ఇక బేఫికర్..! | India vs England 3rd ODI: India leave hosts in a spin to lead series 2-0 | Sakshi
Sakshi News home page

ఇక బేఫికర్..!

Published Sun, Aug 31 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

ఇక బేఫికర్..!

ఇక బేఫికర్..!

మూడో వన్డేలో భారత్ ఘన విజయం
రాణించిన రాయుడు, రహానే
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అశ్విన్
సిరీస్‌లో 2-0 ఆధిక్యం
ఇక భయం లేదు... సిరీస్ మాత్రం కచ్చితంగా ఓడిపోవట్లేదు.
ఇక భయం లేదు... జట్టులో ప్రతి ఒక్క ఆటగాడూ సత్తా చూపాడు.
ఇక భయం లేదు... ఇన్నాళ్లూ బెంచ్ మీద ఉన్న ఆటగాడు కూడా వచ్చి చెలరేగాడు.
ఇక భయం లేదు... ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్‌లో బౌన్సీ వికెట్‌పై గెలిచారు.

అవును... సగటు భారత అభిమాని ఏం కోరుకుంటాడో ధోనిసేన ఇంగ్లండ్‌తో వన్డేల్లో అదే చేసి చూపించింది. టెస్టుల్లో ఘోర పరాజయాన్ని మరిపిస్తూ... వరుసగా రెండు వన్డేల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణమైనందున... ఇక మిగిలిన రెండు వన్డేల్లో ఒకవేళ ఓడిపోయినా... వన్డే సిరీస్ మాత్రం చేజారదు.

నాటింగ్‌హామ్: ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎంత చెలరేగినా తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిన పరిస్థితుల్లో తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. రోహిత్ శర్మ గాయపడటంతో జట్టులోకి వచ్చిన రాయుడు... అటు పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఇటూ బ్యాట్స్‌మన్‌గా తన సత్తాను నిరూపించుకున్నాడు. బౌన్సీ వికెట్‌పై అద్భుతమైన అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకుని ప్రపంచకప్ జట్టులో దాదాపుగా బెర్త్ ఖరారు చేసుకున్నాడు.

రాయుడు (78 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు)తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా సమష్టిగా రాణించడంతో మూడో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. కుక్ (65 బంతుల్లో 44; 4 ఫోర్లు), హేల్స్ (55 బంతుల్లో 42; 5 ఫోర్లు), బట్లర్ (58 బంతుల్లో 42; 3 ఫోర్లు) రాణించారు.

కుక్, హేల్స్ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించినా మధ్యలో స్పిన్నర్లు మ్యాచ్‌ను కట్టడి చేశారు. ఓ దశలో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను వోక్స్ (15), బట్లర్ ఏడో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో ట్రెడ్‌వెల్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేశాడు. ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు రావడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అశ్విన్ 3, భువనేశ్వర్, షమీ, జడేజా,రాయుడు, రైనా తలా ఓ వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 43 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలిచింది. రాయుడుతో పాటు రహానే (56 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), రైనా (42 బంతుల్లో 42; 5 ఫోర్లు), కోహ్లి (50 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఓపెనర్ ధావన్ (16) విఫలమైనా రహానే, కోహ్లిలు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.

తర్వాత రాయుడు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 35 పరుగులు; రైనాతో కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగులు; జడేజా (12 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 21 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వోక్స్, ట్రెడ్‌వెల్, ఫిన్, స్టోక్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే మంగళవారం బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది.
 
స్కోరు వివరాలు

ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (స్టంప్డ్) ధోని (బి) రాయుడు 44; హేల్స్ (సి) ధోని (బి) రైనా 42; బెల్ రనౌట్ 28; రూట్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 2; మోర్గాన్ (సి) ధోని (బి) అశ్విన్ 10; బట్లర్ (బి) అశ్విన్ 42; స్టోక్స్ (సి) రైనా (బి) అశ్విన్ 2; వోక్స్ (సి) మోహిత్ (బి) షమీ 15; ట్రెడ్‌వెల్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 30; ఫిన్ రనౌట్ 6; అండర్సన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్) 227.
వికెట్ల పతనం: 1-82; 2-93; 3-97; 4-120; 5-138; 6-149; 7-182; 8-202; 9-226; 10-227
బౌలింగ్: భువనేశ్వర్ 8-0-45-1; మోహిత్ శర్మ 3-0-17-0; షమీ 9-0-40-1; అశ్విన్ 10-0-39-3; రైనా 8-0-37-1; రాయుడు 2-0-8-1; జడేజా 10-0-38-1
 
భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) బట్లర్ (బి) ఫిన్ 45; ధావన్ (సి) మోర్గాన్ (బి) వోక్స్ 16; కోహ్లి (సి) ట్రెడ్‌వెల్ (బి) స్టోక్స్ 40; రాయుడు నాటౌట్ 64; రైనా (సి) వోక్స్ (బి) ట్రెడ్‌వెల్ 42; జడేజా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (43 ఓవర్లలో 4 వికెట్లకు) 228.
వికెట్ల పతనం: 1-35; 2-85; 3-120; 4-207
బౌలింగ్: అండర్సన్ 7-0-29-0; వోక్స్ 8-1-43-1; ట్రెడ్‌వెల్ 10-1-46-1; ఫిన్ 8-0-50-1; స్టోక్స్ 6-0-31-1; రూట్ 4-0-27-0.
 
కోహ్లి X స్టోక్స్
టెస్టు సిరీస్‌లో అండర్సన్, జడేజా గొడవ పూర్తిగా మరవకముందే ఇంగ్లండ్ పేసర్ స్టోక్స్ మరో వివాదానికి తెరలేపాడు. భారత్ ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో తన బౌలింగ్‌లో అవుటై వెళ్తున్న కోహ్లిని ఉద్దేశించి స్టోక్స్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. దీంతో పెవిలియన్‌కు వెళ్తున్న కోహ్లి తన బ్యాట్‌ను చూపుతూ సీరియస్‌గా ప్రతిస్పందించాడు. అయితే వెనక్కి తిరిగి రాకుండా పేసర్ వ్యాఖ్యలపై మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న అంపైర్లు జోక్యం చేసుకొని కెప్టెన్ కుక్‌ను, స్టోక్స్‌ను పిలిచి వివరణ అడిగారు.  మరోవైపు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు భారత అభిమానులు అతన్ని వెక్కిరిస్తూ గేలి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement