లూయిస్‌ విధ్వంసం | west indies won by t20 match | Sakshi
Sakshi News home page

లూయిస్‌ విధ్వంసం

Published Mon, Jul 10 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

లూయిస్‌ విధ్వంసం

లూయిస్‌ విధ్వంసం

అజేయ సెంచరీతో విండీస్‌ను గెలిపించిన ఓపెనర్‌
ఏకైక టి20లో భారత్‌ ఓటమి


కింగ్‌స్టన్‌: లూయిస్‌ విండీస్‌ ఓపెనర్‌. వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లాడి 67 పరుగులే చేశాడు. కానీ ఏకైక టి20లో మాత్రం శతక్కొట్టాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అరడజను ఫోర్లు, డజను సిక్సర్లతో మ్యాచ్‌ను పోటీలేకుండా ముగించాడు. దీంతో గ్యాలరీలోనే ప్రేక్షకులే కాదు... మైదానంలోని భారత ఆటగాళ్లు ప్రేక్షకులయ్యారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన కోహ్లి (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్‌), దినేశ్‌ కార్తీక్‌ (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు.

రిషభ్‌ పంత్‌ (35 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 18.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 194 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఓపెనర్‌ లూయిస్‌ (62 బంతుల్లో 125 నాటౌట్‌; 6 ఫోర్లు, 12 సిక్సర్లు) ఉప్పెన ముందు భారత లక్ష్యం కుదేలైంది. శామ్యూల్స్‌ (29 బంతుల్లో 36 నాటౌట్‌; 5 ఫోర్లు, 1సిక్స్‌) రాణించాడు. లూయిస్‌ వ్యక్తిగత స్కోరు 46, 55 వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం.

ధనాధన్‌...
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ నింపాదిగా మొదలై మెరుపుల మలుపు తీసుకుంది. క్రిస్‌ గేల్, లూయిస్‌లు మెల్లిగా ఆడటంతో తొలి 3 ఓవర్లలో 17 పరుగులే వచ్చాయి. కానీ ఆ తర్వాతి ఓవర్‌ నుంచే లూయిస్‌ దంచుడు మొదలైంది. షమీ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో లూయిస్‌ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. గేల్‌ కూడా ఓ ఫోర్‌ కొట్టడంతో ఆ ఒక్క ఓవర్లోనే 19 పరుగులు జతచేరాయి. దీంతో జట్టు స్కోరు డబులైంది. ఆరు బంతుల తేడాతో 17 పరుగుల నుంచి అమాంతం 36కు చేరింది. ఇక అక్కడి నుంచి పరుగుల ప్రవాహం మొదలైంది. ప్రతి ఓవర్‌ సిక్స్‌లు, లేదంటే ఫోర్లు లేకుండా ముగియలేదు. ఓవర్‌కు సగటున 10 పరుగులు వచ్చాయి. 24 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్సర్లు) లూయిస్‌ అర్ధసెంచరీ పూర్తయింది. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాక గేల్‌ ఔటయ్యాడు. తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ఆడిన కుల్దీప్‌ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో గేల్‌ (20 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌)ను పెవిలియన్‌ చేర్చాడు.

 దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన శామ్యూల్స్‌... లూయిస్‌కు జతయ్యాడు. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ ఓపెనర్‌ లూయిస్‌ పరుగుల ప్రవాహం కాస్తా... విధ్వంసం స్థాయికి చేరింది. అతను కొట్టే సిక్సర్లకు మైదానమే చిన్నబోయింది. భారత బౌలర్లకు పగలే చుక్కల్ని చూపించాడు. ముఖ్యంగా షమీ పరుగుల్ని సమర్పించుకోవడం మినహా చేసేదేమీలేకపోయింది. ఉరిమే ఉత్సాహంతో సెంచరీకి సమీపించిన లూయిస్‌... జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో వరుస సిక్సర్లు బాది టి20లో తన రెండో శతకాన్ని పూర్తి చేశాడు. కేవలం 53 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ ఫీట్‌ను సాధించాడు. మరోవైపు శామ్యూల్స్‌ కూడా ఓ వైపు లూయిస్‌కు స్ట్రయిక్‌ ఇస్తూనే... అడపాదడపా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఇద్దరు మరో వికెట్‌ పడకుండా జట్టును గెలిపించారు. దీంతో మరో 9 బంతులు మిగిలుండగానే విండీస్‌ విజయం సాధించింది.

సూపర్‌ ఆరంభం
ధావన్‌తో కలిసి భారత్‌ ఇన్నింగ్స్‌ను కోహ్లి మెరుపు వేగంతో ఆరంభించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు భారత కెప్టెన్‌. బద్రీ వేసిన ఈ తొలి ఓవర్లో శిఖర్‌ ధావన్‌ కూడా రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాత టేలర్‌ వేసిన ఓవర్లోనూ భారత ఓపెనర్లు మూడు ఫోర్లు బాదారు. దీంతో రెండే ఓవర్లలో 26 పరుగులు... 4.4 ఓవర్లలో జట్టు స్కోరు 50 దాటింది. ఇలా ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను విలియమ్స్‌ దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ తొలి రెండు బంతుల్ని 6, 4గా తరలించిన కోహ్లి ఆ మరుసటి బంతికి ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు. దీంతో తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 తర్వాత రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. కానీ ఈ జోడి కథ రెండు బంతుల వ్యవధిలోనే ముగిసింది. సమన్వయలేమితో జోరు మీదున్న ధావన్‌ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు) రనౌటయ్యాడు. ఈ దశలో రిషభ్‌కు దినేశ్‌ కార్తీక్‌ జతయ్యాడు. వీరిద్దరు ఓపెనర్లిచ్చిన దూకుడును కొనసాగించారు. శామ్యూల్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ భారీ సిక్సర్, బౌండరీ బాదడంతో భారత్‌ స్కోరు 100కు చేరింది. ఆ తర్వాత బ్రాత్‌వైట్‌ వేసిన 13వ ఓవర్లోనూ దినేశ్‌ కార్తీక్‌ రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. 16వ ఓవర్లో రిషభ్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. శామ్యూల్స్‌ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. కానీ అదే ఓవర్లో జట్టు స్కోరు 151 పరుగుల వద్ద దినేశ్‌ కార్తీక్‌ను చక్కని బంతితో శామ్యూల్స్‌ బోల్తా కొట్టించాడు. దీంతో మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారెవరూ ఈ స్థాయిలో మెరుపులు మెరిపించకపోవడంతో పరుగుల వేగం మందగించింది.  దీంతో 200 పరుగులు దాటాల్సిన స్కోరు 190 పరుగులకే పరిమితమైంది.   

‘హెడ్స్‌’ అన్నా... ‘టెయిల్‌’ అన్నా...
వెస్టిండీస్‌ పర్యటనలో కోహ్లికి ఫలితాలు కలిసొచ్చాయి. కానీ బొమ్మబొరుసే ఏ మ్యాచ్‌కూ కలిసిరాలేదు. టూర్‌ అసాంతం కోహ్లి టాస్‌లో మాత్రం గెలవలేదు. ఐదు వన్డేల సిరీస్‌లో టాస్‌ కెళ్లిన ప్రతీసారి ‘హెడ్స్‌’అనే చెబితే టెయిల్‌ పడింది. ఈసారి... ఏకైక టి20 మ్యాచ్‌లో మాత్రం ‘టెయిల్‌’ను నమ్ముకుంటే ‘హెడ్స్‌’ వచ్చింది. అయ్యయ్యో కోహ్లి!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement