R-Ashwin Bizarre Double DRS Review Off One Ball In TNPL 2023 Match, Video Goes Viral - Sakshi
Sakshi News home page

#TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌

Published Thu, Jun 15 2023 7:34 AM | Last Updated on Thu, Jun 15 2023 8:34 AM

R-Ashwin Bizarre Double DRS Review-Off-One Ball-TNPL 2023 Match - Sakshi

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2023లో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటుంది. ఒకే బంతికి 18 పరుగులు రావడం మరిచిపోకముందే మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్‌ఎస్‌ తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఒకసారి బ్యాటర్‌ రివ్యూ తీసుకుంటే.. మరోసారి అదే నిర్ణయంపై బౌలర్‌ రివ్యూ తీసుకున్నాడు.

లీగ్‌లో భాగంగా బుధవారం దిండిగుల్‌ డ్రాగన్స్‌, బా11 ట్రిచ్చి మధ్య మ్యచ్‌ జరిగింది. ట్రిచ్చి ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ను కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ చేశాడు. ఓవర్‌ చివరి బంతిని క్యారమ్‌ బాల్‌ వేయగా.. క్రీజులో ఉన్న రాజ్‌కుమార్‌ షాట్‌కు యత్నించగా బంతి మిస్‌ అయి కీపర్‌ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు సౌండ్‌ రావడంతో కీపర్‌ అప్పీల్‌ చేయగానే అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు.

దీంతో రాజ్‌కుమార్‌ రివ్యూ కోరాడు. రిప్లేలో స్పైక్‌ వస్తున్నప్పటికి బంతికి, బ్యాట్‌కు గ్యాప్‌ క్లియర్‌గా ఉండడంతో టీవీ అంపైర్‌ ఎస్‌. నిశాంత్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు. ఫీల్డ్‌ అంపైర్‌  నిర్ణయం ప్రకటించగానే అశ్విన్‌ వెంటనే మళ్లీ డీఆర్‌ఎస్‌ కోరాడు.  అయితే అశ్విన్‌ ఎందుకు రివ్యూ కోరాడో ఎవరికి అర్థం కాలేదు. బంతి బ్యాట్‌కు తగిలిందేమోనన్న అనుమానంతోనే అశ్విన్‌ రివ్యూ కోరినట్లు తెలుస్తోంది.

ఇదే విషయమై ఇద్దరు ఫీల్డ్‌ అంపైర్లతో అశ్విన్‌ చర్చించాడు. కాగా టీవీ అంపైర్‌ నిశాంత్‌ మరోసారి స్పష్టంగా పరిశీలించారు. అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్‌ కనిపిస్తున్నప్పటికి.. బంతికి, బ్యాట్‌కు గ్యాప్‌ క్లియర్‌గా ఉంది. దీంతో బ్యాట్‌ గ్రౌండ్‌కు తాకడంతోనే స్పైక్‌ వచ్చిందని.. ఇది నాటౌట్‌ అంటూ బిగ్‌స్క్రీన్‌పై చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బా11 ట్రిచ్చి 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ గంగా శ్రీధర్‌ రాజు 48 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. చివర్లో రాజ్‌కుమార్‌ 39 పరుగులతో రాణించాడు. దిండిగుల్‌ డ్రాగన్స్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. అశ్విన్‌, శరవణ కుమార్‌, సుబోత్‌ బాటిలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన దిండిగుల్‌ 14.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌ శివమ్‌ సింగ్‌ 46, బాబా ఇంద్రజిత్‌ 22, ఆదిత్య గణేశ్‌ 20, సుబోత్‌ బాటి 19 పరుగులు చేశారు.

చదవండి: రెండేళ్లలో ఆరు టెస్టు సిరీస్‌లు; మూడు స్వదేశం.. మూడు విదేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement