Ambati Tirupati Rayudu
-
రాయుడిపై వివక్ష లేదు
ముంబై: విండీస్ టూర్‌కు జట్ల ప్రకటన సందర్భంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వద్ద... తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడి గురించి మీడియా ప్రస్తావించింది. దీనిపై ఎమ్మెస్కే వ్యంగ్యంగా స్పందించాడు. విజయ్ శంకర్‌ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకుంటూ అతడిని త్రీ డైమెన్షనల్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆటగాడిగా ప్రసాద్ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో రాయుడు... ‘ప్రపంచ కప్ చూసేందుకు ఇప్పుడే ‘3డి’ కళ్లజోడుకు ఆర్డరిచ్చా’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్ స్పందిస్తూ ‘ఆ ట్వీట్ చాలా బాగుంది. సమయోచితం, అద్భుతం కూడా. నేను బాగా ఎంజాయ్ చేశా. ఆ ఆలోచన తనకు ఎలా వచ్చిందో?’ అని అన్నాడు. కూర్పు వైవిధ్యం కారణంగానే రాయుడిని ఎంపిక చేయలేదని; అంతేకాని అతనిపై ఎలాంటి వివక్ష చూపలేదని ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో అతడు ఎంత ఉద్వేగానికి గురయ్యాడో సెలక్షన్ కమిటీ కూడా అంతే ఉద్వేగానికి లోనైందని అన్నాడు. ఇదే రాయుడు గతేడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికై, యో యో పరీక్ష విఫలమైనప్పుడు విమర్శలు రాగా తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించాడు. ప్రపంచ కప్‌లో ధావన్ గాయపడ్డాక జట్టు మేనేజ్మెంట్ ఎడంచేతి ఆటగాడు కావాలని కోరిందని, అందుకే పంత్‌ను పంపామని, ఇక ఓపెనర్ రాహుల్‌కు బ్యాకప్‌గా మయాంక్‌ను తీసుకున్నామని ఎమ్మెస్కే వివరించాడు. ఇందులో పూర్తి స్పష్టతతో వ్యవహరించామని తెలిపాడు. కోన భరత్‌కు తప్పని నిరీక్షణ సెలక్టర్లు టెస్టులకు పంత్, సాహాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్‌కు నిరీక్షణ తప్పలేదు. ఇటీవల అద్భుత ఫామ్ రీత్యా భరత్ ఎంపికపై వార్తలు వచ్చాయి. ‘ఎ’ జట్టు తరఫున ప్రదర్శనలనూ లెక్కలోకి తీసుకున్నామని చెప్పిన ఎమ్మెస్కే... టెస్టు జట్టులోకి ఎంపికకు భరత్ చాలా చాలా దగ్గరగా ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే, గాయంతో దూరమైన జట్టులోని ఒక రెగ్యులర్ ఆటగాడు ఫిట్నెస్ సాధిస్తే ఎంపికలో అతడికే ప్రాధాన్యం ఇవ్వాలన్న అప్రకటిత నియమంతో సాహాకు చాన్స్ దక్కింది. -
అయ్యో... రాయుడు!
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటే లక్ష్యంగా ఏడాది కాలం నుంచి హైదరాబాద్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. దీని కోసం ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు కూడా వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గత సెప్టెంబర్‌లో ఆసియా కప్ ద్వారా భారత వన్డే జట్టులో పునరాగమనం చేసినప్పటి నుంచి అవకాశం దొరికినపుడల్లా రాయుడు సత్తా చాటుకున్నాడు. ఎంతోకాలం నుంచి భారత్ టీమ్ మేనేజ్మెంట్ను వేధిస్తున్న ‘నాలుగో నంబర్’ స్థానానికి రాయుడు రూపంలో సరైనోడు దొరికాడని అందరూ భావించారు. గత నెలలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో రాయుడు భారీ స్కోర్లు చేయలేకపోయినా... కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తుండటంతో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు అతని బెర్త్ ఖాయమనుకున్నారు. కానీ తీరా ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయానికి కెప్టెన్ కోహ్లి, సెలెక్టర్లు తమ ఆలోచన మార్చుకున్నారు. రాయుడిని పక్కన పెట్టేశారు. తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌వైపు మొగ్గు చూపారు. 2013లో భారత వన్డే జట్టులో ఎంపికైన రాయుడు ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు ఆడి 47.05 సగటుతో మొత్తం 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది రాయుడు తడబడ్డాడు. 10 వన్డేలు ఆడినా ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు. మరోవైపు ఈ ఏడాదే అరంగేట్రం చేసిన విజయ్ శంకర్ తొమ్మిది మ్యాచ్‌ల్లో బరిలోకి దిగినా ఐదు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌పై 45, ఆస్ట్రేలియాపై వరుసగా 46, 32, 26, 16 పరుగులు సాధించాడు. ధాటిగా బ్యాటింగ్ చేయగల నేర్పుతోపాటు బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ అంశాలను పరిగణనలోకి తీసుకొని రాయుడు బదులుగా విజయ్ శంకర్‌ను ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. మరో చాన్స్ లేనట్టే... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో రాయుడు ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 33 ఏళ్ల రాయుడు ఈసారి మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతున్నప్పటికీ... జట్టులో ఎంపిక కాలేకపోయాడు. తదుపరి ప్రపంచకప్‌కు మరో నాలుగేళ్ల సమయం ఉండటం.... పలువురు యువ ఆటగాళ్లు తెరపైకి వస్తుండటంతో రాయుడుకు ప్రపంచకప్ మ్యాచ్ ఆడే అవకాశానికి తెరపడినట్టేనని భావించాలి. -
రాయుడు బౌలింగ్ సందేహాస్పదం!
దుబాయ్: భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు బౌలింగ్ శైలిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సందేహం వ్యక్తం చేసింది. శనివారం సిడ్నీలో జరిగిన తొలి వన్డే అనంతరం మ్యాచ్ అధికారులు తమ నివేదికలో రాయుడు ఆఫ్‌స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను తప్పు పట్టారు. ఈ నివేదికను ఐసీసీ భారత టీమ్ మేనేజ్మెంట్కు అందజేసింది. అతను 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే తుది ఫలితం వచ్చే వరకు మాత్రం రాయుడు తన బౌలింగ్‌ను కొనసాగించవచ్చు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ రాయుడు తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. సిడ్నీ వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులిచ్చాడు. -
అ‘యో యో’... రాయుడు
బెంగళూరు: ఐపీఎల్లో అదరగొట్టి, ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి ఘన పునరాగమనం చేయనున్న వేళ... తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడికి అనూహ్య అడ్డంకి. టీమిండియాలోకి ఎంపికకు ప్రామాణికమైన ‘యో యో’ ఫిట్నెస్ పరీక్షలో ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలమయ్యాడు. శుక్రవారం ఇక్కడి జాతీయ క్రికెట్ అకాడమీలో యో యోను ఎదుర్కొన్న రాయుడు... 14 పాయింట్లు మాత్రమే సాధించాడు. నిర్దేశిత (16.1) ప్రమాణం అందుకోలేక పోవడంతో అతడు ఇంగ్లండ్ పర్యటనకు జట్టులో చోటు కోల్పోనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. గతేడాది విఫలమైన సురేశ్ రైనా ఈసారి సులువుగానే గట్టెక్కాడు. ఈ నేపథ్యంలో రాయుడు స్థానం భర్తీపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఐపీఎల్ సందర్భంగా మెడ గాయానికి గురైన కెప్టెన్ విరాట్ కోహ్లి సహా, మహేంద్ర సింగ్ ధోని, భువనేశ్వర్, కేదార్ జాదవ్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు తేలింది. వీరిలో జాదవ్ ఇంగ్లండ్ వెళ్లే జట్టులో లేడు. భారత్... ఈ నెల 27, 29 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టి20లు ఆడనుంది. ఫిట్‌గా ఉన్న నేపథ్యంలో కోహ్లి ఈ మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్లో 600 పరుగులు సాధించి, చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాయుడు మూడు వారాల వ్యవధిలోనే ఫిట్నెస్ కారణంగా జట్టులో చోటు కోల్పోనుండటం అందరినీ ఆశ్చర్యపర్చింది. -
ఫైనల్లో భారత్ ‘ఎ’
♦ రాణించిన కేదార్ జాదవ్ ♦ దేవధర్ ట్రోఫీ కాన్పూర్ కేదార్ జాదవ్ (61 బంతుల్లో 91 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి తిరుపతి రాయుడు (89 బంతుల్లో 75; 9 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా రాణించడంతో భారత్ ‘ఎ’ జట్టు... దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’.. 6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 49.2 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్ పటేల్ (125 బంతుల్లో 119; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగినా... మిగతా వారు నిరాశపర్చారు. అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘ఎ’ 47.2 ఓవర్లలో 4 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఓపెనర్ ఫజల్ (53) అర్ధసెంచరీతో శుభారంభం ఇచ్చాడు. మెహుల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. గురువారం జరిగే ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు... భారత్ ‘బి’తో తలపడుతుంది. -
రాయుడు సత్తాకు పరీక్ష
- నేటి నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’తో భారత్ ‘ఎ’ తొలి అనధికారిక టెస్టు వాయనాడ్ (కేరళ): భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న అంబటి తిరుపతి రాయుడు ఇప్పుడు టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యేందుకు ఒక సదవకాశం లభించింది. భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి తొలి మ్యాచ్ ఇక్కడ జరగనుంది. భారత జట్టుకు రాయుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆటగాడిగానే కాకుండా నాయకత్వ ప్రతిభను కూడా నిరూపించుకోవాలని రాయుడు పట్టుదలగా ఉన్నాడు. వాయనాడ్ జిల్లాలోని కృష్ణగిరిలో కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) సొంతంగా నిర్మించుకున్న స్టేడియంలో జరుగుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటైన క్రికెట్ స్టేడియంగా దీనికి గుర్తింపు ఉంది. ఇటీవల ముక్కోణపు వన్డే సిరీస్ గెలుచుకున్న వన్డే జట్టులోని పలువురు భారత ఆటగాళ్లు ఈ టెస్టు టీమ్‌లోనూ ఉన్నారు. జట్ల వివరాలు భారత్: అంబటి రాయుడు (కెప్టెన్), కరుణ్ నాయర్, ముకుంద్, బైన్స్, శ్రేయస్ అయ్యర్, బాబా అపరాజిత్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, మిథున్, శార్దుల్, ఈశ్వర్ పాండే, జాక్సన్, జీవన్‌జోత్ సింగ్. దక్షిణాఫ్రికా: విలాస్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, బవుమా, క్లోట్, డి బ్రూన్, డి లాంజ్, రీజా హెం డ్రిక్స్, కేశవ్ మహరాజ్, ప్యాటర్సన్, పీడ్, రమేలా, సోట్సోబ్, వాన్ జిల్, విల్జోన్, వీస్, డి కాక్. -
‘ఎ’ జట్ల కెప్టెన్లుగా రాయుడు, ఉన్ముక్త్
చెన్నై: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు సారథ్యం వహించనున్నాడు. ఈనెల 18 నుంచి చెన్నైలో ఈ సిరీస్ జరుగుతుంది. అలాగే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఎ జట్లు పాల్గొంటున్న ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్ ఉన్ముక్త్ చంద్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈనెల 5 నుంచి ఈ సిరీస్ జరుగుతుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. ముక్కోణపు సిరీస్‌కు భారత్ ‘ఎ’ జట్టు: ఉన్ముక్త్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్, కేదార్ జాదవ్, సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, పర్వేజ్ రసూల్, కరణ్ శర్మ, ధావల్ కులకర్ణి, సందీప్ శర్మ, రుష కలారియా, మన్దీప్ సింగ్, గురుకీరత్ సింగ్, రిషి ధావన్.టెస్టు సిరీస్‌కు ‘ఎ’ జట్టు: రాయుడు (కెప్టెన్), కరుణ్ నాయర్, ముకుంద్, అంకుష్, శ్రేయస్ అయ్యర్, అపరాజిత్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, అభిమన్యు మిథున్, శార్దూల్ ఠాకూర్, ఈశ్వ ర్ పాండే, షెల్డన్ జాక్సన్, జీవన్‌జ్యోత్ సింగ్. -
ఇక బేఫికర్..!
►మూడో వన్డేలో భారత్ ఘన విజయం ►రాణించిన రాయుడు, రహానే ►మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అశ్విన్ ►సిరీస్‌లో 2-0 ఆధిక్యం ఇక భయం లేదు... సిరీస్ మాత్రం కచ్చితంగా ఓడిపోవట్లేదు. ఇక భయం లేదు... జట్టులో ప్రతి ఒక్క ఆటగాడూ సత్తా చూపాడు. ఇక భయం లేదు... ఇన్నాళ్లూ బెంచ్ మీద ఉన్న ఆటగాడు కూడా వచ్చి చెలరేగాడు. ఇక భయం లేదు... ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్‌లో బౌన్సీ వికెట్‌పై గెలిచారు. అవును... సగటు భారత అభిమాని ఏం కోరుకుంటాడో ధోనిసేన ఇంగ్లండ్‌తో వన్డేల్లో అదే చేసి చూపించింది. టెస్టుల్లో ఘోర పరాజయాన్ని మరిపిస్తూ... వరుసగా రెండు వన్డేల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణమైనందున... ఇక మిగిలిన రెండు వన్డేల్లో ఒకవేళ ఓడిపోయినా... వన్డే సిరీస్ మాత్రం చేజారదు. నాటింగ్‌హామ్: ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎంత చెలరేగినా తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిన పరిస్థితుల్లో తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. రోహిత్ శర్మ గాయపడటంతో జట్టులోకి వచ్చిన రాయుడు... అటు పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఇటూ బ్యాట్స్‌మన్‌గా తన సత్తాను నిరూపించుకున్నాడు. బౌన్సీ వికెట్‌పై అద్భుతమైన అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకుని ప్రపంచకప్ జట్టులో దాదాపుగా బెర్త్ ఖరారు చేసుకున్నాడు. రాయుడు (78 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు)తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా సమష్టిగా రాణించడంతో మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. కుక్ (65 బంతుల్లో 44; 4 ఫోర్లు), హేల్స్ (55 బంతుల్లో 42; 5 ఫోర్లు), బట్లర్ (58 బంతుల్లో 42; 3 ఫోర్లు) రాణించారు. కుక్, హేల్స్ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించినా మధ్యలో స్పిన్నర్లు మ్యాచ్‌ను కట్టడి చేశారు. ఓ దశలో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను వోక్స్ (15), బట్లర్ ఏడో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో ట్రెడ్‌వెల్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేశాడు. ఆఖరి ఓవర్లో 18 పరుగులు రావడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అశ్విన్ 3, భువనేశ్వర్, షమీ, జడేజా,రాయుడు, రైనా తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 43 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలిచింది. రాయుడుతో పాటు రహానే (56 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), రైనా (42 బంతుల్లో 42; 5 ఫోర్లు), కోహ్లి (50 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఓపెనర్ ధావన్ (16) విఫలమైనా రహానే, కోహ్లిలు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. తర్వాత రాయుడు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 35 పరుగులు; రైనాతో కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగులు; జడేజా (12 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 21 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వోక్స్, ట్రెడ్‌వెల్, ఫిన్, స్టోక్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే మంగళవారం బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (స్టంప్డ్) ధోని (బి) రాయుడు 44; హేల్స్ (సి) ధోని (బి) రైనా 42; బెల్ రనౌట్ 28; రూట్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 2; మోర్గాన్ (సి) ధోని (బి) అశ్విన్ 10; బట్లర్ (బి) అశ్విన్ 42; స్టోక్స్ (సి) రైనా (బి) అశ్విన్ 2; వోక్స్ (సి) మోహిత్ (బి) షమీ 15; ట్రెడ్‌వెల్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 30; ఫిన్ రనౌట్ 6; అండర్సన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్) 227. వికెట్ల పతనం: 1-82; 2-93; 3-97; 4-120; 5-138; 6-149; 7-182; 8-202; 9-226; 10-227 బౌలింగ్: భువనేశ్వర్ 8-0-45-1; మోహిత్ శర్మ 3-0-17-0; షమీ 9-0-40-1; అశ్విన్ 10-0-39-3; రైనా 8-0-37-1; రాయుడు 2-0-8-1; జడేజా 10-0-38-1 భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) బట్లర్ (బి) ఫిన్ 45; ధావన్ (సి) మోర్గాన్ (బి) వోక్స్ 16; కోహ్లి (సి) ట్రెడ్‌వెల్ (బి) స్టోక్స్ 40; రాయుడు నాటౌట్ 64; రైనా (సి) వోక్స్ (బి) ట్రెడ్‌వెల్ 42; జడేజా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (43 ఓవర్లలో 4 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1-35; 2-85; 3-120; 4-207 బౌలింగ్: అండర్సన్ 7-0-29-0; వోక్స్ 8-1-43-1; ట్రెడ్‌వెల్ 10-1-46-1; ఫిన్ 8-0-50-1; స్టోక్స్ 6-0-31-1; రూట్ 4-0-27-0. కోహ్లి X స్టోక్స్ టెస్టు సిరీస్‌లో అండర్సన్, జడేజా గొడవ పూర్తిగా మరవకముందే ఇంగ్లండ్ పేసర్ స్టోక్స్ మరో వివాదానికి తెరలేపాడు. భారత్ ఇన్నింగ్స్ 26వ ఓవర్లో తన బౌలింగ్‌లో అవుటై వెళ్తున్న కోహ్లిని ఉద్దేశించి స్టోక్స్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. దీంతో పెవిలియన్‌కు వెళ్తున్న కోహ్లి తన బ్యాట్‌ను చూపుతూ సీరియస్‌గా ప్రతిస్పందించాడు. అయితే వెనక్కి తిరిగి రాకుండా పేసర్ వ్యాఖ్యలపై మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న అంపైర్లు జోక్యం చేసుకొని కెప్టెన్ కుక్‌ను, స్టోక్స్‌ను పిలిచి వివరణ అడిగారు. మరోవైపు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు భారత అభిమానులు అతన్ని వెక్కిరిస్తూ గేలి చేశారు. -
విశ్వాసం పెరిగేలా...
వరుస ఓటములతో ఇంటా బయటా విమర్శల జడివానలో తడిసి ముద్దవుతున్న ధోని సేనకు కాస్త ఊరట.. విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూస్తున్న భారత ఆటగాళ్లకు కొంత ఉపశమనం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం సన్నాహకంగా జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చూపింది. కీలకమైన పోరుకు ముందు ఈ మాత్రం ప్రదర్శనతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఫామ్ విషయంలో ఇబ్బందులెదుర్కొంటున్న విరాట్ కోహ్లితో పాటు తెలుగు తేజం అంబటి రాయుడు అదరగొట్టడం జట్టుకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ప్రాక్టీస్ వన్డేలో భారత్ ఘనవిజయం ►అదరగొట్టిన రాయుడు ►ఫామ్‌లోకొచ్చిన కోహ్లి ►బౌలర్ల సమష్టి రాణింపు లండన్: భారత జట్టు తరఫున తొలిసారి ఇంగ్లండ్‌లో ఆడుతున్న అంబటి తిరుపతి రాయుడు (82 బంతుల్లో 72 రిటైర్డ్ అవుట్; 8 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్ కోసం వచ్చీ రాగానే సన్నాహక మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించి భరోసానిచ్చాడు. అలాగే సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో మన బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా లార్డ్స్ మైదానంలో శుక్రవారం మిడిలెసెక్స్‌తో జరిగిన వన్డేలో భారత్ 95 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. పూర్తి స్థాయి ఆటగాళ్లతోనే బరిలోకి దిగినా నిర్ణీత ఓవర్లు ఆడలేకపోయింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (75 బంతుల్లో 71; 8 ఫోర్లు; 1 సిక్స్) తన పరుగుల దాహాన్ని తీర్చుకోగా మిగిలిన బ్యాట్స్‌మెన్ మాత్రం నిరాశపరిచారు. 52 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ కోహ్లికి రాయుడు అండగా నిలిచాడు. ఈ జోడి బౌండరీలతో విరుచుకుపడి స్కోరును పట్టాలెక్కించింది. 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే కుదురుగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను రవి పటేల్ దెబ్బతీశాడు. సింప్సన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. కొద్దిసేపటికే జడేజా (7) వెనుదిరిగాడు. 60 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రాయుడు 40వ ఓవర్లో రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఆఫ్ స్పిన్నర్ రేనర్ (4/32) ధాటికి 19 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిడిలెసెక్స్ను భారత బౌలర్లు కలిసికట్టుగా నిలువరించారు. వీరి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా జట్టు 39.5 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటయ్యింది. హిగ్గిన్స్ (24 బంతుల్లో 20; 3 ఫోర్లు), హారిస్ (22 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను కరణ్ శర్మ (3/14) వణికించాడు. భువనేశ్వర్, షమీ, మోహిత్, ఉమేశ్, కులకర్ణి, అశ్విన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. స్కోరు బోర్డు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) సంధూ (బి) ఫిన్ 8; ధావన్ (సి) మలన్ (బి) సంధూ 10; కోహ్లి (సి) సింప్సన్ (బి) పటేల్ 71; రహానే (సి) ఫిన్ (బి) హారిస్ 14; రాయుడు (రిటైర్డ్ అవుట్) 72; జడేజా (సి) గుబ్బిన్స్ (బి) పటేల్ 7; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) రేనర్ 18; శామ్సన్ (సి అండ్ బి) రేనర్ 6; బిన్నీ (సి అండ్ బి) రేనర్ 0; కరణ్ శర్మ నాటౌట్ 8; రైనా (స్టంప్డ్) సింప్సన్ (బి) రేనర్ 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (44.2 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1-19; 2-29; 3-52; 4-156; 5-174; 6-211; 7-211; 8-211; 9-224; 10-230. బౌలింగ్: ఫిన్ 6-0-20-1; సంధూ 9-1-65-1; హారిస్ 7-1-29-1; పొడ్మోర్ 4-0-26-0; పటేల్ 9-0-56-2; రేనర్ 9.2-1-32-4. మిడిలెసెక్స్ ఇన్నింగ్స్: మలన్ (బి) షమీ 5; గుబ్బిన్స్ (సి) శామ్సన్ (బి) భువనేశ్వర్ 2; స్టిర్లింగ్ (సి) శామ్సన్ (బి) ఉమేశ్ 17; మోర్గాన్ (సి) శామ్సన్ (బి) మోహిత్ 16; హిగ్గిన్స్ (సి) ధావన్ (బి) కులకర్ణి 20; సింప్సన్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 19; బల్బిర్నీ (బి) కరణ్ 19; రేనర్ (రనౌట్) 5; హారిస్ (స్టంప్డ్) శామ్సన్ (బి) కరణ్ 20; పొడ్మోర్ నాటౌట్ 4; సంధూ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (39.5 ఓవర్లలో ఆలౌట్) 135. వికెట్ల పతనం: 1-7; 2-11; 3-34; 4-64; 5-67; 6-101; 7-108; 8-114; 9-135; 10-135. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-7-1; షమీ 4-1-13-1; మోహిత్ 5-2-20-1; ఉమేశ్ 7-0-32-1; కులకర్ణి 4-0-13-1; అశ్విన్ 6-2-16-1; జడేజా 6-0-14-0; కరణ్ 4.5-1-14-3.