మెరిపించారు...గెలిపించారు | India Beat New Zealand By 6 Wickets In T20 | Sakshi
Sakshi News home page

మెరిపించారు...గెలిపించారు

Published Sat, Jan 25 2020 4:27 AM | Last Updated on Sat, Jan 25 2020 10:19 AM

India Beat New Zealand By 6 Wickets In T20 - Sakshi

స్టేడియం చిన్నదై ఉండొచ్చేమో కానీ... టీమిండియాకు ఎదురుపడిన లక్ష్యం పెద్దది. గెలవాలంటే ఓవర్‌కు 10 పరుగుల చొప్పున బాదాల్సిందే. సరిగ్గా భారత్‌ కూడా అదే చేసింది. ఐదో ఓవర్‌ ముగియక ముందే 50, తొమ్మిదోది పూర్తికాకుండానే వంద, 15వ ఓవర్లోనే 150 ఇలా చకాచకా ఛేదనకు అవసరమైన పరుగుల్ని ఇటుకల్లా పేర్చేసింది. రాహుల్, కోహ్లిలకు దీటుగా ఒత్తిడిలోనూ శ్రేయస్‌ అయ్యర్‌ దంచేయడం ఇక్కడ విశేషం.  

ఆక్లాండ్‌: భారత బ్యాటింగ్‌ దళం మెరుపు దాడికి దిగింది. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్‌ చెల్లాచెదురైంది. లోకేశ్‌ రాహుల్‌ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కోహ్లి (32 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ముగ్గురూ ఒకరిని మించి ఒకరు దంచి కొట్టడంతో 200 పైచిలుకు లక్ష్యాన్ని భారత్‌ 19 ఓవర్లలోనే ఛేదించింది. ఇలా న్యూజిలాండ్‌ పర్యటనకు కోహ్లి సేన ఘనమైన శుభారంభాన్నిచి్చంది. తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (26 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాస్‌ టేలర్‌ (27 బంతుల్లో 54 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), మన్రో (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత భారత్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి విజయం సాధించింది. రేపు ఇదే వేదికపై రెండో టి20 జరుగుతుంది.

ఎదురుదెబ్బ పడినా...
కివీస్‌ నిర్దేశించిన లక్ష్యం 204. కొండంత లక్ష్యఛేదనలో ఓపెనింగ్‌ జోడీ అదరగొట్టాలి. కానీ రెండో ఓవర్లోనే భారత్‌కు ఎదురుదెబ్బ! ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (7) జట్టు స్కోరు 16 వద్దే ఔటయ్యాడు. ఇంకా చేయాల్సింది 188 పరుగులు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇటీవల జోరుమీదున్న రాహుల్‌కు కెపె్టన్‌ కోహ్లి జతయ్యాడు. ఇద్దరు వేగంగా పరుగులు జతచేశారు. కుదిరినపుడు ఫోర్‌... బంతి చెత్తగా పడితే సిక్సర్‌తో స్కోరును నడిపించారు. దీంతో భారత్‌ 4.5 ఓవర్లలోనే 50కి చేరింది. సౌతీ వేసిన ఆ ఐదో ఓవర్లో రాహుల్‌ వరుసగా 6, 4 బాదాడు.

ఆ మిస్సింగ్‌... పెద్ద టరి్నంగ్‌!  
ఆరో ఓవర్‌ మొదలైంది. రెండో బంతి పడింది. దీన్ని రాహుల్‌ కవర్స్‌లో ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి నేరుగా సౌతీ చేతికి చిక్కింది. పరుగు తీసేందుకు రాహుల్‌ ముందుకొచ్చి ఆగి... కెప్టెన్‌ కోహ్లినీ ఆగమన్నాడు. ఆలోపే కోహ్లి సగం పిచ్‌ను మించే దాటాడు. సౌతీ నాన్‌ స్ట్రయిక్‌ ఎండ్‌లో బంతిని విసరగా వికెట్లను తాకకుండా మిడాన్‌లోకి వెళ్లింది. ఔట్‌ తప్పదనుకున్న రాహుల్‌ డీలా పడగా అది మిస్‌ కావడంతో పరిగెత్తాడు. మిడాన్‌ నుంచి ఫీల్డ్‌ అయిన బంతిని మరోసారి వికెట్లకు తాకించడంలో బౌలర్‌ బెనెట్‌ విఫలమయ్యాడు. దీంతో 30 సెకన్లలో రెండుసార్లు రాహుల్‌ రనౌట్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇది తర్వాత విధ్వంసానికి, విజయానికి టరి్నంగ్‌ అయ్యింది.

అయ్యర్‌ కాదు ఫైర్‌...
అలా బతికి పోయిన రాహుల్‌ దంచేపనిలో పడిపోయాడు. సాన్‌ట్నర్‌ వేసిన 8వ ఓవర్లో రాహుల్‌ 4, 6తో ఫిఫ్టీకి చేరువయ్యాడు. తొమ్మిదో ఓవర్‌ నాలుగో బంతిని సిక్స్‌గా మలచడంతో అతని అర్ధసెంచరీ 23 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తవడంతో పాటు జట్టు వంద పరుగులు 8.4 ఓవర్లలోనే దాటేసింది. ఆ తర్వాత ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రాహుల్‌ పదో ఓవర్‌ ఆఖరి బంతికి సౌతీ క్యాచ్‌ పట్టడంతో నిష్క్రమించాడు. సోధికి ఈ వికెట్‌ దక్కింది. స్వల్ప వ్యవధిలోనే కోహ్లిని టిక్‌నెర్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ సీనియర్లను కోల్పోయింది.

ఈ దశలో జట్టును గెలిపించే బాధ్యతని అయ్యర్‌ తీసుకున్నాడు. సిక్స్, ఫోర్‌ కొట్టిన దూబే (13)ను సోధి పెవిలియన్‌ చేర్చడంతో 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 151/4. గెలవాలంటే 30 బంతుల్లో 53 చేయాలి. పాండే అండతో శ్రేయస్‌ అయ్యర్‌... సోధి, బెన్నెట్, సౌతీల బౌలింగ్‌లో విజృంభించాడు. సోధి ఓవర్లో సిక్స్‌ బాధిన అయ్యర్‌... బెన్నెట్‌ వరుస బంతుల్ని బౌండరీలకు తరలించాడు. ఆఖరి 12 బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా... సౌతీ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో 6, 4 బాదిన అయ్యర్‌ 26 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆఖరి బంతికి సిక్స్‌తో ముగింపునిచ్చాడు.  

మన్రో, కేన్, టేలర్‌ జోరు...
అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ భారత బౌలర్లను దడదడలాడించారు. ఓపెనర్లు గప్టిల్‌ (19 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మన్రో తొలి వికెట్‌కు 7.5 ఓవర్లలో 80 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బౌండరీ దగ్గర రోహిత్‌ అద్భుత క్యాచ్‌తో గప్టిల్‌ ఆటకు తెరపడింది. ఈ జోడీని శివమ్‌ దూబే విడగొట్టగా... తర్వాత క్రీజ్‌లోకి వచి్చన కెపె్టన్‌ విలియమ్సన్‌ మరింత రెచి్చపోయాడు. మన్రోను శార్దుల్‌... గ్రాండ్‌హోమ్‌ (0)ను జడేజా పెవిలియన్‌ చేర్చారు... కెపె్టన్‌కు జతయిన టేలర్‌ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇద్దరు 25 బంతుల్లోనే అర్ధ శతకాలను పూర్తిచేసుకున్నారు. 15.3 ఓవర్లలో కివీస్‌ స్కోరు 150కి చేరింది. ఆఖరి ఓవర్లో 200 పరుగులు దాటింది. శార్దుల్, దూబే, జడేజా, బుమ్రా, చహల్‌లు తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) రోహిత్‌ (బి) దూబే 30; మన్రో (సి) చహల్‌ (బి) శార్దుల్‌ 59; విలియమ్సన్‌ (సి) కోహ్లి (బి) చహల్‌ 51; గ్రాండ్‌హోమ్‌ (సి) దూబే (బి) జడేజా 0; రాస్‌ టేలర్‌ (నాటౌట్‌) 54; సీఫర్ట్‌ (సి) శ్రేయస్‌ (బి) బుమ్రా 1; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203.
వికెట్ల పతనం: 1–80, 2–116, 3–117, 4–178, 5–181. బౌలింగ్‌: బుమ్రా 4–0–31–1, శార్దుల్‌ 3–0–44–1, షమీ 4–0–53–0, చహల్‌ 4–0– 32–1, దూబే 3–0–24–1, జడేజా 2–0–18–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) టేలర్‌ (బి) సాన్‌ట్నర్‌ 7; రాహుల్‌ (సి) సౌతీ (బి) సోధి 56; కోహ్లి (సి) గప్టిల్‌ (బి) టిక్‌నెర్‌ 45; శ్రేయస్‌ (నాటౌట్‌) 58; దూబే (సి) సౌతీ (బి) సోధి 13; మనీశ్‌ పాండే (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–16, 2–115, 3–121, 4–142. బౌలింగ్‌: సౌతీ 4–0–48–0, సాన్‌ట్నర్‌ 4–0– 50–1, బెన్నెట్‌ 4–0–36–0, టిక్‌నెర్‌ 3–0–34–1, సోధి 4–0–36–2.  

*ఒకే అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఐదు అర్ధ సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి.  

*అంతర్జాతీయ టి20ల్లో 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కిది నాలుగోసారి.

*అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఆరేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అర్ధ సెంచరీ సాధించాడు. చివరిసారి అతడు 2014లో దక్షిణాఫ్రికాపై అర్ధ సెంచరీ చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement