మ్యాచ్‌ జరిగే అవకాశాలు 50–50..!! | India vs South Africa 3rd T20 Series In Bengaluru | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ జరిగే అవకాశాలు 50–50..!!

Sep 22 2019 2:16 AM | Updated on Sep 22 2019 4:38 AM

India vs South Africa 3rd T20 Series In Bengaluru  - Sakshi

భారత్‌–దక్షిణాఫ్రికా మధ్య జరిగిన గత టి20 సిరీస్‌లలో కనీసం ఒక్క మ్యాచ్‌నైనా అడ్డుకున్న వరుణుడు... ఈసారి గరిష్టంగా రెండు మ్యాచ్‌లను దెబ్బకొట్టేలా ఉన్నాడు. ఇప్పటికే ధర్మశాల తొలి టి20 వాన కారణంగా రద్దవగా... ఆదివారం బెంగళూరులో జరగాల్సిన మూడో మ్యాచ్‌కూ వాన ముప్పు పొంచి ఉంది. శనివారం ఇక్కడి వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది.

ఈ నేపథ్యంలో ఆదివారం మ్యాచ్‌ జరిగే అవకాశాలు 50–50నే అన్నట్లున్నాయి. పూర్తిగా రద్దయిన పక్షంలో 1–0 ఆధిక్యంలో ఉన్న భారత్‌ సిరీస్‌ను గెల్చుకుంటుంది. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడగా... రెండింటిలో గెలిచి, మరో రెండింటిలో ఓడిపోయింది.   

బెంగళూరు: వచ్చే ఏడాది జరుగనున్న టి20 ప్రపంచ కప్‌నకు సమాయత్తం అవుతూ, అందుకుతగ్గ యువ ఆటగాళ్లను పరీక్షించే ప్రయత్నంలో ఉన్న టీమిండియా... రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను అలవోకగానే ఓడించింది. బెంగళూరులో ఆదివారం జరిగే మూడో టి20లోనూ ఇదే జోరును ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా సంపూర్ణ ఆధిపత్యంతో టెస్టు సిరీస్‌కు వెళ్లాలని భావిస్తోంది. బలాబలాలరీత్యా కోహ్లి సేన ముందు సఫారీలు నిలవడం కష్టమే. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఈ మ్యాచ్‌కు రెండు జట్లు చెరో మార్పుతో బరిలో దిగనున్నాయి.

మార్పు ఆ ఒక్కటేనా?
భారత్‌ ఈ మ్యాచ్‌లో ఎడంచేతి వాటం స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ను ఆడించొచ్చు. బౌండరీలు చిన్నవి కాబట్టి ఒక స్పిన్నర్‌ను తగ్గించుకుని ఖలీల్‌ అహ్మద్‌ను మూడో పేసర్‌గా ఎంచుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నా ఇందుకు ఆస్కారం తక్కువే. ఈ మైదానంలో 2018 నుంచి పేసర్లు ఓవర్‌కు సగటున 9.8 పరుగులిస్తే... స్పిన్నర్లు 8.1 చొప్పునే ఇచ్చారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎలాగూ మూడో పేసర్‌గా పనికొస్తాడు. ప్రత్యర్ధి బలహీనతల దృష్ట్యా చూసినా టీమిండియా స్పిన్‌పైనే ఎక్కువ ఆధారపడుతుంది. టాప్‌ –3లో ధావన్‌ ఫామ్‌లోకి రావడం ఆందోళన తగ్గించింది. తోడుగా రోహిత్, కోహ్లి చెలరేగితే సఫారీ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.

సఫారీ... గెలవాలంటే సవాలే!
భారత్‌పై అదీ భారత్‌లో నెగ్గాలంటే సహజంగానే ఏ జట్టయినా అసాధారణంగా ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దక్షిణాఫ్రికా దీనికిమించి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. తొలి టి20లో కెపె్టన్‌ డికాక్‌ ఒక్కడే పరిస్థితులకు తగ్గట్లు ఆడాడు. బవుమా మొదట ఫర్వాలేకున్నా చివర్లో వేగం చూపలేకపోయాడు. ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్, మిడిలార్డర్‌లో డసెన్, మిల్లర్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తేనే టీమిండియాకు భారీ లక్ష్యాన్ని విధించగలుగుతుంది. నోర్టెను పక్కనపెట్టి... టి20ల్లో రోహిత్‌ను మూడుసార్లు ఔట్‌ చేసిన రికార్డున్న పేసర్‌ డాలాను తీసుకోనున్నారు. ప్రధాన పేసర్‌ రబడ తొలి మ్యాచ్‌లో కనీస ప్రభావం చూపలేదు. మిగతా బౌలర్ల సంగతి వదిలేస్తే ఈ మ్యాచ్‌లో అతడు సత్తా చాటితేనే జట్టు పోటీ ఇవ్వగలుగుతుంది.

తుది జట్లు (అంచనా): భారత్‌: రోహిత్, ధావన్, కోహ్లి (కెపె్టన్‌), అయ్యర్, పంత్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా/రాహుల్‌ చహర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, దీపక్‌ చహర్, నవదీప్‌ సైనీ.
దక్షిణాఫ్రికా: డికాక్‌ (కెప్టెన్‌), హెన్‌డ్రిక్స్, డసెన్, బవుమా, మిల్లర్, ఫెలూక్వాయో, ప్రిటోరియస్, ఫార్చూన్, రబడ, డాలా, షమ్సీ.

పంత్‌.. నిర్భీతి నుంచి నిర్లక్ష్యానికి
ఇప్పుడు అందరి కళ్లూ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పైనే. భయం లేకుండా ఆడతాడన్న మంచి పేరుతో జట్టులోకి వచి్చన అతడు నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకుంటున్నాడన్న చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు. వన్డే ప్రపంచ కప్‌ సెమీస్, విండీస్‌ పర్యటన, రెండో టి20లో పరిస్థితులను గ్రహించకుండా పంత్‌ కొట్టిన షాట్లు; ఔటైన తీరు విమర్శలకు తావిచ్చాయి.  శ్రేయస్‌ అయ్యర్‌ను కాదని మరీ నంబర్‌–4లో దింపుతూ ప్రతిభ చాటేందుకు మంచి వేదిక సిద్ధం చేస్తున్నా పంత్‌ సది్వనియోగం చేసుకోలేకపోతున్నాడు. దీంతో సంజు సామ్సన్‌ వంటివారి పేర్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నందున పంత్‌ను ఐదో స్థానంలో దింపడమే జట్టుకు ఉపయోగకరం. జట్టు్ట మేనేజ్‌మెంట్‌ మాత్రం మరోలా ఆలోచిస్తూ అతడిని ముందుకు పంపుతోంది. ఇది చివరకు పంత్‌ కెరీర్‌కే ఇబ్బందిగా మారేలా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement