రాయుడిపై వివక్ష లేదు | MSK Prasad clears air on Ambati Rayudu's World Cup exclusion | Sakshi
Sakshi News home page

రాయుడిపై వివక్ష లేదు

Published Mon, Jul 22 2019 6:14 AM | Last Updated on Mon, Jul 22 2019 6:14 AM

MSK Prasad clears air on Ambati Rayudu's World Cup exclusion - Sakshi

ముంబై: విండీస్‌ టూర్‌కు జట్ల ప్రకటన సందర్భంలో చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వద్ద... తెలుగు క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడి గురించి మీడియా ప్రస్తావించింది. దీనిపై ఎమ్మెస్కే వ్యంగ్యంగా స్పందించాడు. విజయ్‌ శంకర్‌ను ప్రపంచ కప్‌ జట్టులోకి తీసుకుంటూ అతడిని త్రీ డైమెన్షనల్‌ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌) ఆటగాడిగా ప్రసాద్‌ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో రాయుడు... ‘ప్రపంచ కప్‌ చూసేందుకు ఇప్పుడే ‘3డి’ కళ్లజోడుకు ఆర్డరిచ్చా’ అంటూ వెటకారంగా ట్వీట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ స్పందిస్తూ ‘ఆ ట్వీట్‌ చాలా బాగుంది.

సమయోచితం, అద్భుతం కూడా. నేను బాగా ఎంజాయ్‌ చేశా. ఆ ఆలోచన తనకు ఎలా వచ్చిందో?’ అని అన్నాడు. కూర్పు వైవిధ్యం కారణంగానే రాయుడిని ఎంపిక చేయలేదని; అంతేకాని అతనిపై ఎలాంటి వివక్ష చూపలేదని ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో అతడు ఎంత ఉద్వేగానికి గురయ్యాడో సెలక్షన్‌ కమిటీ కూడా అంతే ఉద్వేగానికి లోనైందని అన్నాడు. ఇదే రాయుడు గతేడాది ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికై, యో యో పరీక్ష విఫలమైనప్పుడు విమర్శలు రాగా తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించాడు. ప్రపంచ కప్‌లో ధావన్‌ గాయపడ్డాక జట్టు మేనేజ్‌మెంట్‌ ఎడంచేతి ఆటగాడు కావాలని కోరిందని, అందుకే పంత్‌ను పంపామని, ఇక ఓపెనర్‌ రాహుల్‌కు బ్యాకప్‌గా మయాంక్‌ను తీసుకున్నామని ఎమ్మెస్కే వివరించాడు. ఇందులో పూర్తి స్పష్టతతో వ్యవహరించామని తెలిపాడు.

కోన భరత్‌కు తప్పని నిరీక్షణ
సెలక్టర్లు టెస్టులకు పంత్, సాహాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆంధ్రా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కోన శ్రీకర్‌ భరత్‌కు నిరీక్షణ తప్పలేదు. ఇటీవల అద్భుత ఫామ్‌ రీత్యా భరత్‌ ఎంపికపై వార్తలు వచ్చాయి. ‘ఎ’ జట్టు తరఫున ప్రదర్శనలనూ లెక్కలోకి తీసుకున్నామని చెప్పిన ఎమ్మెస్కే... టెస్టు జట్టులోకి ఎంపికకు భరత్‌ చాలా చాలా దగ్గరగా ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే, గాయంతో దూరమైన జట్టులోని ఒక రెగ్యులర్‌ ఆటగాడు ఫిట్‌నెస్‌ సాధిస్తే ఎంపికలో అతడికే ప్రాధాన్యం ఇవ్వాలన్న అప్రకటిత నియమంతో సాహాకు చాన్స్‌ దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement