సెలక్షన్ కమిటీ సమావేశానికి వస్తున్న కెప్టెన్ కోహ్లి
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్‌నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది.
హార్దిక్‌ది గాయయా? విశ్రాంతా?
మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్‌కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్‌లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్‌కు వచ్చేసరికి ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
పృథ్వీ షా మళ్లీ మిస్...
అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్‌కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్‌నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్‌లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్‌తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు.
టెస్టు జట్టు: సభ్యులు 16
ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్.
ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్‌గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్‌కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్‌గా తీసుకున్నారు. ఆసీస్ టూర్‌లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్‌ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది.
వన్డే జట్టు: సభ్యులు 15
ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ.
ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్‌నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్‌మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్‌పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు.
టి20 జట్టు: సభ్యులు 15
ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ.
ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్‌కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్‌కు పరిగణించలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్‌గా వ్యవహరిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment