
Team India Chief Selector: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సెలక్షన్ కమిటీ విషయంలో ఈ మాజీ పేసర్‌కే భారత క్రికెట్ నియంత్రణ మండలి మరోసారి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కాగా 2020 డిసెంబరులో సునిల్ జోషి స్థానంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ నియమితుడయ్యాడు.
ఈ క్రమంలో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన ఈ పంజాబ్ క్రికెటర్‌కు టీ20 ప్రపంచకప్-2022 తర్వాత చేదు అనుభవం ఎదురైంది. ఆసియా కప్, వరల్డ్‌కప్ ఈవెంట్లలో టీమిండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసింది బీసీసీఐ.
ప్రక్షాళన చర్యల్లో భాగంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. చేతన్ శర్మనే మరోసారి చీఫ్ సెలక్టర్ చేసేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చేతన్ శర్మను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చెప్పినట్లు సమాచారం.
నిబంధనలకు అనుగుణంగానే చేతన్‌తో పాటు హర్వీందర్ సింగ్ కూడా తన పదవిలో కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సెలక్షన్ ప్యానెల్‌లో వీరితో పాటు 13 మంది పేర్లు షార్ట్‌లిస్టు అయినట్లు తెలుస్తోంది. అయితే, చీఫ్ సెలక్టర్ పదవి కోసం పోటీపడ్డ వెంకటేశ్ ప్రసాద్‌కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.
కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన వైఫల్యం నేపథ్యంలో నవంబరులో సెలక్షన్ కమిటీని రద్దు చేశారు. సెమీస్‌లోనే భారత్ ఇంటిబాట పట్టిన తరుణంలో ఈ మేరకు సెలక్టర్లపై వేటు వేశారు. ఈ క్రమంలో ఖాళీ స్థానాల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.
ప్రెస్‌నోట్ రిలీజ్‌లో.. ఇందుకు గల అర్హతలను ప్రస్తావించింది. ‘‘కనీసం ఏడు టెస్టు మ్యాచ్‌లు లేదంటే, 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు. అదే విధంగా ఆటకు వీడ్కోలు పలికి కనీసం ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు’’ అర్హులు అని పేర్కొంది.
చదవండి: Ind Vs SL: ఆసియా చాంప్‌తో ఆషామాషీ కాదు! అర్ష్‌దీప్‌పైనే భారం! ఇషాన్, రుతు.. ఇంకా
Comments
Please login to add a commentAdd a comment