
టి20ల్లోనూ డీఆర్‌ఎస్!
ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదన
లండన్: ఇప్పటిదాకా టెస్టుల్లో, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్) ఇక టి20ల్లోనూ కనిపించే అవకాశాలున్నాయి. బుధ, గురువారాల్లో అనిల్ కుంబ్లే నేతృత్వంలో సమావేశమైన ఐసీసీ క్రికెట్ కమిటీ కొన్ని విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించింది. వీటిని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదిస్తే అక్టోబర్ 1 నుంచి అమలవుతాయి. కమిటీ సూచించిన ప్రతిపాదనల ప్రకారం... ఇప్పటిదాకా టి20ల్లో డీఆర్‌ఎస్ అమలు లేదు.
ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి మ్యాచ్‌నే మార్చేసే పరిస్థితి ఈ పొట్టి ఫార్మాట్‌లో ఉంటుందని గతంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ గట్టిగా వాదించాడు. దీంతో డీఆర్‌ఎస్ అమలుకు కమిటీ మొగ్గు చూపింది. అలాగే మైదానంలో అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లను బయటకు పంపే అధికారం అంపైర్లకు ఉండనుంది. ఎల్బీ నిర్ణయంపై ఆటగాడు అప్పీల్‌కు వెళ్లినప్పుడు రివ్యూలో స్పష్టంగా తేలని సమయంలో అంపైర్ నిర్ణయానికే వదిలేసి అవుట్‌గా ప్రకటించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇకనుంచి జట్టు రివ్యూ కోల్పోదు. ఇక టెస్టుల్లో మరిం త పోటీతత్వం తెచ్చేందుకు టెస్టు చాంపియన్‌షిప్‌ను తేవాల్సిందే అని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు.