో మాత్రం పదే పదే విఫలమవుతున్న మనీశ్ పాండే స్థానంలో లోకేశ్ రాహుల్ లేదా దినేశ్ కార్తీక్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. కార్తీక్ గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరోవైపు హార్దిక్ పాండ్యాకు గువాహటి మ్యాచ్‌కు ముందు ఎక్కువ సందర్భాల్లో తగినన్ని బంతులు ఆడే అవకాశమే రాలేదు. కానీ గత మ్యాచ్‌లో పదో ఓవర్లో బరిలోకి దిగినా ఒత్తిడిలో అతడి నుంచి ఆశించిన ఆటను ప్రదర్శించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన శైలి మెరుపులను చూపిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. కేదార్ జాదవ్, ధోని కూడా మరింత సమర్థంగా తమ పాత్రను పోషించాల్సి ఉంది. హైదరాబాద్ పిచ్‌పై భువనేశ్వర్‌కు అద్భుతమైన పట్టు ఉంది. పేసర్లకు కూడా ఆరంభంలో అనుకూలించే ఈ వికెట్‌పై అతను ఎన్నో అద్భుతమైన స్పెల్స్ ఐపీఎల్లో వేశాడు. భువీకి తోడుగా బుమ్రా నిలిస్తే భారత్‌కు తిరుగుండదు. గత మ్యాచ్‌లోనూ వీరిద్దరు రాణించినా స్పిన్నర్లపై ఎదురుదాడితో ఆసీస్ ఫలితం సాధించింది. కాబట్టి చహల్, కుల్దీప్లు ఈ సారి మరింత జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నెహ్రా విలేకరుల సమావేశానికి హాజరైనా... మ్యాచ్ ప్రాధాన్యత దృష్ట్యా మళ్లీ అవకాశం లభించకపోవచ్చు. వార్నర్ చెలరేగుతాడా...: ఐపీఎల్ సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అద్భుతమైన విజయాలు సాధించిన మైదానంలో బ్యాట్స్‌మన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఉప్పల్‌లో ఏకంగా 162.79 స్ట్రైక్‌రేట్‌తో అతను ఇక్కడ 1,291 పరుగులు చేశాడు. కాబట్టి అది కచ్చితంగా వార్నర్‌కు సానుకూలాంశం. ఫించ్‌కు ఎప్పటిలాగే చెలరేగిపోగల సామర్థ్యం ఉంది. గత మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌కు బ్యాటింగ్ అవకాశం రాలేదు. పేలవమైన పర్యటనను అతను ఇప్పుడైనా మెరుగ్గా ముగిస్తాడా చూడాలి. మరో సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిక్స్ కూడా ప్రమాదకారి కాగలడని గత మ్యాచ్‌లోనే నిరూపితమైంది. టూర్ ఆరంభంలో తడబడ్డ స్టొయినిస్, హెడ్, జంపా నిలదొక్కుకోవడం ఆసీస్‌కు అదనపు బలం. ఇక గత మ్యాచ్‌లో చెలరేగిన బెహ్రెన్‌డార్ఫ్‌కు పిచ్ కాస్త అనుకూలించినా చెలరేగిపోగలడు. ఈ టూర్ మొత్తంలో ఇప్పుడు కాస్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న కంగారూలు ఎలాంటి ఫలితం సాధిస్తారనేది ఆసక్తికరం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, పాండే/కార్తీక్, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్. ఆస్ట్రేలియా: వార్నర్ (కెప్టెన్), ఫించ్, హెన్రిక్స్, హెడ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, పైన్, కూల్టర్ నీల్, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్. పిచ్, వాతావరణం ఉప్పల్ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్. ఐపీఎల్లో మాత్రం ఎక్కువ భాగం సాధారణ స్కోర్లే నమోదయ్యాయి. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌కు ఈ పిచ్ ఆరంభంలో చక్కగా సహకరిస్తుంది. వరుసగా వర్షాలు పడుతుండటంతో పిచ్‌ను సిద్ధం చేయడం కష్టంగా మారినా... దానిని వాన బారిన పడకుండా కప్పి ఉంచడంలో హెచ్‌సీఏ సిబ్బంది సఫలమయ్యారు. అయితే అవుట్‌ఫీల్డ్ మాత్రం గురువారం సాయంత్రం కూడా బురదమయంగా, ప్రమాదకరంగానే కనిపించింది. మ్యాచ్‌కు ముందు రోజు కూడా వాన కురవడం ప్రతికూల పరిణామమే. తాజా వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే మ్యాచ్ అంతరాయం లేకుండా సజావుగా సాగడం కష్టంగానే కనిపిస్తోంది. క్యురేటర్ కస్తూరి శ్రీరామ్ పిచ్‌ను ఎలాగైనా సిద్ధం చేస్తామనే విశ్వాసంతో ఉన్నారు. ►19 భారత్‌లో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న 19వ వేదిక ఉప్పల్ స్టేడియం -
లూయిస్ విధ్వంసం
♦ అజేయ సెంచరీతో విండీస్‌ను గెలిపించిన ఓపెనర్ ♦ ఏకైక టి20లో భారత్ ఓటమి కింగ్స్టన్: లూయిస్ విండీస్ ఓపెనర్. వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లాడి 67 పరుగులే చేశాడు. కానీ ఏకైక టి20లో మాత్రం శతక్కొట్టాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అరడజను ఫోర్లు, డజను సిక్సర్లతో మ్యాచ్‌ను పోటీలేకుండా ముగించాడు. దీంతో గ్యాలరీలోనే ప్రేక్షకులే కాదు... మైదానంలోని భారత ఆటగాళ్లు ప్రేక్షకులయ్యారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన కోహ్లి (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. రిషభ్ పంత్ (35 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 194 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఓపెనర్ లూయిస్ (62 బంతుల్లో 125 నాటౌట్; 6 ఫోర్లు, 12 సిక్సర్లు) ఉప్పెన ముందు భారత లక్ష్యం కుదేలైంది. శామ్యూల్స్ (29 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1సిక్స్) రాణించాడు. లూయిస్ వ్యక్తిగత స్కోరు 46, 55 వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం. ధనాధన్... వెస్టిండీస్ ఇన్నింగ్స్ నింపాదిగా మొదలై మెరుపుల మలుపు తీసుకుంది. క్రిస్ గేల్, లూయిస్‌లు మెల్లిగా ఆడటంతో తొలి 3 ఓవర్లలో 17 పరుగులే వచ్చాయి. కానీ ఆ తర్వాతి ఓవర్ నుంచే లూయిస్ దంచుడు మొదలైంది. షమీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో లూయిస్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. గేల్ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఒక్క ఓవర్లోనే 19 పరుగులు జతచేరాయి. దీంతో జట్టు స్కోరు డబులైంది. ఆరు బంతుల తేడాతో 17 పరుగుల నుంచి అమాంతం 36కు చేరింది. ఇక అక్కడి నుంచి పరుగుల ప్రవాహం మొదలైంది. ప్రతి ఓవర్ సిక్స్‌లు, లేదంటే ఫోర్లు లేకుండా ముగియలేదు. ఓవర్‌కు సగటున 10 పరుగులు వచ్చాయి. 24 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్సర్లు) లూయిస్ అర్ధసెంచరీ పూర్తయింది. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాక గేల్ ఔటయ్యాడు. తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన కుల్దీప్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో గేల్ (20 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన శామ్యూల్స్... లూయిస్‌కు జతయ్యాడు. మ్యాచ్ సాగుతున్నకొద్దీ ఓపెనర్ లూయిస్ పరుగుల ప్రవాహం కాస్తా... విధ్వంసం స్థాయికి చేరింది. అతను కొట్టే సిక్సర్లకు మైదానమే చిన్నబోయింది. భారత బౌలర్లకు పగలే చుక్కల్ని చూపించాడు. ముఖ్యంగా షమీ పరుగుల్ని సమర్పించుకోవడం మినహా చేసేదేమీలేకపోయింది. ఉరిమే ఉత్సాహంతో సెంచరీకి సమీపించిన లూయిస్... జడేజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస సిక్సర్లు బాది టి20లో తన రెండో శతకాన్ని పూర్తి చేశాడు. కేవలం 53 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ ఫీట్‌ను సాధించాడు. మరోవైపు శామ్యూల్స్ కూడా ఓ వైపు లూయిస్‌కు స్ట్రయిక్ ఇస్తూనే... అడపాదడపా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఇద్దరు మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. దీంతో మరో 9 బంతులు మిగిలుండగానే విండీస్ విజయం సాధించింది. సూపర్ ఆరంభం ధావన్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను కోహ్లి మెరుపు వేగంతో ఆరంభించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు భారత కెప్టెన్. బద్రీ వేసిన ఈ తొలి ఓవర్లో శిఖర్ ధావన్ కూడా రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాత టేలర్ వేసిన ఓవర్లోనూ భారత ఓపెనర్లు మూడు ఫోర్లు బాదారు. దీంతో రెండే ఓవర్లలో 26 పరుగులు... 4.4 ఓవర్లలో జట్టు స్కోరు 50 దాటింది. ఇలా ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను విలియమ్స్ దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి రెండు బంతుల్ని 6, 4గా తరలించిన కోహ్లి ఆ మరుసటి బంతికి ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి నరైన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు. దీంతో తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. కానీ ఈ జోడి కథ రెండు బంతుల వ్యవధిలోనే ముగిసింది. సమన్వయలేమితో జోరు మీదున్న ధావన్ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు) రనౌటయ్యాడు. ఈ దశలో రిషభ్‌కు దినేశ్ కార్తీక్ జతయ్యాడు. వీరిద్దరు ఓపెనర్లిచ్చిన దూకుడును కొనసాగించారు. శామ్యూల్స్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్, బౌండరీ బాదడంతో భారత్ స్కోరు 100కు చేరింది. ఆ తర్వాత బ్రాత్‌వైట్ వేసిన 13వ ఓవర్లోనూ దినేశ్ కార్తీక్ రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. 16వ ఓవర్లో రిషభ్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. శామ్యూల్స్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. కానీ అదే ఓవర్లో జట్టు స్కోరు 151 పరుగుల వద్ద దినేశ్ కార్తీక్‌ను చక్కని బంతితో శామ్యూల్స్ బోల్తా కొట్టించాడు. దీంతో మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారెవరూ ఈ స్థాయిలో మెరుపులు మెరిపించకపోవడంతో పరుగుల వేగం మందగించింది. దీంతో 200 పరుగులు దాటాల్సిన స్కోరు 190 పరుగులకే పరిమితమైంది. ‘హెడ్స్’ అన్నా... ‘టెయిల్’ అన్నా... వెస్టిండీస్ పర్యటనలో కోహ్లికి ఫలితాలు కలిసొచ్చాయి. కానీ బొమ్మబొరుసే ఏ మ్యాచ్‌కూ కలిసిరాలేదు. టూర్ అసాంతం కోహ్లి టాస్‌లో మాత్రం గెలవలేదు. ఐదు వన్డేల సిరీస్‌లో టాస్ కెళ్లిన ప్రతీసారి ‘హెడ్స్’అనే చెబితే టెయిల్ పడింది. ఈసారి... ఏకైక టి20 మ్యాచ్‌లో మాత్రం ‘టెయిల్’ను నమ్ముకుంటే ‘హెడ్స్’ వచ్చింది. అయ్యయ్యో కోహ్లి! స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: కోహ్లి (సి) నరైన్ (బి) విలియమ్స్ 39; ధావన్ రనౌట్ 23; రిషభ్ పంత్ (సి) వాల్టన్ (బి) టేలర్ 38; దినేశ్ కార్తీక్ (బి) శామ్యూల్స్ 48; ధోని (సి) శామ్యూల్స్ (బి) టేలర్ 2; జాదవ్ (సి) నరైన్ (బి) విలియమ్స్ 4; జడేజా నాటౌట్ 13; అశ్విన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 190. వికెట్ల పతనం: 1–64, 2–65, 3–151, 4–156, 5–156, 6–164 బౌలింగ్: బద్రీ 4–0–31–0, టేలర్ 4–0–31–2, విలియమ్స్ 4–0–42–2, బ్రాత్‌వైట్ 2–0–26–0, నరైన్ 3–0–22–0, శామ్యూల్స్ 3–0–32–1. విండీస్ ఇన్నింగ్స్: క్రిస్ గేల్ (సి) ధోని (బి) కుల్దీప్ 18; లూయిస్ నాటౌట్ 125; శామ్యూల్స్ నాటౌట్ 36; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 194. వికెట్ల పతనం: 1–82. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–0, అశ్విన్ 4–0–39–0, షమీ 3–0–46–0, కుల్దీప్ యాదవ్ 4–0–34–1, జడేజా 3.3–0–41–0. 3 అంతర్జాతీయ టి20 చరిత్రలో గేల్, మెకల్లమ్ తర్వాత రెండు సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మన్ లూయిస్. -
టి20ల్లోనూ డీఆర్ఎస్!
ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదన లండన్: ఇప్పటిదాకా టెస్టుల్లో, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) ఇక టి20ల్లోనూ కనిపించే అవకాశాలున్నాయి. బుధ, గురువారాల్లో అనిల్ కుంబ్లే నేతృత్వంలో సమావేశమైన ఐసీసీ క్రికెట్ కమిటీ కొన్ని విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించింది. వీటిని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదిస్తే అక్టోబర్ 1 నుంచి అమలవుతాయి. కమిటీ సూచించిన ప్రతిపాదనల ప్రకారం... ఇప్పటిదాకా టి20ల్లో డీఆర్ఎస్ అమలు లేదు. ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి మ్యాచ్‌నే మార్చేసే పరిస్థితి ఈ పొట్టి ఫార్మాట్లో ఉంటుందని గతంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ గట్టిగా వాదించాడు. దీంతో డీఆర్ఎస్ అమలుకు కమిటీ మొగ్గు చూపింది. అలాగే మైదానంలో అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లను బయటకు పంపే అధికారం అంపైర్లకు ఉండనుంది. ఎల్బీ నిర్ణయంపై ఆటగాడు అప్పీల్‌కు వెళ్లినప్పుడు రివ్యూలో స్పష్టంగా తేలని సమయంలో అంపైర్ నిర్ణయానికే వదిలేసి అవుట్‌గా ప్రకటించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇకనుంచి జట్టు రివ్యూ కోల్పోదు. ఇక టెస్టుల్లో మరిం త పోటీతత్వం తెచ్చేందుకు టెస్టు చాంపియన్‌షిప్‌ను తేవాల్సిందే అని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. -
మూడు ఫార్మాట్లలో మార్పులు!
-
మూడు ఫార్మాట్లలో మార్పులు!
ఐసీసీ సీఈసీ మీటింగ్‌లో ప్రతిపాదన దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యా యి. టెస్టులు, వన్డేలు, టి20ల్లో మరింత పోటీతత్వాన్ని పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొన్ని విప్లవాత్మక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈమేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రెండేళ్ల పాటు జరిగే టెస్టు లీగ్, వన్డే ప్రపంచకప్ అర్హత కోసం మూడేళ్ల పాటు 13 జట్లతో కూడిన వన్డే లీగ్ నిర్వహణ, టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ప్రాంతీయ అర్హత మ్యాచ్‌లను జరపాలని నిర్ణయించారు. వీటిని ఐసీసీ బోర్డులో ఆమోదించాల్సి ఉంది. నేడు (శనివారం) ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉన్నా ఇందులో చర్చకు వచ్చే అవకాశాలు లేవు. ఏప్రిల్‌లో జరిగే మరో బోర్డు సమావేశంలో వీటిపై ఆమోద ముద్ర పడనుంది. ఇదే జరిగితే 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్లో సమూల మార్పులు ఉంటాయి. ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు సుదీర్ఘకాలంగా మ్యాచ్‌లు జరిగినట్టుగానే వన్డే ప్రపంచకప్ కోసం 13 జట్లు మూడేళ్ల పాటు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో పది శాశ్వత సభ్యదేశాలతో పాటు అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్, ప్రపంచ క్రికెట్ లీగ్ విజేత పాల్గొంటాయి. ఏడాదిలో కనీసం ఓ జట్టు 12 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. -
వానొచ్చె... మ్యాచ్ పోయె...
-
వానొచ్చె... మ్యాచ్ పోయె...
వర్షంతో రెండో టి20 రద్దు సిరీస్ 1-0తో విండీస్ కైవసం తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన భారత జట్టుకు సిరీస్ సమం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే అవుట్ చేసిన ఆనందం అంతా రెండో ఇన్నింగ్స్ ఆరంభం కాగానే ‘నీరు’గారిపోయింది. గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్ వర్షార్పణం కావడంతో టీమిండియాకు నిరాశే ఎదురైంది. సిరీస్ కోల్పోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మన జట్టు ఒక మెట్టు దిగజారనుండగా... అభిమానులకూ అమెరికాలో ఆట చూసిన ఆనందం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. లాడర్‌హిల్ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. 144 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసిన దశలో వాన పడింది. దాంతో దాదాపు గంటకు పైగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు సూపర్ సాపర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అవుట్‌ఫీల్డ్ మొత్తం నీటితో నిండిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. ఎక్కువ భాగం పొడిగా మారినా... పిచ్ సమీపంలో, 30 గజాల వృత్తం లోపల నీరు అలాగే ఉండిపోయింది. దీని వల్ల ఆటగాళ్లకు ప్రమాదమని తేల్చిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు సాంకేతిక కారణాలతో 40 నిమిషాలు ఆలస్యం కావడం కూడా చివరికి ప్రభావం చూపించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. జాన్సన్ చార్లెస్ (25 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు ) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టగా, అశ్విన్, బుమ్రా, షమీ తలా 2 వికెట్లు తీశారు. తొలి మ్యాచ్‌ను నెగ్గిన విండీస్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. చార్లెస్ మినహా... 24 గంటల్లోనే ఎంత మార్పు... అడ్డూ అదుపు లేకుండా పరుగుల వరద పారించిన మైదానంలోనే విండీస్ బ్యాట్స్‌మెన్ షాట్లు కొట్టలేక అల్లాడిపోయారు. ముందు రోజు లెక్కకు మిక్కిలి పరుగులిచ్చేసిన మన బౌలర్లు ఈసారి అద్భుత బంతులు వేసి పొదుపు పాటించారు! గత మ్యాచ్ హీరో లూయీస్ (7)ను షమీ చక్కటి బంతితో అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించగా, మరో ఓపెనర్ చార్లెస్ మాత్రం ధాటిని ప్రదర్శించాడు. షమీ ఓవర్లో అతను వరుస బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లు బాది మొత్తం 15 పరుగులు రాబట్టాడు. అయితే మిశ్రా తన తొలి బంతికే చార్లెస్‌ను వెనక్కి పంపడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోయారు. అశ్విన్, జడేజా బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు తీయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అశ్విన్ వైడ్ బంతిని ఆడబోయి సిమన్స్ (19) స్టంపౌట్ కాగా... తర్వాతి ఓవర్లో శామ్యూల్స్ (5) వెనుదిరిగాడు. అనంతరం వరుస ఓవర్లలో పొలార్డ్ (13), ఫ్లెచర్ (3) కూడా అవుటయ్యారు. బ్రేవో (3), బ్రాత్‌వైట్ (18)లను మిశ్రా డగౌట్ చేర్చగా, రసెల్ (13)ను భువీ అవుట్ చేశాడు. రెండో టి20 కోసం భారత్ బిన్నీ స్థానంలో మిశ్రాకు తుది జట్టులో చోటివ్వగా, విండీస్ మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) రహానే (బి) మిశ్రా 43; లూయీస్ (సి) మిశ్రా (బి) షమీ 7; శామ్యూల్స్ (సి) ధోని (బి) బుమ్రా 5; సిమన్స్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 19; ఫ్లెచర్ (బి) బుమ్రా 3; పొ లార్డ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 13; రసెల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 13; బ్రేవో (బి) మిశ్రా 3; బ్రాత్‌వైట్ (బి) మిశ్రా 18; నరైన్ (నాటౌట్) 9; బద్రీ (బి) షమీ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 143. వికెట్ల పతనం: 1-24; 2-50; 3-76; 4-76; 5-92; 6-98; 7-111; 8-123; 9-133; 10-143. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-36-1; షమీ 2.4-0-31-2; మిశ్రా 4-0-24-3; జడేజా 2-0-11-0; అశ్విన్ 3-0-11-2; బుమ్రా 4-0-26-2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 10; రహానే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 15. బౌలింగ్: రసెల్ 1-0-7-0; బద్రీ 1-0-7-0. 200 అంతర్జాతీయ, దేశవాళీ టి20 మ్యాచ్‌లు కలిపి అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి భారత బౌలర్ అశ్విన్ కాగా, మిశ్రా (199) తర్వాతి స్థానంలో ఉన్నాడు. అప్పుడు నోబాల్, ఇప్పుడు వైడ్ బాల్... వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అశ్విన్ వేసిన ‘నోబాల్’ కారణంగానే బతికిపోయిన సిమన్స్ ఆ తర్వాత భారత్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అది చాలా రోజులు అశ్విన్‌ను వెంటాడింది. తాజా సిరీస్ తొలి మ్యాచ్‌లో అశ్విన్‌ను ఎదుర్కొనే అవకాశం సిమన్స్కు రాలేదు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు మరోసారి ఎదురెదురుగా తలపడ్డారు. అశ్విన్ మొదటి బంతిని సింగిల్ తీసిన అతను రెండో బంతికే అవుటయ్యాడు. ముందుకు దూసుకొస్తున్న సిమన్స్‌ను గుర్తించి అశ్విన్ లెగ్‌సైడ్ బంతిని విసిరాడు. తడబాటులో ప్యాడ్‌తో అడ్డుకునే ప్రయత్నం చేసి జారిన సిమన్స్ వెనక్కి రాలేకపోయాడు. ‘వైడ్’ బంతికి ధోని చక్కగా స్టంపింగ్ చేయడంతో సిమన్స్ ఆట ముగిసింది. సిమన్స్‌ను ఇక వెళ్లిపో అన్నట్లుగా సైగ చేస్తూ అశ్విన్ సెండాఫ్ ఇచ్చి తన ఆనందాన్ని ప్రదర్శించాడు! -
జట్టులోకి పునరాగమనం చేయడమే కష్టం: నెహ్రా
అరంగేట్రం చేయడంకన్నా జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం తిరిగి పునరాగమనం చేయడం చాలా కష్టమని భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన అతను దాదాపు ఐదేళ్ల అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో ఆడిన అనంతరం 37 ఏళ్ల నెహ్రా జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే గత నెలలో ఆసీస్ పర్యటనలో టి20 జట్టుకు ఎంపికై రాణించగలిగాడు. -
మెకల్లోలం...
►54 బంతుల్లోనే సెంచరీ ►టెస్టుల్లో మెకల్లమ్ ప్రపంచ రికార్డు ►79 బంతుల్లో 21 ఫోర్లు, ►6 సిక్సర్లతో 145 ►ఆస్ట్రేలియాతో రెండో టెస్టు క్రికెట్లో నా బ్రాండ్ ఆట అందరికీ గుర్తుండిపోతుందని బల్లగుద్ది గర్వంగా ప్రకటించుకున్న విధ్వంసకారుడు పోతూ పోతూ కూడా తనదైన ముద్ర వేశాడు. చాలా మందిలా చివరి మ్యాచ్‌లో ఆటకంటే భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇస్తే అతను బ్రెండన్ మెకల్లమ్ ఎందుకవుతాడు? తాను నిశ్శబ్దంగా వెళ్లిపోయేవాడిని కాదని అతను చూపించాడు. అందుకే అలా ఇలా కాదు వీరబాదుడు బాదాడు. బ్యాటింగ్ కల్లోలంతో తన పేరిట కొత్త చరిత్రను లిఖించుకున్నాడు. కివీస్ స్కోరు 32/3... పేస్, స్వింగ్‌కు అనుకూలిస్తున్న పచ్చటి హాగ్లీ ఓవల్ మైదానంలో ఆసీస్ బౌలర్లు భీకరంగా చెలరేగిపోతున్నారు. అటువైపు వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ 44 బంతుల్లో చేసింది 3 పరుగులే! ఈ స్థితిలో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతూ క్రీజ్‌లోకి వచ్చిన జట్టు కెప్టెన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉంటుంది. కానీ మెకల్లమ్ ఇలాంటివేవీ లెక్క చేయలేదు. మదిలో ఒకటే ఆలోచన. అదే ఎదురుదాడి చేయడం! తన గురించి ప్రపంచానికి తెలిసిన విద్యనే మరోసారి మెకల్లమ్ ప్రదర్శించాడు. 54 బంతుల్లోనే ‘శత’క్కొట్టాడు. టి20 ప్రపంచకప్‌కు ముందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్ర్కమిస్తున్న ఈ స్టార్ అంతకుముందే ఆ వినోదాన్ని తన సొంత అభిమానులకు చూపించడం విశేషం. వన్డేలు, టి20ల్లో ఇన్నేళ్ల పాటు అందరికీ తన బాదుడు రుచి చూపించిన మెకల్లమ్ కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో టెస్టు క్రికెట్లో వేగవంతమైన సెంచరీతో ఫార్మాట్ ఏదైనా తన బ్యాటింగ్ సునామీకి తిరుగులేదని నిరూపించాడు. బౌలర్ ఎవరైనా, బంతి ఎలాంటిదైనా అతను నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడ్డాడు. తన ఆరాధ్య క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ను గుర్తుకు తెచ్చేలా ఆడి రిచర్డ్స్ రికార్డునే తెరమరుగు చేశాడు. బ్రెండన్ మెరుపులకు క్రైస్ట్‌చర్చ్ మైదానం హోరెత్తితే... న్యూజిలాండ్ దేశం యావత్తూ పులకించింది. తమ జాతీయ హీరోకి నీరాజనం పట్టింది. అందరి మదిలో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న... ♦ మెకల్లమ్ ఎందుకు రిటైర్ అవుతున్నాడు? క్రైస్ట్‌చర్చ్: అంతర్జాతీయ కెరీర్ చివరి మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ విశ్వరూపం చూపించాడు. ఆస్ట్రేలియాతో శనివారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టులో అతను కేవలం 54 బంతుల్లోనే సెంచరీ సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో వివ్ రిచర్డ్స్ (56 బంతుల్లో; ఇంగ్లండ్‌పై 1986లో), మిస్బా వుల్ హక్ (56 బంతుల్లో; ఆస్ట్రేలియాపై 2014లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. మెకల్లమ్ (79 బంతుల్లో 145; 21 ఫోర్లు, 6 సిక్సర్లు)కు తోడు కోరీ అండర్సన్ (66 బంతుల్లో 72; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), వాట్లింగ్ (57 బంతుల్లో 58; 9 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 370 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్, ప్యాటిన్సన్, జాక్సన్ బర్డ్ రెండేసి వికెట్లు తీసుకోగా... స్పిన్నర్ లియాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (12) అవుట్‌కాగా... బర్న్స్ (27 బ్యాటింగ్), ఉస్మాన్ ఖాజా (18 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. బాదుడే బాదుడు... ఆసీస్ బౌలింగ్ ధాటికి కివీస్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన మెకల్లమ్ చెలరేగిపోయాడు. ఏ బౌలర్‌నూ అతను వదిలి పెట్టలేదు. మార్ష్ వేసిన ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 21 పరుగులు కొల్లగొట్టిన అతను ఆ తర్వాతా అదే జోరు కొనసాగించాడు. హాజల్‌వుడ్ వేసిన ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, మూడు ఫోర్లు కొట్టి 18 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్ చివరి బంతికి కవర్స్ దిశగా కొట్టిన ఫోర్‌తో టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. 78 నిమిషాల్లోనే చకచకా అతని 12వ శతకం పూర్తి కావడం విశేషం. మెకల్లమ్, అండర్సన్ భాగస్వామ్యం కూడా దూకుడుగా సాగింది. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 18.2 ఓవర్లలోనే ఏకంగా 9.76 రన్‌రేట్‌తో 179 పరుగులు జోడించారు. నోబాల్ కావడంతో... రికార్డు ఇన్నింగ్స్‌లో మెకల్లమ్‌కు కాసింత అదృష్టం కూడా కలిసొచ్చింది. 39 పరుగుల వద్ద ప్యాటిన్సన్ బౌలింగ్‌లో షాట్ ఆడగా... గల్లీలో సంచలన రీతిలో ఒంటిచేత్తో మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది నోబాల్ కావచ్చని సందేహించిన అంపైర్ రీప్లే చూశాడు. ప్యాటిన్సన్ గీత దాటినట్లు తేలడంతో మెకల్లమ్ బతికిపోయాడు. ఆ తర్వాత మెకల్లమ్ వీరవిహారం చేశాడు. ‘ప్రతీ బంతిని ఫోర్ లేదా సిక్స్ కొట్టాలనే ప్రయత్నించాను. రికార్డు గురించి నాకు ఏమీ తెలీదు. అయితే ఇప్పుడు సంతోషంతో పాటు నేను ఎంతో అభిమానించే రిచర్డ్స్‌ను అధిగమించడం ఒకింత ఇబ్బందిగానే అనిపిస్తోంది. నోబాల్ తర్వాత మరింత దూకుడుగా ఆడే ధైర్యం వచ్చింది. ఆరంభంలోనే అవుటవుతానేమో అనిపించే విధంగా కొన్ని షాట్లు గుడ్డిగా ఆడాను. అవి ఫీల్డర్లకు దగ్గరి నుంచే వెళ్లాయి. ఈ పిచ్‌పై ఆడటం అంత సులువు కాదు. అందుకే రిస్క్ తీసుకొని ఎదురుదాడి చేశాను. ఇలాంటప్పుడు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. దేవుడు నా పక్షమే ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నిస్తా.’ -బ్రెండన్ మెకల్లమ్ -
టెస్టులను టి20లు నాశనం చేయడం ఖాయం
ఫికా ఆందోళన మెల్బోర్న్: ఐపీఎల్, బిగ్ బాష్ లాంటి టి20 లీగ్‌లు భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు తీరని నష్టాన్ని కలగజేయడం ఖాయమని అంతర్జాతీయ క్రికెటర్ల సంఘం సమాఖ్య (ఫికా) సీఈవో టోనీ ఐరిష్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే టెస్టు ఫార్మాట్లో ఐసీసీ విప్లవాత్మక మార్పులు చేపట్టకపోతే మున్ముందు ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ కనుమరుగైనా ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే ప్రస్తుత భవిష్యత్ పర్యటనల కార్యక్రమం 2019లో ముగుస్తుంది కాబట్టి అప్పటిదాకా ఎలాంటి మార్పులు చేయలేమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు. ‘2019 వరకు వేచిచూస్తే ద్వైపాక్షిక క్రికెట్ ప్రమాదంలో పడుతుంది. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో జాతీయ జట్టుకు ఆడకుండా ఫ్రీలాన్స్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టి20 లీగ్‌ల్లో ఆడేందుకే మొగ్గు చూపిస్తామని చాలా మంది క్రికెటర్లు మాతో చెబుతున్నారు. ఆటగాళ్లకు డబ్బులు ఇచ్చే దేశాల్లో టెస్టులకు ఢోకా ఉండదు. కానీ చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించదు’ అని ఐరిష్ అన్నారు. -
వారియర్స్‌దే సిరీస్
రెండో టి20లోనూ విజయం 57 పరుగులతో ఓడిన బ్లాస్టర్ వెటరన్స్ పరుగుల మోత హోస్టన్: దిగ్గజ క్రికెటర్లు అమెరికా అభిమానులకు ఈ సారి ఫుల్ వినోదాన్ని పంచారు. వార్న్ వారియర్స్, సచిన్ బ్లాస్టర్స్ ఆటగాళ్లు టి20 మ్యాచ్‌లో పోటీ పడి పరుగుల మోత మోగించడంతో స్థానిక మినట్ మెయిడ్ పార్క్ దద్దరిల్లింది. చివరకు ఈ మ్యాచ్‌లోనూ వారియర్స్‌దే పైచేయి అయింది. సమష్టి ప్రదర్శనతో వార్న్ సేన 57 పరుగుల తేడాతో సచిన్ బ్లాస్టర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 262 పరుగుల భారీ స్కోరు చేయగా...అనంతరం బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా వార్న్ జట్టు ఆల్‌స్టార్స్ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో దాదాపుగా 28 వేల మంది ప్రేక్షకులు హాజరు కావడం సిరీస్ సక్సెస్‌ను చూపిస్తోంది. చివరిదైన మూడో మ్యాచ్ శనివారం (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) లాస్ ఏంజెల్స్‌లో జరుగుతుంది. చెలరేగిన సంగక్కర కుమార సంగక్కర (30 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో వారియర్స్ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ముఖ్యంగా తన మాజీ సహచరుడు మురళీధరన్ బౌలింగ్‌ను చితకబాదుతూ 3 సిక్సర్లు 2 ఫోర్లు కొట్టిన అతను స్వాన్ బౌలింగ్‌లోనూ 10 బంతుల్లోనే 24 పరుగులు రాబట్టాడు. సంగ, కలిస్ (23 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి మూడో వికెట్‌కు 43 బంతుల్లోనే 91 పరుగులు జత చేయగా, ఆ తర్వాత సంగక్కర, పాంటింగ్ (16 బంతుల్లో 41; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) 23 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. వారియర్స్ జట్టులో హేడెన్ (15 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ (22 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడగా...చివర్లో సైమండ్స్ (6 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), రోడ్స్ (8 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) 13 బంతుల్లో అభేద్యంగా 38 పరుగులు జత చేశారు. బ్లాస్టర్స్ బౌలర్లలో క్లూసెనర్‌కు 2 వికెట్లు దక్కాయి. పోరాడిన పొలాక్ బ్లాస్టర్స్ తరఫున షాన్ పొలాక్ (22 బంతుల్లో 55; 1 ఫోర్, 7 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా అది జట్టు విజయానికి సరిపోలేదు. అక్రం బౌలింగ్‌లోనే 3 సిక్సర్లు బాదిన పొలాక్, సైమండ్స్ బౌలింగ్‌లో 4 భారీ సిక్సర్లు కొట్టాడు. తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడి అభిమానులను ఆనందపర్చిన సచిన్ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సక్లాయిన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (16), గంగూలీ (12), లారా (19), జయవర్ధనే (5), క్లూసెనర్ (21) విఫలం కావడంతో బ్లాస్టర్స్‌కు ఓటమి తప్పలేదు. సైమండ్స్‌కు 4 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ మొత్తం కలిపి 38 సిక్సర్లు నమోదు కావడం విశేషం! -
ధర్మశాల దద్దరిల్లింది
తొలి టి20లో పరుగుల వరద 7 వికెట్లతో భారత్ పరాజయం రోహిత్ సెంచరీ వృథా దక్షిణాఫ్రికాను గెలిపించిన డుమిని రెండో టి20 సోమవారం హిమాలయాల చలి మంచులో బ్యాట్స్‌మెన్ భారీ షాట్లతో వేడి పుట్టిస్తుంటే... పక్కనే శిఖరాన్ని తాకుతాయా అనే రీతిలో సిక్సర్లు దూసుకుపోతుంటే... ధర్మశాల మైదానంలో పరుగుల వరద పారింది. ఒకరితో పోటీ పడుతూ మరొకరు... ఒకరిని మించి మరొకరు చెలరేగుతూ రసవత్తర పోరు సాగించారు. రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతీరుతో శతక్కొడితే... నేనూ ఉన్నానంటూ డివిలియర్స్ దడ పుట్టించాడు. అయితే ఆఖరి పంచ్ మాత్రం డుమినిదే. దక్షిణాఫ్రికా విజయానికి ఏ మాత్రం ఆశలు లేని స్థితినుంచి సిక్సర్ల మోతతో తమ జట్టుకు గెలుపు కిక్ అందించాడు. భారత జట్టు ఓడిపోయినా... సొంతగడ్డపై దాదాపు ఏడాది తర్వాత జరిగిన మ్యాచ్ అభిమానులకు సంపూర్ణ విందు భోజనాన్ని అందించింది. గాంధీ-మండేలా ‘కాయిన్’ గాంధీ-మండేలా సిరీస్ మ్యాచ్‌లలో టాస్ వేసేందుకు బీసీసీఐ వీరిద్దరి బొమ్మలతో ప్రత్యేక నాణెం తయారు చేయించింది. బంగారు పూత కలిగిన ఈ వెండి నాణాన్ని ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు టాస్ కోసం ఉపయోగించడంతో పాటు భవిష్యత్తులో ఇరు జట్ల మధ్య సిరీస్‌లకు ఇదే తరహా నాణాన్ని ఉపయోగిస్తారు. శుక్రవారం తొలి టి20 మ్యాచ్ సందర్భంగా దీనిని ప్రవేశ పెట్టారు. ఇందులో బొమ్మ వైపు గాంధీ, మండేలా చిత్రాలు ఉండగా... బొరుసు వైపు ఫ్రీడం సిరీస్ అని రాసి ఉంటుంది. ధర్మశాల: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఊహించినట్లుగానే బ్రహ్మాండమైన ఆరంభం లభించింది. హోరాహోరీగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో చివరకు సఫారీలదే పైచేయి అయింది. శుక్రవారం ఇక్కడి జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (66 బంతుల్లో 106; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా... విరాట్ కోహ్లి (27 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జేపీ డుమిని (34 బంతుల్లో 68 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పాటు... డివిలియర్స్ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగాడు. డుమిని, బెహర్దీన్ (23 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) 55 బంతుల్లోనే అభేద్యంగా 105 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ సోమవారం కటక్‌లో జరుగుతుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో ఉన్నారు. సూపర్ హిట్ బ్యాటింగ్: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత జట్టులో శ్రీనాథ్ అరవింద్‌కు తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒక వైపు రోహిత్ శర్మ ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లతో భారత్‌కు మెరుగైన ఆరంభం అందించినా...సమన్వయ లోపంతో ధావన్ (3) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తాహిర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కోహ్లి 2, రోహిత్ 1 సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 39 బంతుల్లోనే రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు కోహ్లి కూడా ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయాడు. లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టి రోహిత్ 62 బంతుల్లో టి20 కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. చివరకు భారీ భాగస్వామ్యం తర్వాత అబాట్ ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కాస్త తెరిపిన పడింది. చివర్లో మరి కొన్ని పరుగులు జోడించిన ధోని (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 41 పరుగులే చేయగలిగింది. సెంచరీ భాగస్వామ్యం: దక్షిణాఫ్రికాకు కూడా ఓపెనర్లు ఆమ్లా, డివిలియర్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. ముగ్గురు పేసర్లను కూడా అలవోకగా ఎదుర్కొన్న వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. అయితే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి ఆమ్లా రనౌట్ కావడంతో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. కొద్ది సేపటికే 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డివిలియర్స్‌ను అశ్విన్ అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో భారత్ కోలుకుంది. ఆ వెంటనే అరవింద్ తన తొలి వికెట్‌గా డు ప్లెసిస్ (4)ను అవుట్ చేశాడు. ఆరంభంలో ప్రతీ పరుగు కోసం తడబడ్డ డుమిని, బెహర్దీన్ ఆ తర్వాత నిలదొక్కుకున్నారు. అయితే అక్షర్ వేసిన 16వ ఓవర్లో డుమిని వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తర్వాతి నాలుగు ఓవర్లలో చెలరేగి వీరిద్దరు 44 పరుగులు జోడించడంతో భారత్ ఓటమి ఖాయమైంది. 2 భారత్ తరఫున టి20ల్లో సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ. గతంలో రైనా కూడా దక్షిణాఫ్రికాపైనే శతకం బాదాడు. ఈ మ్యాచ్‌తో రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఆటగాడయ్యాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాట్స్‌మన్. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేలు, టి20ల్లోనూ అతను భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. 1 రోహిత్, కోహ్లి నెలకొల్పిన 138 పరుగుల భాగస్వామ్యం టి20ల్లో భారత్‌కు అత్యుత్తమం. గతంలో గంభీర్, సెహ్వాగ్ (136) రికార్డును వీరు సవరించారు. 1 టి20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడు విరాట్ కోహ్లి. ప్రపంచ క్రికెట్లో అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో (27) అతను ఈ ఘనత సాధించాడు. 50 అంతర్జా తీయ క్రికెట్లో 50 టి20 మ్యాచ్‌లకు సారథ్యం వహిం చిన తొలి కెప్టెన్ ధోని స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోరిస్ (బి) అబాట్ 106; ధావన్ (రనౌట్) 3; కోహ్లి (సి) డుమిని (బి) అబాట్ 43; రైనా (ఎల్బీ) (బి) మోరిస్ 14; ధోని (నాటౌట్) 20; రాయుడు (రనౌట్) 0; అక్షర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1-22; 2-160; 3-162; 4-184; 5-184. బౌలింగ్: అబాట్ 4-0-29-2; రబడ 4-0-32-0; డి లాంజ్ 4-0-47-0; మోరిస్ 4-0-46-1; తాహిర్ 3-0-35-0; డుమిని 1-0-8-0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (రనౌట్) 36; డివిలియర్స్ (బి) అశ్విన్ 51; డు ప్లెసిస్ (బి) అరవింద్ 4; డుమిని (నాటౌట్) 68; బెహర్దీన్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1-77; 2-93; 3-95. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-40-0; అరవింద్ 3.4-0-44-1; మోహిత్ 4-0-40-0; అక్షర్ 4-0-45-0; అశ్విన్ 4-0-26-1. -
టీ-20 : నేడే ధనాధన్ పోరు!
-
అక్కడ వరుస ఓటములు... ఇక్కడ వరుస విజయాలు...