ధర్మశాల దద్దరిల్లింది | Rohit Century waste , india loss the t-20 match | Sakshi
Sakshi News home page

ధర్మశాల దద్దరిల్లింది

Published Sat, Oct 3 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

ధర్మశాల దద్దరిల్లింది

ధర్మశాల దద్దరిల్లింది

తొలి టి20లో పరుగుల వరద
7 వికెట్లతో భారత్ పరాజయం రోహిత్ సెంచరీ వృథా
దక్షిణాఫ్రికాను గెలిపించిన డుమిని
రెండో టి20 సోమవారం

 
హిమాలయాల చలి మంచులో బ్యాట్స్‌మెన్ భారీ షాట్లతో వేడి పుట్టిస్తుంటే... పక్కనే శిఖరాన్ని తాకుతాయా అనే రీతిలో సిక్సర్లు దూసుకుపోతుంటే... ధర్మశాల మైదానంలో పరుగుల వరద పారింది. ఒకరితో పోటీ పడుతూ మరొకరు... ఒకరిని మించి మరొకరు చెలరేగుతూ రసవత్తర పోరు సాగించారు. రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతీరుతో శతక్కొడితే... నేనూ ఉన్నానంటూ డివిలియర్స్ దడ పుట్టించాడు. అయితే ఆఖరి పంచ్ మాత్రం డుమినిదే. దక్షిణాఫ్రికా విజయానికి ఏ మాత్రం ఆశలు లేని స్థితినుంచి సిక్సర్ల మోతతో తమ జట్టుకు గెలుపు కిక్ అందించాడు. భారత జట్టు ఓడిపోయినా... సొంతగడ్డపై దాదాపు ఏడాది తర్వాత జరిగిన మ్యాచ్ అభిమానులకు సంపూర్ణ విందు భోజనాన్ని అందించింది.
 
గాంధీ-మండేలా ‘కాయిన్’
గాంధీ-మండేలా సిరీస్ మ్యాచ్‌లలో టాస్ వేసేందుకు బీసీసీఐ వీరిద్దరి బొమ్మలతో ప్రత్యేక నాణెం తయారు చేయించింది. బంగారు పూత కలిగిన ఈ వెండి నాణాన్ని ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు టాస్ కోసం ఉపయోగించడంతో పాటు భవిష్యత్తులో ఇరు జట్ల మధ్య సిరీస్‌లకు ఇదే తరహా నాణాన్ని ఉపయోగిస్తారు. శుక్రవారం తొలి టి20 మ్యాచ్ సందర్భంగా దీనిని ప్రవేశ పెట్టారు. ఇందులో బొమ్మ వైపు గాంధీ, మండేలా చిత్రాలు ఉండగా... బొరుసు వైపు ఫ్రీడం సిరీస్ అని రాసి ఉంటుంది.
 
ధర్మశాల: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఊహించినట్లుగానే బ్రహ్మాండమైన ఆరంభం లభించింది. హోరాహోరీగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో చివరకు సఫారీలదే పైచేయి అయింది. శుక్రవారం ఇక్కడి జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (66 బంతుల్లో 106; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా... విరాట్ కోహ్లి (27 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జేపీ డుమిని (34 బంతుల్లో 68 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పాటు... డివిలియర్స్ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగాడు. డుమిని, బెహర్దీన్ (23 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) 55 బంతుల్లోనే అభేద్యంగా 105 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ సోమవారం కటక్‌లో జరుగుతుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో ఉన్నారు.

సూపర్ హిట్ బ్యాటింగ్: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత జట్టులో శ్రీనాథ్ అరవింద్‌కు తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒక వైపు రోహిత్ శర్మ ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లతో భారత్‌కు మెరుగైన ఆరంభం అందించినా...సమన్వయ లోపంతో ధావన్ (3) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.  తాహిర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కోహ్లి 2, రోహిత్ 1 సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 39 బంతుల్లోనే రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు కోహ్లి కూడా ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయాడు. లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టి రోహిత్ 62 బంతుల్లో టి20 కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు. చివరకు భారీ భాగస్వామ్యం తర్వాత అబాట్ ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కాస్త తెరిపిన పడింది. చివర్లో మరి కొన్ని పరుగులు జోడించిన ధోని (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 41 పరుగులే చేయగలిగింది.

 సెంచరీ భాగస్వామ్యం: దక్షిణాఫ్రికాకు కూడా ఓపెనర్లు ఆమ్లా, డివిలియర్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. ముగ్గురు పేసర్లను కూడా అలవోకగా ఎదుర్కొన్న వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. అయితే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి ఆమ్లా రనౌట్ కావడంతో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. కొద్ది సేపటికే 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డివిలియర్స్‌ను అశ్విన్ అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో భారత్ కోలుకుంది. ఆ వెంటనే అరవింద్ తన తొలి వికెట్‌గా డు ప్లెసిస్ (4)ను అవుట్ చేశాడు. ఆరంభంలో ప్రతీ పరుగు కోసం తడబడ్డ డుమిని, బెహర్దీన్ ఆ తర్వాత నిలదొక్కుకున్నారు. అయితే అక్షర్ వేసిన 16వ ఓవర్లో డుమిని వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తర్వాతి నాలుగు ఓవర్లలో చెలరేగి వీరిద్దరు 44 పరుగులు జోడించడంతో భారత్ ఓటమి ఖాయమైంది.
 
 
2 భారత్ తరఫున టి20ల్లో సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ. గతంలో రైనా కూడా దక్షిణాఫ్రికాపైనే శతకం బాదాడు. ఈ మ్యాచ్‌తో రోహిత్ మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీ చేసిన ఆటగాడయ్యాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాట్స్‌మన్. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేలు, టి20ల్లోనూ అతను భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
 
 1  రోహిత్, కోహ్లి నెలకొల్పిన 138 పరుగుల భాగస్వామ్యం టి20ల్లో భారత్‌కు అత్యుత్తమం. గతంలో గంభీర్, సెహ్వాగ్ (136) రికార్డును వీరు సవరించారు.
 
1 టి20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడు విరాట్ కోహ్లి. ప్రపంచ క్రికెట్‌లో అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో (27) అతను ఈ ఘనత సాధించాడు.
 
50 అంతర్జా తీయ క్రికెట్‌లో 50 టి20 మ్యాచ్‌లకు సారథ్యం వహిం చిన తొలి కెప్టెన్ ధోని
 
 స్కోరు వివరాలు

 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోరిస్ (బి) అబాట్ 106; ధావన్ (రనౌట్) 3; కోహ్లి (సి) డుమిని (బి) అబాట్ 43; రైనా (ఎల్బీ) (బి) మోరిస్ 14; ధోని (నాటౌట్) 20; రాయుడు (రనౌట్) 0; అక్షర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 199.
 వికెట్ల పతనం: 1-22; 2-160; 3-162; 4-184; 5-184.
 బౌలింగ్: అబాట్ 4-0-29-2; రబడ 4-0-32-0; డి లాంజ్ 4-0-47-0; మోరిస్ 4-0-46-1; తాహిర్ 3-0-35-0; డుమిని 1-0-8-0.
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (రనౌట్) 36; డివిలియర్స్ (బి) అశ్విన్ 51; డు ప్లెసిస్ (బి) అరవింద్ 4; డుమిని (నాటౌట్) 68; బెహర్దీన్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 200.
 వికెట్ల పతనం: 1-77; 2-93; 3-95.
 బౌలింగ్: భువనేశ్వర్ 4-0-40-0; అరవింద్ 3.4-0-44-1; మోహిత్ 4-0-40-0; అక్షర్ 4-0-45-0; అశ్విన్ 4-0-26-1.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement