రాయుడు సత్తాకు పరీక్ష
- నేటి నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’తో భారత్ ‘ఎ’ తొలి అనధికారిక టెస్టు
వాయనాడ్ (కేరళ): భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న అంబటి తిరుపతి రాయుడు ఇప్పుడు టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యేందుకు ఒక సదవకాశం లభించింది. భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి తొలి మ్యాచ్ ఇక్కడ జరగనుంది.
భారత జట్టుకు రాయుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆటగాడిగానే కాకుండా నాయకత్వ ప్రతిభను కూడా నిరూపించుకోవాలని రాయుడు పట్టుదలగా ఉన్నాడు. వాయనాడ్ జిల్లాలోని కృష్ణగిరిలో కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) సొంతంగా నిర్మించుకున్న స్టేడియంలో జరుగుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటైన క్రికెట్ స్టేడియంగా దీనికి గుర్తింపు ఉంది. ఇటీవల ముక్కోణపు వన్డే సిరీస్ గెలుచుకున్న వన్డే జట్టులోని పలువురు భారత ఆటగాళ్లు ఈ టెస్టు టీమ్‌లోనూ ఉన్నారు.
జట్ల వివరాలు
భారత్: అంబటి రాయుడు (కెప్టెన్), కరుణ్ నాయర్, ముకుంద్, బైన్స్, శ్రేయస్ అయ్యర్, బాబా అపరాజిత్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, మిథున్, శార్దుల్, ఈశ్వర్ పాండే, జాక్సన్, జీవన్‌జోత్ సింగ్.
దక్షిణాఫ్రికా: విలాస్ (కెప్టెన్), బ్యూరాన్ హెండ్రిక్స్, బవుమా, క్లోట్, డి బ్రూన్, డి లాంజ్, రీజా హెం డ్రిక్స్, కేశవ్ మహరాజ్, ప్యాటర్సన్, పీడ్, రమేలా, సోట్సోబ్, వాన్ జిల్, విల్‌జోన్, వీస్, డి కాక్.