
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)- 2025 ముగిసిన వెంటనే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రూపంలో మరో క్రికెట్ పండుగ సందడి మొదలైంది. మార్చి 22న మొదలైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. మే 25న ఫైనల్‌తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రెండు నెలలకు పైగా విరామం లభించింది.
ఇక ఐపీఎల్-2025 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనం కానుంది. జూన్ ఆఖరి వారం నుంచి ఇంగ్లిష్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మే చివరి వారంలో జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ఈ కీలక టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్‌గా కొనసాగించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం మూకుమ్మడిగా హిట్‌మ్యాన్‌కు ఓటువేసినట్లు తెలుస్తోంది.
రోహిత్ భవిష్యత్తుపై నిర్ణయం.. జట్టు ప్రకటన అప్పుడే!
ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో సిరీస్‌లో, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనప్పటికీ.. ఇంగ్లండ్‌తో టెస్టులకూ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించే అవకావాలు ఉన్నాయి.
జట్టు ప్రకటనకు చాలా సమయం ఉంది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల నాటికి సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏ క్షణమైన ప్రకటన రావొచ్చు’’ అని పీటీఐతో పేర్కొన్నాయి.
ఘోర పరాభవాలు
కాగా టెస్టు క్రికెట్‌లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టులో అతడి నాయకత్వంలో భారత జట్టు.. 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా.. విదేశీ జట్టు చేతిలో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురికావడం ఇదే తొలిసారి.
ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ సేనకు భంగపాటే ఎదురైంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ టీమిండియా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో పరాజయం పాలై.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్‌కు ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)- 2023-25 ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది.
ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్‌గా వచ్చి అక్కడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి.
తిరిగి ఫామ్‌లోకి
అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ శర్మ ప్రదర్శన తర్వాత సీన్ మారిపోయింది. ఈ వన్డే టోర్నమెంట్లో బ్యాటర్‌గా, సారథిగా రాణించి భారత్‌కు టైటిల్ అందించాడు హిట్‌మ్యాన్. తద్వారా తన ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేర్చుకోవడంతో పాటు.. భారత్‌కు పుష్కరకాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు టెస్టుల్లోనూ మరొక్క అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొనసాగుతున్న హిట్‌మ్యాన్.. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి బరిలోకి దిగాడు.
చదవండి: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్
Comments
Please login to add a commentAdd a comment