బోల్ట్‌ ‘వరల్డ్‌’ రికార్డును బ్రేక్‌ చేశారు.. | Allyson Felix Surpasses Usain Bolts World Record | Sakshi
Sakshi News home page

బోల్ట్‌ ‘వరల్డ్‌’ రికార్డును బ్రేక్‌ చేశారు..

Published Mon, Sep 30 2019 2:10 PM | Last Updated on Mon, Sep 30 2019 2:23 PM

Allyson Felix Surpasses Usain Bolts World Record - Sakshi

దోహా:  సుమారు తొమ్మిది సంవత్సరాలపాటు అతని ముందు గాలికూడా జొరబడలేని వేగంతో అత్యధిక ప్రపంచ చాంపియన్‌ పతకాలూ గెలుచుకున్న జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు బ్రేక్‌ అయ్యింది. అమెరికాకు చెందిన మహిళా స్ప్రింటర్‌ అలిసన్‌ ఫెలిక్స్‌.. బోల్ట్‌ వరల్డ్‌ రికార్డును బద్ధలు కొట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్‌ 4/400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో స్వర్ణం పతకం సాధించడంతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకూ ఫిలెక్స్‌ 12 స్వర్ణ పతకాలను సాధించి కొత్త రికార్డుకు నాంది పలికారు. అంతకుముందు ఈ రికార్డు ఉసేన్‌ బోల్ట్‌ పేరిట ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్‌ 11 పసిడి పతకాలు సాధించగా దాన్ని ఫెలిక్స్‌ సవరించారు.

4/400 మిక్స్‌డ్‌ రిలేలో ఫెలిక్స్‌ రెండో లెగ్‌ నుంచి పోరును ఆరంభించారు. అయితే ఈ టైటిల్‌ను గెలిచే క్రమంలో అమెరికా మిక్స్‌డ్‌ రిలే జట్టు 3 నిమిషాల 9.34 సెకండ్లలో పరుగును పూర్తి చేసి విజేతగా నిలిచింది.  ఇది సరికొత్త వరల్డ్‌ రికార్డుగా నమోదైంది. ఇలా 4/400 మిక్స్‌డ్‌ రిలేలో అమెరికా జట్టు వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేయడం రెండోసారి. ఇక్కడ జమైకా, బెహ్రయిన్‌ జట్లను వెనక్కునెట్టి టైటిల్‌ను అందుకున్నారు. ఇక ఫెలిక్స్‌ ఓవరాల్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ ప్రదర్శనలో మహిళల 200 మీటర్ల రేసులో మూడు స్వర్ణాలు గెలుచుకోగా, 400 మీటర్ల రేసులో ఒక పసిడిని అందుకున్నారు. 4/100 మీటర్ల మహిళల రిలేలో మూడు స్వర్ణ పతకాలను ఫెలిక్స్‌ సాధించారు. ఇక 4/400 మీటర్ల మహిళల రిలేలో నాలుగు బంగారు పతకాలను అందుకున్నారు.  తాజాగా 4/400 మిక్స్‌డ్‌ రిలేలో ఫెలిక్స్‌కు ఇది స్వర్ణం. అయితే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఫెలిక్స్‌కు మొదటి స్వర్ణం కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement