ముంబై: మొన్నటి వరకు అభిమానులు లేక వెలవెలబోయిన నగరంలోని ఎరీనా ఫుట్‌బాల్ స్టేడియం.. ఇప్పుడు కిటకిటలాడుతోంది. మ్యాచ్ చూద్దామంటే టికెట్లు కూడా దొరికే పరిస్థితి లేదు. ‘తిట్టండి కానీ మా మ్యాచ్‌లు చూడండి.. మైదానాలకు రండి’ అంటూ భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత విశేషణ స్పందన లభిస్తోంది.
ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి గం.8.00లకు భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లన్నీ అప్పుడే అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని నిర్వహకులు తెలిపారు. దాంతో పాటు ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు సైతం టికెట్లు లేనట్లు వారు ప్రకటించారు. అంతకుముందు కెన్యాతో జరిగిన మ్యాచ్‌కు సైతం టికెట్లన్నీ అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.
చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ సునీల్ చెత్రీ హ్యాట్రిక్ గోల్ సాధించడంతో భారత్ 5-0తో సునాయస విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు కేవలం 2500 మంది మాత్రమే హాజరుకావడంతో భారత కెప్టెన్ సునీల్ చెత్రీ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చెత్రి ఆవేదనతో అటు సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా అర్ధం చేసుకోవడంతో భారత ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు భారీ మద్దతు దక్కుతుంది.
ఇదిలా ఉంచితే, వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే ఫైనల్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్న భారత్.. మరో విజయంతో గ్రూప్ దశను ముగించాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ కాని పక్షంలో గోల్స్ ఆధారంగా తుది బెర్తును భారత్ ఖాయం చేసుకునే అవకాశం ఉంది. భారత్‌తో పాటు.. ఫైనల్ రేసులో న్యూజిలాండ్, కెన్యా కూడా ఉన్నాయి. ఆ రెండు జట్లు ఒక్కో విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment