బెంగళూరు: ఐపీఎల్‌లో అదరగొట్టి, ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి ఘన పునరాగమనం చేయనున్న వేళ... తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడికి అనూహ్య అడ్డంకి. టీమిండియాలోకి ఎంపికకు ప్రామాణికమైన ‘యో యో’ ఫిట్‌నెస్ పరీక్షలో ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలమయ్యాడు. శుక్రవారం ఇక్కడి జాతీయ క్రికెట్ అకాడమీలో యో యోను ఎదుర్కొన్న రాయుడు... 14 పాయింట్లు మాత్రమే సాధించాడు. నిర్దేశిత (16.1) ప్రమాణం అందుకోలేక పోవడంతో అతడు ఇంగ్లండ్ పర్యటనకు జట్టులో చోటు కోల్పోనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. గతేడాది విఫలమైన సురేశ్ రైనా ఈసారి సులువుగానే గట్టెక్కాడు. ఈ నేపథ్యంలో రాయుడు స్థానం భర్తీపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఐపీఎల్ సందర్భంగా మెడ గాయానికి గురైన కెప్టెన్ విరాట్ కోహ్లి సహా, మహేంద్ర సింగ్ ధోని, భువనేశ్వర్, కేదార్ జాదవ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు తేలింది. వీరిలో జాదవ్ ఇంగ్లండ్ వెళ్లే జట్టులో లేడు. భారత్... ఈ నెల 27, 29 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టి20లు ఆడనుంది. ఫిట్‌గా ఉన్న నేపథ్యంలో కోహ్లి ఈ మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్‌లో 600 పరుగులు సాధించి, చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాయుడు మూడు వారాల వ్యవధిలోనే ఫిట్‌నెస్ కారణంగా జట్టులో చోటు కోల్పోనుండటం అందరినీ ఆశ్చర్యపర్చింది.
అ‘యో యో’... రాయుడు
Published Sat, Jun 16 2018 12:59 AM | Last Updated on Sat, Jun 16 2018 12:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment