వామ్మో మ్యాక్స్‌వెల్...! ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడం అంటే ఏమిటో చాటుతూ, సిసలైన టి20 ఇన్నింగ్స్‌ను చూపుతూ, వీర విహారం ఎలా ఉంటుందో కళ్లకు కడుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగి బెంగళూరులో ఆస్ట్రేలియాకు అద్భుత విజయాన్ని అందించాడు. క్లిష్టపరిస్థితుల్లోనూ వెన్ను చూపకుండా పోరాడి పొట్టి ఫార్మాట్‌లో తన మూడో శతకం బాదిన అతడు... కంగారూలకు టి20 సిరీస్ కానుకగా ఇచ్చాడు. విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్ తరహాలోనే చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో తుది ఫలితం కూడా అదే విధంగా వచ్చింది.
బెంగళూరు: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో రెండో టి20లోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. టీమిండియా బౌలింగ్‌ను ఆటాడుకుంటూ అతడు చెలరేగడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్‌పై తొలిసారిగా టి20 సిరీస్‌ను (2–0తో) నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) తనదైన స్థాయిలో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెటరన్ ధోని (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు. అనంతరం ఆసీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఓపెనర్ డార్సీ షార్ట్ (28 బంతుల్లో 40; 6 ఫోర్లు) సాయంతో ఛేదనను ముందుకు నడిపించిన మ్యాక్స్‌వెల్... పీటర్ హ్యాండ్స్‌కోంబ్ తోడుగా మ్యాచ్ ను ముగించాడు. మ్యాక్స్‌వెల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మార్చి 2న హైదరాబాద్‌లో జరుగుతుంది.
రాహుల్ మరోసారి...
ఓపెనర్లు ధావన్ (14), రాహుల్ ఆచితూచి ఆడటంతో భారత ఇన్నింగ్స్ నింపాదిగా ప్రారంభమైంది. గత మ్యాచ్ విశ్రాంతి తర్వాత బరిలో దిగిన ధావన్ టచ్ దొరక్క ఇబ్బందిపడ్డాడు. రాహుల్ మాత్రం కుదురుకున్నాక సొంత నగరంలో స్వేచ్ఛగా ఆడాడు. జే రిచర్డ్సన్, కమిన్స్ వేసిన 5, 6 ఓవర్లలో రెండేసి వరుస సిక్స్‌లు బాదాడు. కమిన్స్ బౌలింగ్‌లో కాళ్ల మీద పడిన బంతిని అద్భుత రీతిలో సిక్స్‌గా పంపాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. మరో అర్ధ శతకం చేసే ఊపులో కనిపించిన అతడు... కూల్టర్ నైల్ వేసిన బంతిని షాట్ ఆడబోయి రిచర్డ్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రెండు ఓవర్ల అనంతరం ధావన్ కూడా వెనుదిరిగాడు. పార్ట్‌టైమ్ బౌలర్ షార్ట్‌పై భారీ షాట్‌తో ప్రతాపం చూపబోయి పంత్ (1) ఔటయ్యాడు.
దుమ్మురేపిన కోహ్లి, ధోని...
23 బంతులు, మూడు వికెట్లు, 13 పరుగులు...! 8 నుంచి 11వ ఓవర్ మధ్య మన జట్టు పరిస్థితిది. స్కోరు 74/3. ప్రత్యర్థి బౌలర్లు లైన్‌కు కట్టుబడుతూ బంతులేస్తుండటంతో కోహ్లి క్రీజులో ఉన్నా పరుగుల రాక కష్టమైంది. తీరు చూస్తే విశాఖ మ్యాచ్ తరహాలోనే భారత్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, ఈ దశలో కెప్టె న్‌కు జత కలిసిన ధోని ఆసీస్‌కు పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ధోని మొదటినుంచీ ధాటిగా ఆడే ఉద్దేశంలో కనిపించాడు. జంపా (17వ) ఓవర్లో 3 పరుగులు రావడం మినహాయిస్తే వీరి జోరుకు అడ్డే లేకపోయింది. 7, 9, 9, 14, 22, 19, 15 పరుగుల చొప్పున ఓవర్ ఓవర్‌కు సాధ్యమైనన్ని జోడించుకుంటూ పోయారు. కూల్టర్ నైల్ వేసిన 16వ ఓవర్లో కోహ్లి హ్యాట్రిక్ సిక్స్‌లతో తడాఖా చూపాడు. 29 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తయింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో షార్ట్‌కు బంతినివ్వడం ప్రేక్షకులకు మునుపటి ధోనిని చూసే వీలు కల్పించింది. తనదైన శైలిలో బలమైన షాట్లతో మహి ఈ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో అలరించాడు. వీరిద్దరూ సరిగ్గా 50 బంతుల్లో 100 పరుగులు జోడించి స్కోరును అమాంతం పైకి తీసుకెళ్లారు. ఆఖరి ఓవర్లో ధోని ఔటయ్యాక వచ్చిన దినేశ్ కార్తీక్ (3 బంతుల్లో 8 నాటౌట్) రెండు బౌండరీలు కొట్టగా... లాంగాఫ్ సిక్స్‌తో కోహ్లి తనదైన శైలిలో ముగింపునిచ్చాడు.
ఆసీస్... అతడొక్కడే!
ఓపెనర్ స్టొయినిస్ (7)ను సిద్ధార్థ్ కౌల్, కెప్టెన్ అరోన్ ఫించ్ (8)ను విజయ్ శంకర్ త్వరగానే పెవిలియన్ పంపడంతో భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. అయితే, మరో ఓపెనర్ డార్సీ షార్ట్... మ్యాక్స్‌వెల్‌కు అండగా నిలిచాడు. ఏమాత్రం తగ్గకుండా ఆడిన వీరిద్దరూ 43 బంతుల్లోనే 73 పరుగులు జోడించి జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. 12వ ఓవర్లో షార్ట్‌ను శంకర్ ఔట్ చేసినా మ్యాక్సీ మొత్తం బాధ్యతను తీసుకున్నాడు. హ్యాండ్స్‌కోంబ్ (18 బంతుల్లో 20 నాటౌట్) సహాయ పాత్ర పోషించాడు. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా షాట్లు కొడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూసిన మ్యాక్స్‌వెల్... 30 బంతుల్లో 60 పరుగులు అవసరమైన స్థితిలో చహల్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్స్‌లు సహా 16 పరుగులు రాబట్టి మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గేలా చేశాడు. తదుపరి వరుసగా బుమ్రా బౌలింగ్‌లో 12, కౌల్ ఓవర్లో ఏకంగా 18 పరుగులు రావడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. 50 బంతుల్లో మ్యాక్స్‌వెల్ శతకం పూర్తయింది. బుమ్రా 5 పరుగులే ఇచ్చి 19వ ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసినా, చివరి ఓవర్లో ప్రత్యర్థి 9 పరుగులు చేయకుండా కౌల్ అడ్డుకోలేకపోయాడు. జోరులో ఉన్న మ్యాక్సీ సిక్స్, ఫోర్‌తో మ్యాచ్‌ను కంగారూల పరం చేశాడు.
►1కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. స్వదేశంలో కోహ్లి కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్‌లలో కలిపి 16 సిరీస్‌లు ఆడింది. 14 సిరీస్‌లలో గెలిచింది. మరో సిరీస్‌ను ‘డ్రా’ చేసుకొని తాజా టి20 సిరీస్‌లో ఓడింది.
►3 అంతర్జాతీయ టి20ల్లో మ్యాక్స్‌వెల్‌కిది మూడో సెంచరీ. దీంతో అతడు కొలిన్ మున్రో (న్యూజిలాండ్) సరసనæ నిలిచాడు. నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు.
►1 వరుసగా రెండు ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను ఓడిపోవడం భారత్‌కిదే తొలిసారి. ఈ సిరీస్‌కంటే ముందు న్యూజిలాండ్‌లోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది.
Comments
Please login to add a commentAdd a comment