అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్‌, ద్రవిడ్‌లను ఒప్పించి.. | Agarkar Pushed Rohit Dravid To Hand Debuts To Jurel Padikkal: Report | Sakshi
Sakshi News home page

Ind vs Eng: పుజారాను వద్దని.. వాళ్ల కోసం రోహిత్‌, ద్రవిడ్‌లను ఒప్పించి మరీ..

Published Thu, Mar 14 2024 4:13 PM | Last Updated on Thu, Mar 14 2024 5:06 PM

Agarkar Pushed Rohit Dravid To Hand Debuts To Jurel Padikkal: Report - Sakshi

రాహుల్‌ ద్రవిడ్‌- రోహిత్‌ శర్మ (PC: BCCI)

విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ గెలిచాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్‌కు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్‌గా కేఎస్‌ భరత్‌ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం.

రెండో టెస్టుతో రజత్‌ పాటిదార్‌, మూడో టెస్టుతో సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌, నాలుగో టెస్టుతో ఆకాశ్‌ దీప్‌, ఐదో టెస్టుతో దేవ్‌దత్‌ పడిక్కల్‌ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. వీరిలో రజత్‌ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు.

అయితే, ధ్రువ్‌ జురెల్‌, పడిక్కల్‌ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం 15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన జురెల్‌ను కేఎస్‌ భరత్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్‌ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్‌ను ఆడించడంలో అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ వెల్లడించింది.
 
‘‘జట్టు యాజమాన్యం జురెల్‌పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్‌ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్‌ బాల్‌ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్‌ వంటి జట్టుతో కీలక సిరీస్‌లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం.

అయితే, అగార్కర్‌ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్‌ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్‌ మాత్రం పడిక్కల్‌ వైపే మొగ్గు చూపాడు.

రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్‌ వంటి మంచి హైట్‌ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్‌ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్‌ జురెల్‌ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్‌ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు.

చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌.. స్పందించిన రోహిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement