
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ముందు అనవసర ప్రయోగాలకు వెళ్లకుండా... ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. అయితే, కొంతకాలంగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మపై భారం తగ్గించేందుకు రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ పర్యటన చివర్లో తప్పుకొన్న కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ సారథ్య పగ్గాలందుకుంటాడు. శుక్రవారం సమావేశం కానున్న సెలెక్టర్లు టి20 సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేయనున్నారని సమాచారం. ప్రపంచ కప్ ముందు ఇదే చివరి సిరీస్ కాబట్టి జట్టు మేనేజ్‌మెంట్ కూడా తొలి మూడు వన్డేలకు ప్రయోగాలు చేసే ఉద్దేశంలో లేదు. చివరి రెండు మ్యాచ్‌లకు మాత్రం ఓపెనర్ శిఖర్ ధావన్‌కు విశ్రాంతినిచ్చి కేఎల్ రాహుల్‌ను దింపుతుంది. పనిభారం తగ్గించేందుకు నలుగురు పేసర్లను రొటేషన్ ప్రకారం ఆడించనుంది.