సిడ్నీ: వన్డే వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి వచ్చేసరికి ఆసీస్ తేలిపోవడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కీలక సమయంలో ఆసీస్ ఒత్తిడిని జయించడంలో విఫలం కావడంతోనే మెగా టోర్నీని సెమీస్‌లోనే ముగించాల్సి వచ్చిందన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆసీస్ తొలి 10 ఓవర్ల వరకూ బాగానే ఆడినా తర్వాత మాత్రం వరుస వికెట్లు కోల్పోతూ రావడం ఘోర పరాజయంపై ప్రభావం చూపిందన్నాడు. ప్రధానంగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ షాట్ కొట్టి ఔటైన తీరును బోర్డర్ తప్పుబట్టాడు. ఆసీస్ కుదురుకుంటున్న సమయంలో క్యారీ అనవసరపు షాట్ కొట్టి పెవిలియన్ చేరడం ఆసీస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాడు.
‘సరైన సమయంలో ఇంగ్లండ్ జూలు విదిల‍్చింది. నేను భయపడుతున్నట్లుగానే నాకౌట్ సమరంలో ఇంగ్లండ్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో ప్రమాదమని నేను ముందు నుంచీ భయపడుతూనే ఉన్నా. నా భయమే నిజమైంది. ఇంగ్లండ్ సమిష్టిగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించింది. ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించింది. ఈ టోర్నీలో ఆసీస్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ, సెమీస్‌లో మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా అలెక్స్ క్యారీ షాట్‌ను విమర్శించకతప్పదు. ఆసీస్ గాడిలో పడుతున్న సమయంలో క్యారీ ఆ షాట్ కొట్టి ఔట్ అవ్సాల్సింది కాదు. క్యారీ క్రీజ్‌లో ఉండి ఉంటే ఆసీస్ 260-270 పరుగుల మధ్యలో స్కోరు చేసి ఉండేది. అప్పుడు ఆసీస్ కనీసం పోరాడటానికి చాన్స్ దొరికేది’ అని బోర్డర్ అన్నాడు.
కాగా, ఇంగ్లండ్ సమిష్ట ప్రదర్శనపై బోర్డర్ ప్రశంసలు కురిపించాడు. అన్ని విభాగాల్లోనూ తాము ఏమిటో నిరూపించుకున్న ఇంగ్లండ్ విజయానికి అన్ని విధాల అర్హత ఉందన్నాడు. ఆసీస్‌పై ఇంగ్లండ్ సాధించిన విజయం అసాధారణమైనదిగా బోర్డర్ అభివర్ణించాడు. పెద్ద టోర్నీలో అది కూడా నాకౌట్‌లో ఇంగ్లండ్ నుంచి చాలా కాలం తర్వాత అతి పెద్ద ప్రదర్శన వచ్చిందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment