స్వదేశంలో ఎన్ని సిరీస్ విజయాలు సాధించినా విదేశీ గడ్డపై భారత క్రికెట్ సాధించే ఘనతలు ఇచ్చే కిక్కే వేరు! సొంతగడ్డపై వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆ్రస్టేలియాలను మట్టికరిపించిన తర్వాత టీమిండియా ఇప్పుడు కివీస్ మైదానాల్లో మరో సవాల్‌కు సిద్ధమైంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి న్యూజిలాండ్‌లో మన టీమ్ సుదీర్ఘంగా పర్యటిస్తూ మూడు ఫార్మాట్‌లలో కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతోంది.
ఈ ఏడాది అక్టోబరులో టి20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టు సన్నాహకాలకు, కూర్పు నిర్ణయించేందుకు పొట్టి ఫార్మాట్‌లో రాబోయే మ్యాచ్‌లన్నీ కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో భారత్ బయట తొలి సమరానికి కోహ్లి సేన సై అంటోంది. వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత కివీస్‌తో భారత్ తలపడం ఇదే తొలిసారి.
ఆక్లాండ్: భారత క్రికెట్ జట్టు తమ టి20 చరిత్రలో ఎన్నడూ ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఇప్పుడు తొలిసారి న్యూజిలాండ్‌తో అలాంటి పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇటీవల స్వదేశంలో వరుస విజయాలతో టీమిండియా అమితోత్సాహంతో కనిపిస్తుండగా, కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో పాటు కీలక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్న కివీస్ స్వదేశంలో కోలుకోవాలని పట్టుదలగా ఉంది. గత ఏడాది ఇదే కివీస్ పర్యటనలో భారత్ టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది.
రాహుల్‌కే కీపింగ్!
భారత జట్టు తమ ఆఖరి టి20 మ్యాచ్‌లో ఇటీవల శ్రీలంకతో పుణేలో ఆడింది. నాటి మ్యాచ్ తుది జట్టును చూస్తే పెద్దగా మార్పులు అవసరం లేకుండానే టీమ్ ఇక్కడా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. రోహిత్ శర్మతో పాటు రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. కోహ్లి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాహుల్ కీపర్‌గా నిలదొక్కుకున్నాడు కాబట్టి అదే వ్యూహాన్ని కొనసాగించవచ్చు. కోహ్లి, అయ్యర్, మనీశ్ పాండేలు ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. అయితే స్వదేశంలో ఐదుగురు బౌలర్లతోనే ఆడిన భారత ఈసారి ఆరో బౌలర్‌ను ఎంచుకునే అవకాశం కనపిస్తోంది.
ఆరో స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే బరిలోకి దిగితే అతని బౌలింగ్ ఇక్కడి పిచ్‌లపై పనికొస్తుంది కూడా. అప్పుడు పంత్‌కు మరోసారి నిరాశ తప్పదు. ఏడో స్థానంలో జడేజా లేదా సుందర్‌లో ఒకరినే ఎంచుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. భారత జట్టు ఇటీవలి ఫామ్ ప్రకారం చూస్తే వేదిక విదేశీ గడ్డ అయినా పెద్దగా ఇబ్బంది పడటం లేదు. అన్ని రంగాల్లో ప్రత్యరి్థకంటే మనదే పైచేయిగా కనిపిస్తోంది.
స్వదేశంలో పటిష్టంగా...
బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ...ముగ్గురు అగ్రశ్రేణి పేస్ బౌలర్లు గాయాలతో ఈ సిరీస్‌కు దూరం కావడంతో న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ పదును తగ్గింది. దాంతో హామిష్ బెన్నెట్‌లాంటి బౌలర్లను ఆ జట్టు తిరిగి పిలవాల్సి వచి్చంది. స్కాట్ కుగెలిన్ కూడా ఏమాత్రం ప్రభావం చూపగలడనేది సందేహమే. అయితే సౌతీ లాంటి వెటరన్ చెలరేగిపోగలడు. ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని కూడా కివీస్ భావిస్తోంది. సాన్‌ట్నర్, సోధిలకు భారత్‌పై మంచి రికార్డే ఉంది. బ్యాటింగ్‌లో అందరూ అనుభవజు్ఞలైనవారే ఉండటం కివీస్ బలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్వదేశంలో గప్టిల్ ఎప్పుడైనా ప్రమాదకారినే. కెపె్టన్ విలియమ్సన్, మరో సీనియర్ రాస్ టేలర్‌ల ఆటపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ కూడా చెలరేగిపోగలడు.
యువ జట్లు కూడా...
అండర్–19 ప్రపంచ కప్‌లో పోరు
బ్లూమ్‌ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): ఒక వైపు భారత్, న్యూజిలాండ్ సీనియర్ జట్లు టి20 పోరులో తలపడుతుండగా ప్రపంచానికి మరో మూలన ఇవే జట్ల కుర్రాళ్లు అమీతుమీకి సిద్ధమయ్యారు. అండర్–19 ప్రపంచకప్‌లో భాగం గా నేడు గ్రూప్ ‘ఎ’లో భారత్, కివీస్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు శ్రీలంక, జపాన్‌లపై విజయాలతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో చోటు సంపాదించుకోగా, కివీస్ కూడా క్వార్టర్స్ చేరింది. టీమిండియాలో కుర్రాళ్లంతా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం విశేషం. కివీస్ గడ్డపైనే...: భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య నేడు రెండో అనధికారిక వన్డే క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పాండే, దూబే, జడేజా/ సుందర్, కుల్దీప్, షమీ, బుమ్రా, సైనీ
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, సీఫెర్ట్, టేలర్, గ్రాండ్‌హోమ్,సాన్‌ట్నర్, సోధి, సౌతీ, కుగెలీన్, బెన్నెట్
పిచ్, వాతావరణం
ఈడెన్ పార్క్ మైదానం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. మరీ చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయం. ఇటీవల కివీస్–ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా ఇదే కనిపించింది. అయితే వాతావరణంతో మాత్రం సమస్యే. మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. పూర్తిగా కాకపోయినా ఏదో ఒక దశలో అంతరాయం కలిగించవచ్చు.
►‘న్యూజిలాండ్ జట్టుతో ప్రతీకారమా? అసలు అలాంటి ఊహ కూడా మాకు రాదు. ఒక వేళ ప్రతీకారంగా భావించాలని అనుకున్నా ఇలాంటి మంచి జట్టుతో అలా చేయలేం. కివీస్ జట్టు సభ్యులందరితో మేం చాలా బాగా కలిసిపోతాం’
– విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment