కేప్‌టౌన్: మైదానంలో నాలుగు క్యాచ్‌లు...రెండు రనౌట్‌లు... తొలి టి20లో దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ప్రదర్శన ఇది. ఆరుగురు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతని ఫీల్డింగ్ నైపుణ్యంతో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (45 బంతుల్లో 78; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రీజా హెన్‌డ్రిక్స్ (41 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 బంతుల్లోనే 131 పరుగులు జోడించడం విశేషం. ఉస్మాన్ షిన్వారికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 186 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ షోయబ్ మాలిక్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), హుస్సేన్ తలత్ (32 బంతుల్లో 40; 5 ఫోర్లు), బాబర్ ఆజమ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment