కొత్త ఏడాది...పాత ప్రత్యర్థి! | India vs Sri Lanka 1st T20 At Guwahati | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది...పాత ప్రత్యర్థి!

Published Sun, Jan 5 2020 3:43 AM | Last Updated on Sun, Jan 5 2020 7:32 AM

India vs Sri Lanka 1st T20 At Guwahati - Sakshi

శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో భారత ఆటగాళ్లు బుమ్రా, చహల్, శివమ్‌ దూబే, ధావన్, కోహ్లి (ఎడమ నుంచి)

భారత్‌ వర్సెస్‌ శ్రీలంక! సగటు క్రికెట్‌ అభిమానికి ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ‘మళ్లీ వచ్చిందా’... అనిపించడం ఇటీవల చాలా సహజంగా మారిపోయింది. స్వదేశమైనా, ప్రత్యర్థి మైదానమైనా, లేక తటస్థ వేదిక అయినా ఈ రెండు జట్లు తరచుగా తలపడుతుండటంతో ఫ్యాన్స్‌కు కూడా ఇలాంటి మ్యాచ్‌పై కొంత ఆసక్తి తగ్గిందనడంలో తప్పు లేదు. ఇప్పుడు మరోసారి అదే పాత ప్రత్యర్థి పోరుతోనే కొత్త ఏడాదిని మొదలు పెట్టేందుకు భారత్‌ సన్నద్ధమైంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఖరారు కాని ఈ సిరీస్‌ అనూహ్యంగా టీమిండియా షెడ్యూల్‌లో వచ్చి చేరింది. టి20 వరల్డ్‌ కప్‌ ఏడాది అయిన 2020లో కోహ్లి సేన విజయంతో
శుభారంభం చేస్తుందా చూడాలి.   

గువాహటి: కొంత విరామం, కొత్త సంవత్సరం వేడుకలు ముగిసిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. ‘మిషన్‌ 2020’ అంటూ ఈ ఏడాది టి20 ప్రపంచ కప్‌ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా అదే ఫార్మాట్‌తో బోణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడి బర్సపర స్టేడియంలో నేడు జరిగే తొలి టి20లో శ్రీలంకతో భారత్‌ తలపడుతుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు సంబంధించి గత కొన్నాళ్లుగా ఇక్కడ జరుగుతున్న నిరసనలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ నిర్వహణ సాఫీగా జరిగే అవకాశం కనిపిస్తోంది.  

బుమ్రా పునరాగమనం...
గత కొంతకాలంగా శ్రీలంకతో సిరీస్‌లకు తమ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ వచి్చన భారత్‌ ఈసారి కూడా దానిని పాటించింది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. దాంతో రాహుల్‌తో పాటు సీనియర్‌ శిఖర్‌ ధావన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గాయాలు, ఫామ్‌లేమితో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ధావన్‌కు ఈ సిరీస్‌ పరీక్షగా నిలవనుంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కాలంటే ఇప్పటి నుంచే పలువురు ఆటగాళ్లు తమ సత్తాను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇటీవల వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో ఆడిన తుది జట్టుతో పోలిస్తే ఎక్కువ మార్పులకు అవకాశం లేదు.

కోహ్లి, అయ్యర్, పంత్‌లతో బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా ఉంది. వీరికి శివమ్‌ దూబే జత కలిస్తే భారత్‌ భారీ స్కోరును అడ్డుకోవడం ప్రత్యరి్థకి కష్టమైపోతుంది. జడేజా బ్యాటింగ్‌ కూడా జట్టుకు అదనపు బలం. అన్నింటికన్నా చెప్పుకో వాల్సింది బుమ్రా పునరాగమనం గురించే. ఆగస్టులో వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌ టెస్టు తర్వాత  గాయంతో స్వదేశంలో జరిగిన మూడు సిరీస్‌లకు దూరమైన బుమ్రా తిరిగి మైదానంలోకి వస్తున్నాడు. బుమ్రా రాకతో భారత బౌలింగ్‌ బలం పెరిగిపోగా... తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు కూడా అతనికి ఇది మంచి అవకాశం కానుంది.  

రాత మారేనా!  
2014 టి20 ప్రపంచ కప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. ఇది మినహాయిస్తే గత దశాబ్ద కాలం లో ఆ జట్టు ఏ దశలోనూ భారత్‌ను ఇబ్బంది పెట్టలేకపోయింది. టీమిండియా ఎదురుగా లంక బలహీనంగా మారిపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే 2008 జులై తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో (మూడు ఫార్మాట్‌లలో కలిపి) ఒక్కదాంట్లో కూడా లంక గెలవలేదు. అటు టి20 కెపె్టన్‌గా మలింగ రికార్డు పేలవం గా ఉంది. అతని సారథ్యంలో ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఓడితే ఒకటే గెలిచింది!  ఈ నేపథ్యంలో పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు. ఇటీవల పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై టి20 సిరీస్‌లో ఓడించిన లంక... కొద్ది రోజులకే ఆ్రస్టేలియాలో పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసింది. అయితే ఈ ఫార్మాట్‌లో ఒకటి, రెండు సంచలన ప్రదర్శనలకు కూడా జట్టు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి లంక అలాంటి అద్భుతాన్ని ఆశిస్తోంది.

నాలుగు రోజుల టెస్టులకు ‘నో’...
టి20 తుది జట్టును ఎంచుకోవడంలో మాకెప్పుడూ సమస్య లేదు. ఐపీఎల్‌లో అందరూ బాగా ఆడేవారే. ప్రతీ ఒక్కరు అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధం అన్నట్లుగానే ఉంటారు. వీరిలోంచి జట్టు అవసరాలకు అనుగుణంగా ఆ సమయంలో ఎవరు సరిపోతారో ఎంచుకుంటే చాలు ప్రపంచ కప్‌ టీమ్‌ రెడీ అయినట్లే. ఒత్తిడి సమయంలో ఎవరు రాణించగలరో రాబోయే సిరీస్‌లలో తెలుస్తుంది. ముఖ్యంగా టాపార్డర్‌పైనే ఆధారపడకుండా ఆరు, ఏడు స్థానాల్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి బాగా ఆడగలిగే వారుంటేనే ఐసీసీ టోర్నీలో విజయాలు లభిస్తాయి. మా పేస్‌ బౌలర్లలో అందరికీ ఒక్కో ప్రత్యేకత ఉంది కాబట్టి ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కు మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నట్లే.

ఇటీవల టెస్టులను నాలుగు రోజులకు పరిమితం చేయాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. నేను దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు నాలుగు రోజులంటారు. ఆ తర్వాత మూడు రోజులు కావాలంటారు. ఆపై టెస్టులకు ఆదరణ తగ్గిందంటే ఏం చెబుతాం. నా అభిప్రాయం ప్రకారం క్రికెట్‌కు మూలంలాంటి ఫార్మాట్‌ను మనం కదిలించవద్దు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి నేను ఎలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. ప్రతీ అంశంపై రెండు వర్గాల నుంచి భిన్నమైన వాదనలు ఉంటాయి. మనం ఒకటి చెబితే ఇంకొకరు మరొకటి చెప్పవచ్చు. కాబట్టి దీనిపై పూర్తి సమాచారం, అవగాహన లేకుండా ఏమీ మాట్లాడను.
–కోహ్లి, భారత కెప్టెన్

తుది జట్ల వివరాలు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, దూబే, జడేజా, సుందర్, కుల్దీప్‌/ చహల్, శార్దుల్, బుమ్రా.  శ్రీలంక: మలింగ (కెపె్టన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, కుశాల్‌ పెరీరా, మాథ్యూస్, షనక, ఉడాన, హసరంగ, లహిరు కుమార/రజిత.

పిచ్, వాతావరణం
మంచి బ్యాటింగ్‌ వికెట్‌. భారీ స్కోరుకు అవకాశం ఉంది. గత వారం రోజులుగా గువాహటిలో వర్షాలు కురిసినా ఇప్పు డు ఆగిపోవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడకపోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement