
మూడు ఫార్మాట్లలో మార్పులు!
ఐసీసీ సీఈసీ మీటింగ్‌లో ప్రతిపాదన
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యా యి. టెస్టులు, వన్డేలు, టి20ల్లో మరింత పోటీతత్వాన్ని పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొన్ని విప్లవాత్మక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. రెండు రోజుల పాటు ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈమేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రెండేళ్ల పాటు జరిగే టెస్టు లీగ్, వన్డే ప్రపంచకప్ అర్హత కోసం మూడేళ్ల పాటు 13 జట్లతో కూడిన వన్డే లీగ్ నిర్వహణ, టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ప్రాంతీయ అర్హత మ్యాచ్‌లను జరపాలని నిర్ణయించారు. వీటిని ఐసీసీ బోర్డులో ఆమోదించాల్సి ఉంది. నేడు (శనివారం) ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉన్నా ఇందులో చర్చకు వచ్చే అవకాశాలు లేవు. ఏప్రిల్‌లో జరిగే మరో బోర్డు సమావేశంలో వీటిపై ఆమోద ముద్ర పడనుంది.
ఇదే జరిగితే 2019 నుంచి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో సమూల మార్పులు ఉంటాయి. ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు సుదీర్ఘకాలంగా మ్యాచ్‌లు జరిగినట్టుగానే వన్డే ప్రపంచకప్ కోసం 13 జట్లు మూడేళ్ల పాటు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో పది శాశ్వత సభ్యదేశాలతో పాటు అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్, ప్రపంచ క్రికెట్ లీగ్ విజేత పాల్గొంటాయి. ఏడాదిలో కనీసం ఓ జట్టు 12 వన్డేలు ఆడాల్సి ఉంటుంది.