ఆడుతూ... పాడుతూ... | India Beats New Zealand In 2nd T20 | Sakshi
Sakshi News home page

ఆడుతూ... పాడుతూ...

Published Mon, Jan 27 2020 2:33 AM | Last Updated on Mon, Jan 27 2020 4:55 AM

India Beats New Zealand In 2nd T20 - Sakshi

భారత అప్రతిహత విజయాల్లో మరో మ్యాచ్‌ చేరింది. పరుగుల వరద పారిన తొలి టి20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఇప్పుడు స్వల్ప లక్ష్యాన్నీ అంతే అనాయాసంగా అందుకొని సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా జడేజా, బుమ్రా, షమీ కలిసి తమ పదునైన బౌలింగ్‌తో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ రెక్కలు కట్టేయగా... ఆ తర్వాత సూపర్‌ ఫామ్‌లో ఉన్న రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ భారత్‌ను సాధికారికంగా గెలిపించారు.

గత మ్యాచ్‌ జరిగిన మైదానమే  అయినా ఈసారి పిచ్‌ భిన్నంగా స్పందించడంతో పరుగులు తీసేందుకు ఇరు జట్లు ఇబ్బంది పడినా... చివరకు సరైన వ్యూహంతో ఆడిన టీమిండియాదే పైచేయి అయింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం మన ఖాతాలో చేరింది.  

ఆక్లాండ్‌: ఒక టి20 మ్యాచ్‌లో, అదీ ప్రపంచంలోనే అతి చిన్న మైదానంలాంటి వేదికలో వరుసగా 41 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా బాదకుండా ఇన్నింగ్స్‌ సాగడం చాలా అరుదు. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఎంత పేలవంగా సాగిందో, భారత బౌలింగ్‌ ఎంత చక్కగా పడిందో అనేదానికి ఈ ఉదాహరణ చాలు!   పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

మార్టిన్‌ గప్టిల్‌ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ సీఫెర్ట్‌ (26 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. జడేజాకు 2 వికెట్లు దక్కాయి. తన 4 ఓవర్ల కోటాలో జడేజా ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. అనంతరం భారత్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లోకేశ్‌ రాహుల్‌ (50 బంతుల్లో 57 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్సర్లు) మూడో వికెట్‌కు 67 బంతుల్లో 86 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 బుధవారం హామిల్టన్‌లో జరుగుతుంది.

ఆకట్టుకున్న బౌలర్లు...
పిచ్‌ క్రమంగా నెమ్మదించే అవకాశం ఉందని భావించిన న్యూజిలాండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. శార్దుల్‌ వేసిన తొలి ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో గప్టిల్‌ తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. తొలి ఐదు ఓవర్లలో కివీస్‌ 39 పరుగులు చేసింది. అయితే శార్దుల్‌ వేసిన చివరి పవర్‌ప్లే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన గప్టిల్‌ ఆఖరి బంతికి వెనుదిరగడంతో జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత యజువేంద్ర చహల్, శివమ్‌ దూబే పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. దాంతో ఒత్తిడికి లోనైన మన్రో (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ సమర్పించుకున్నాడు.

ఆ తర్వాత జడేజా దెబ్బకు కివీస్‌ కుదేలైంది. తన తొలి ఓవర్లో గ్రాండ్‌హోమ్‌ (3)ను అవుట్‌ చేసిన అతను, మరుసటి ఓవర్లో కీలకమైన కెపె్టన్‌ కేన్‌ విలియమ్సన్‌ (14) వికెట్‌ కూడా తీశాడు. ఆ తర్వాత పరుగులు రావడమే గగనంగా మారింది. పేరుకు టి20 అయినా బౌండరీలే కనిపించలేదు. ఎట్టకేలకు చహల్‌ వేసిన 16వ ఓవర్లో న్యూజిలాండ్‌ కొంత ఊపిరి పీల్చుకుంది. ఈ ఓవర్లో సీఫెర్ట్‌ వరుస బంతుల్లో ఫోర్, సిక్స్‌ కొట్టాడు. 11 పరుగుల వద్ద రాస్‌ టేలర్‌ (18) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి వదిలేసినా భారత్‌కు పెద్ద నష్టం జరగలేదు. ధాటిగా పరుగులు చేయాల్సిన చివరి దశలో కూడా భారత బౌలర్ల ధాటికి కివీస్‌ చేతులెత్తేసింది. ఆఖరి 4 ఓవర్లలో ఆ జట్టు 23 పరుగులే చేయగలిగింది.  

రోహిత్‌ విఫలం...
తొలి మ్యాచ్‌లాగే మరోసారి రోహిత్‌ శర్మ నిరాశపర్చాడు. సౌతీ వేసిన మొదటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అనంతరం అదే ఓవర్‌ చివరి బంతికి రోహిత్‌ (8) వెనుదిరిగాడు. కోహ్లి (11)ని కూడా చక్కటి బంతితో సౌతీనే బోల్తా కొట్టించాడు. ఈ దశలో మరోసారి రాహుల్, అయ్యర్‌ జోడి జట్టును ఆదుకుంది. గత మ్యాచ్‌తో పోలిస్తే పిచ్‌ నెమ్మదిగా ఉండటం, బంతులు సరిగ్గా బ్యాట్‌ మీదకు రాకపోవడంతో వీరిద్దరు ఆరంభంలో నిలదొక్కుకునేందుకు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో చక్కటి సమన్వయంతో సింగిల్స్‌తో పరుగులు రాబట్టారు. ఒక దశలో ఐదు వరుస ఓవర్లలో ఒకే ఒక ఫోర్‌ వచ్చింది.

అయితే 54 బంతుల్లో విజయానికి 70 పరుగులు కావాల్సిన దశలో ఈ జోడీ దూకుడు పెంచింది. సోధి ఓవర్లో భారీ సిక్సర్‌తో అయ్యర్‌ అడుగు వేయగా... బెన్నెట్‌ ఓవర్లో రాహుల్‌ వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌ బాదాడు. అంతకు ముందు ఓవర్లో రాహుల్‌ను రనౌట్‌ చేసే (42 పరుగుల వద్ద) సునాయాస అవకాశాన్ని టిక్‌నర్‌ చేజార్చడంతో కివీస్‌ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. ఆ తర్వాత మరింత చెలరేగి నాలుగు బంతుల వ్యవధిలో రెండు సిక్సర్లు, ఫోర్‌ బాదిన అయ్యర్‌ మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. శివమ్‌ దూబే (4 బంతుల్లో 8 నాటౌట్‌) కొట్టిన భారీ సిక్సర్‌తో భారత్‌ విజయం ఖాయమైంది. ఛేదనలో భారత్‌ చివరి 48 పరుగులను 21 బంతుల్లోనే సాధించడం విశేషం.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) కోహ్లి (బి) శార్దుల్‌ 33; మన్రో (సి) కోహ్లి (బి) దూబే 26; విలియమ్సన్‌ (సి) చహల్‌ (బి) జడేజా 14; గ్రాండ్‌హోమ్‌ (సి) అండ్‌ (బి) జడేజా 3; టేలర్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 18; సీఫెర్ట్‌ (నాటౌట్‌) 33; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 132.
వికెట్ల పతనం: 1–48; 2–68; 3–74; 4–81; 5–125.
బౌలింగ్‌: శార్దుల్‌ 2–0–21–1; షమీ 4–0–22–0; బుమ్రా 4–0–21–1; చహల్‌ 4–0–33–0; దూబే 2–0–16–1; జడేజా 4–0–18–2.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) టేలర్‌ (బి) సౌతీ 8; రాహుల్‌ (నాటౌట్‌) 57; కోహ్లి (సి) సీఫెర్ట్‌ (బి) సౌతీ 11; అయ్యర్‌ (సి) సౌతీ (బి) సోధి 44; దూబే (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–8; 2–39; 3–125.  
బౌలింగ్‌: సౌతీ 3.3–0–20–2; బెన్నెట్‌ 3–0–29–0; టిక్‌నర్‌ 3–0–34–0; సాన్‌ట్నర్‌ 4–0–19–0; సోధి 4–0–33–1.

►1 అంతర్జాతీయ టి20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి.
►2 అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్ల జాబితాలో రోహిత్‌ శర్మను (39 క్యాచ్‌లు) మూడో స్థానానికి నెట్టి కోహ్లి (40 క్యాచ్‌లు) రెండో స్థానానికి ఎగబాకాడు. సురేశ్‌ రైనా (42 క్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు.  

►ప్రదర్శనపరంగా మాకు ఇది మరో మంచి రోజు. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగం గురించి చెప్పుకోవాలి. మేం అనుకున్న ప్రణాళికను బాధ్యతతో సరిగ్గా అమలు చేసిన బౌలర్లు మ్యాచ్‌ను శాసించారు. కనీసం 160 పరుగులు చేయగలిగే ఈ మైదానంలో 132 పరుగులు చాలా చిన్న స్కోరు. కివీస్‌ను అలా నియంత్రించగలిగాం. దానికి తగిన విధంగానే ఛేదనలో మా బ్యాటింగ్‌ సాగింది. గ్రౌండ్‌ పరిమితులు, పిచ్‌ స్పందిస్తున్న తీరును అర్థం చేసుకొని ఒక కెపె్టన్‌గా నా వ్యూహాలు అమలు చేశాను. జడేజా చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మిగిలిన బౌలర్లందరూ తమ వంతు పాత్ర పోషించారు. దీనికి తోడు ఫీల్డింగ్‌లో మా చురుకుదనం బౌలింగ్‌కు అదనపు బలంగా మారిందంటే అతిశయోక్తి లేదు.
–కోహ్లి, భారత కెప్టెన్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement