![World Cup 2019 Team India Vs Pakistan Match Most Watched Globally - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/16/world-cup-2019-india-vs-pak.jpg.webp?itok=VwFNfJMj)
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2019లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య జరిగిన ఈ ఉద్వేగభరితమైన మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 273 మిలియన్ల మంది టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించగా.. డిజిటల్ వేదికగా 50 మిలియన్ల మంది తిలకించారు. ఈ వివరాలు ఐసీసీ మీడియా అధికారికంగా ప్రకటించింది అంతేకాకుండా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలక సెమీఫైనల్‌ను కూడా ప్రేక్షకులు భారీగానే ఆదరించారు. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌ను 25.3 మిలియన్ల మంది లైవ్‌స్ట్రీమింగ్‌లో వీక్షించారు.
ఓవరాల్‌గా ఈ ప్రపంచకప్‌ను 1.6 బిలియన్లకు(160 కోట్లు)పైగా క్రికెట్ అభిమానులు ఆదరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్స్, లైవ్, హైలెట్స్ 20,000 గంటలకు పైగా ప్రసారం కావడం విశేషం. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీని 38 శాతం మంది అధికంగా తిలకించారని ఐసీసీ తెలిపింది. దీంతో అన్ని విధాల ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ విజయవంతమైనట్లు ఐసీసీ ఆనందం వ్యక్తం చేసింది. టోర్నీ ఆరంభంలో పలు మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలవడంతో అభిమానులకు ప్రపంచకప్‌పై ఆసక్తి పోయిందని వార్తలు వచ్చాయి. కానీ టోర్నీ నడుస్తున్న కొద్దీ మ్యాచ్‌లు రసవత్తరంగా జరగడంతో ప్రపంచకప్‌కు డబుల్ క్రేజ్ ఏర్పడిందని ఐసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment