
సాక్షి క్రీడావిభాగం: ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటే లక్ష్యంగా ఏడాది కాలం నుంచి హైదరాబాద్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. దీని కోసం ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు కూడా వీడ్కోలు పలికి కేవలం వన్డే ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గత సెప్టెంబర్‌లో ఆసియా కప్ ద్వారా భారత వన్డే జట్టులో పునరాగమనం చేసినప్పటి నుంచి అవకాశం దొరికినపుడల్లా రాయుడు సత్తా చాటుకున్నాడు. ఎంతోకాలం నుంచి భారత్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను వేధిస్తున్న ‘నాలుగో నంబర్’ స్థానానికి రాయుడు రూపంలో సరైనోడు దొరికాడని అందరూ భావించారు. గత నెలలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో రాయుడు భారీ స్కోర్లు చేయలేకపోయినా... కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తుండటంతో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు అతని బెర్త్ ఖాయమనుకున్నారు. కానీ తీరా ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయానికి కెప్టెన్ కోహ్లి, సెలెక్టర్లు తమ ఆలోచన మార్చుకున్నారు. రాయుడిని పక్కన పెట్టేశారు. తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌వైపు మొగ్గు చూపారు.
2013లో భారత వన్డే జట్టులో ఎంపికైన రాయుడు ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు ఆడి 47.05 సగటుతో మొత్తం 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది రాయుడు తడబడ్డాడు. 10 వన్డేలు ఆడినా ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు. మరోవైపు ఈ ఏడాదే అరంగేట్రం చేసిన విజయ్ శంకర్ తొమ్మిది మ్యాచ్‌ల్లో బరిలోకి దిగినా ఐదు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌పై 45, ఆస్ట్రేలియాపై వరుసగా 46, 32, 26, 16 పరుగులు సాధించాడు. ధాటిగా బ్యాటింగ్ చేయగల నేర్పుతోపాటు బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ అంశాలను పరిగణనలోకి తీసుకొని రాయుడు బదులుగా విజయ్ శంకర్‌ను ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.
మరో చాన్స్ లేనట్టే...
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 2015 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో రాయుడు ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 33 ఏళ్ల రాయుడు ఈసారి మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతున్నప్పటికీ... జట్టులో ఎంపిక కాలేకపోయాడు. తదుపరి ప్రపంచకప్‌కు మరో నాలుగేళ్ల సమయం ఉండటం.... పలువురు యువ ఆటగాళ్లు తెరపైకి వస్తుండటంతో రాయుడుకు ప్రపంచకప్ మ్యాచ్ ఆడే అవకాశానికి తెరపడినట్టేనని భావించాలి.