బంతిని తాకాడు.. పెవిలియన్ కు చేరాడు!
లండన్:క్రికెట్ లో నో బాల్ నిబంధన గురించి తెలియని వారుండరు. నో బాల్ లో రనౌట్ రూపంలో మాత్రమే ఆటగాడు పెవిలియన్ కు చేరే అవకాశం ఉంది. మిగతా ఏ రకంగా ఆడినా.. నో బాల్ కు అవుట్ అనేది ఉండదు. అయితే నో బాల్ లో బంతిని తాకినందుకు ఇంగ్లిష్ కౌంటీ క్రికెటర్ అవుటై పెవిలియన్ కు చేరిన ఘటన ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. క్రికెటర్ బ్రయాన్ డార్భషైర్(35) .. అమతియర్ తరుపున లీగ్ మ్యాచ్ ఆడుతూ ఓ బౌలర్ వేసిన నో బాల్ ను డిఫెన్స్ ఆడాడు. ఆ తరువాత బంతిని చేతితో పట్టుకుని ఫీల్డర్ కు విసిరాడు. దీంతో సదరు ఫీల్డర్ డార్భషైర్ అవుట్ కు అప్పీల్ చేశాడు. ఇంకేముంది ఫీల్డర్ అప్పీల్ తో అంపైర్ ఏకీభవించడంతో డార్భషైర్ పెవిలియన్ కు చేరడం చకచకా జరిగిపోయాయి. సాధారణంగా ఏ బ్యాట్స్ మెన్ అయినా బంతిని ఆడిన తరువాత చేతితో ఫీల్డర్ కు ఇచ్చినా దాని వల్ల పెద్దగా జరిగే నష్టం జరిగిన దాఖలాలు లేవు.
కాగా, ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాట్స్ మెన్ బంతిని తాకుకూడదనేది స్థానిక మెర్లీబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధన. దీంతోనే డార్భషైర్ అవుటయ్యాడని ఎంసీసీ సలహాదారు మార్క్ విలియమ్స్ స్పష్టం చేశారు.బంతిని తాకే ముందు ఫీల్డర్ అనుమతి తీసుకోవాల్సిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉండగా తాను అవుటైన విధానంతో ప్రత్యర్థి జట్టుపై డార్భషైర్ విమర్శలు గుప్పించాడు. ఆ జట్టుకు అసలు గేమ్ స్పిరిట్ లేదని మండిపడ్డాడు. అంతర్జాతీయంగా ఈ తరహాలో ఓ క్రికెటర్ పెవిలియన్ కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.