ధర్మశాల: భారత్–దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా... వరుణుడి చుట్టపు చూపు పలకరింపు తప్పదేమో! ఔను మరి... రికార్డులు ఇదే విషయం చెబుతున్నాయి. గత మూడు సిరీస్ (2011–12, 2015–16, 2017–18)లలో ఏదో ఒక మ్యాచ్‌నైనా అడ్డుకున్న వర్షం వరుసగా నాలుగో సిరీస్‌లోనూ నేనున్నానంటూ వచ్చేసింది. దీంతో ఆదివారం ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టి 20 రద్దయింది. మధ్యాహ్నం నుంచే వాతావరణం మేఘావృతమై ఉండగా... సాయంత్రానికి వాన మొదలైంది. అంపైర్లు పిచ్‌ను తనిఖీ చేయాల్సిన పని లేకుండా, ఔట్ ఫీల్డ్‌ను పదేపదే పరిశీలించాల్సిన అవసరం రానంతగా తెరపి లేకుండా కురిసింది.
దీంతో కనీసం టాస్ కూడా పడలేదు. తుది జట్ల ప్రకటన సైతం చేయలేదు. మైదానంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా, ఆటకు ఏమాత్రం వీలుకానంతగా వర్షం పటడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. మ్యాచ్ ప్రారంభ సమయం (రాత్రి గం.7) నుంచి 50 నిమిషాలు వేచి చూసిన అనంతరం ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి తెలిసిపోయిన ప్రేక్షకులు అంతకు అరగంట ముందు నుంచే స్టేడియం నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఈ నెల 18న బుధవారం మొహాలీలో జరుగనుంది.
కుర్రాళ్లకు నాలుగైదు అవకాశాలే: కోహ్లి
వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని... లభించిన నాలుగైదు అవకాశాల్లోనే తమను తాము నిరూపించుకోవాలని జట్టులోని కుర్రాళ్లకు టీమిండియా కెపె్టన్ విరాట్ కోహ్లి సూచించాడు. కెరీర్ ఆరంభంలో తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని అతడు చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచ కప్ ముందు మాకు గరిష్టంగా 30 మ్యాచ్‌లున్నాయి. ప్రస్తుతం తీవ్ర పోటీ వాతావరణంలో ఉన్నాం. అందుకని కాసిన్ని అవకాశాలనే ఒడిసిపట్టాలి. వాస్తవానికి వీటిని తక్కువనే భావించాలి.
అరంగేట్రం సమయంలో నేను కూడా పదిహేను చాన్సులు వస్తాయని భావించలేదు. ఇప్పుడు జట్టులోనూ ఇదే మనస్తత్వం ఉంది. దీనిని తెలుసుకుని రాణించినవారే నిలవగలుగుతారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఓవైపు టి20 ప్రపంచ కప్‌నకు సన్నద్ధమవుతూనే టెస్టు చాంపియన్íÙప్ పైనా దృష్టిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో జట్టును పటిష్ట పరిచే దిశగా, విజయాలు సాధించే విధంగా యువకులను సమయానుకూలంగా పరీక్షిస్తామని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment