భారత జట్టు న్యూజిలాండ్ గడ్డపై రెండు సార్లు టి20 సిరీస్‌లు ఆడింది. ఒకసారి 0–2తో, మరోసారి 1–2తో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు మూడో ప్రయత్నంలో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునే అరుదైన అవకాశం మన జట్టుకు వచింది. టీమిండియా తాజా ఫామ్ చూస్తే అది అసాధ్యంగా ఏమీ కనిపించడం లేదు. ఇరు జట్ల తొలి పోరు హోరాహోరీగా సాగగా, రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థి పూర్తిగా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో మూడో టి20లో కూడా సత్తా చాటి 3–0తో ముందంజ వేయాలని కోహ్లి సేన భావిస్తుండగా... సొంతగడ్డపై పేలవ ఫామ్‌లో సతమతమవుతున్న కివీస్ ఇక్కడైనా పోరాడి సిరీస్ కాపాడుకోగలదా చూడాలి.
హామిల్టన్: టి20 ప్రపంచ కప్ ఏడాదిలో భారత జట్టు సన్నాహకం జోరుగా సాగుతోంది. న్యూజిలాండ్‌లో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన తీరు జట్టు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఇప్పుడు ఇదే ఊపులో మరో మ్యాచ్ కూడా గెలిస్తే తొలిసారి కివీస్ గడ్డపై టి20 సిరీస్ భారత్ సొంతమవుతుంది. భారత జట్టు ఫామ్‌లో ఉండగా, సీనియర్ బౌలర్ల గైర్హాజరులో న్యూజిలాండ్ బలహీనంగా తయారైంది.
రాహుల్‌ను ఆపతరమా!
భారత జట్టుకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి కోహ్లి, రోహిత్‌లకంటే కూడా లోకేశ్ రాహుల్‌పైనే ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదు. గత కొంత కాలంగా చెలరేగిపోతున్న ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ రెండు వరుస అర్ధ సెంచరీల తర్వాత మరో మెరుపు ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాడు. పిచ్‌లతో పని లేకుండా చెలరేగిపోతున్న రాహుల్‌ను ఆరంభంలోనే అడ్డుకోలేకపోతే కివీస్‌కు కష్టాలు తప్పవు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ కూడా అదే తరహా ఫామ్‌లో ఉన్నాడు. టీమ్‌లో నాలుగో స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్న అతను మళ్లీ చెలరేగేందుకు సిద్ధం. కోహ్లి బ్యాటింగ్ గురించి కూడా ఎలాంటి ఆందోళన లేదు.
అయితే సగటు అభిమాని రోహిత్ శర్మ నుంచి అతని స్థాయి ఇన్నింగ్స్ ఒకటి ఆశిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో రోహిత్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాని పాండే, జడేజాలు ఈసారి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఆల్‌రౌండర్ దూబేతో మన బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. 20 ఓవర్ల మ్యాచ్‌లో దిగువ స్థాయి వరకు బ్యాటింగ్ అవసరం ఉండకపోవచ్చు కాబట్టి భారత్ బౌలింగ్‌లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా సైనీకి చోటు ఇవ్వవచ్చు. ఇక బుమ్రా, షమీలు తుది జట్టులో ఖాయం కాగా, ఎప్పటిలాగే చహల్, కుల్దీప్‌లలో ఒకరికే చాన్స్.
ఆదుకునేది ఎవరు?
ఆతిథ్య న్యూజిలాండ్‌కు మాత్రం ఏదీ అచ్చి రావడం లేదు. తొలి మ్యాచ్‌లో 200కు పైగా భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను అప్పగించిన ఆ జట్టు గత మ్యాచ్‌లో విఫలమైంది. ముఖ్యంగా బుమ్రా నాలుగు ఓవర్లను సమర్థంగా ఎదుర్కోవడం ఆ జట్టుకు పెద్ద సంకటంగా మారింది. మధ్య ఓవర్లలో జడేజా కూడా పూర్తిగా కట్టి పడేస్తుండటంతో పరుగులు సాధించడం అసాధ్యంగా మారింది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసినా రెండో టి20లో ఆ జట్టు కనీస స్కోరు సాధించడంలో విఫలమైంది.
బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈసారి కూడా బ్యాటింగ్‌నే కివీస్ నమ్ముకుంది. ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు విలియమ్సన్, టేలర్ జట్టు బ్యాటింగ్ భారం మోయాల్సి ఉంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా కాకుండా పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా నాలుగో స్థానంలో ఆడిన గ్రాండ్‌హోమ్ ఘోరంగా విఫలమయ్యాడు. అతడు తన మెరుపులు చూపిస్తే టీమ్ కోలుకోవచ్చు. ఈ వేదికపై ఆడిన 9 మ్యాచ్‌లలో 7 గెలవడం కివీస్‌కు స్ఫూర్తినిచ్చే అంశం.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పాండే, దూబే, జడేజా, షమీ, బుమ్రా, చహల్, శార్దుల్/సైనీ.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మన్రో, గ్రాండ్‌హోమ్, టేలర్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, సోధి, సౌతీ, బెన్నెట్, టిక్‌నర్/కుగ్‌లీన్.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. గత ఐదు టి20 మ్యాచ్‌లలో మూడు సార్లు జట్లు 190కి పైగా స్కోర్లు చేశాయి. ఏడాది క్రితం ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో కివీస్ 212 పరుగులు చేసి కూడా కేవ లం 4 పరుగులతోనే భారత్‌పై నెగ్గగలిగింది. వర్ష సూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment