రాయుడు 'గెలిచాడు' | Ambati Rayudu scores maiden ODI ton | Sakshi
Sakshi News home page

రాయుడు 'గెలిచాడు'

Published Fri, Nov 7 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

రాయుడు 'గెలిచాడు'

రాయుడు 'గెలిచాడు'

 ప్రపంచకప్ బెర్త్ రేసులో మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త వెనుకబడిన తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు... శ్రీలంకతో రెండో వన్డేలో దుమ్మురేపాడు. నాణ్యమైన ఆటతీరుతో అజేయ శతకం సాధించి... ఆస్ట్రేలియా టికెట్‌ను దాదాపుగా ‘గెలిచాడు'. అంతేకాదు... కెరీర్‌లో భారత్ తరఫున తొలి సెంచరీతో తన ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కించుకున్నాడు. రాయుడుతో పాటు ధావన్, కోహ్లి కూడా రాణించడంతో రెండో వన్డేలో కూడా భారత్ అలవోకగా శ్రీలంకను ఓడించింది.
 
 అహ్మదాబాద్: దశాబ్దానికిపైగా క్రికెట్‌లో అందరికీ సుపరిచితుడైనా.... ఎప్పుడూ పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా పరిస్థితులతో పోరాడి ఏడాది క్రితం భారత జట్టులోకి వచ్చిన తెలుగుతేజం అంబటి రాయుడు... ఎట్టకేలకు తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. శ్రీలంకతో రెండో వన్డేలో సెంచరీ (118 బంతుల్లో 121 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో చెలరేగిపోయాడు.

ఫలితంగా భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను అలవోకగా ఓడించింది. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 274 పరుగులు చేసింది. కెప్టెన్ మ్యాథ్యూస్ (101 బంతుల్లో 92 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. సంగక్కర (86 బంతుల్లో 61; 4 ఫోర్లు), దిల్షాన్ (30 బంతుల్లో 35; 7 ఫోర్లు), దమ్మిక ప్రసాద్ (28 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 44.3 ఓవర్లలో 4 వికెట్లకు 275 పరుగులు చేసింది.

ధావన్ (80 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (44 బంతుల్లో 49; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే హైదరాబాద్‌లో ఆదివారం జరుగుతుంది.

 ఆదుకున్న మ్యాథ్యూస్
 కుశాల్ పెరీరా (0) తొలి ఓవర్‌లోనే అవుటైనా  దిల్షాన్, సంగక్కర రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. జయవర్ధనే (4) విఫలం కావడంతో లంక 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన మ్యాథ్యూస్ నాణ్యమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సంగక్కర, మ్యాథ్యూస్‌లు నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అయితే రెండో పవర్ ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లతో లంక పరుగుల వేగం తగ్గింది. చివర్లో దమ్మిక ప్రసాద్, మాథ్యూస్ ఐదు ఓవర్లలో 46 పరుగులు చేయడంతో లంకకు గౌరవప్రదమైన స్కోరు లభించింది.

 రాయుడు జోరు
 గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన రహానే (8) ఈసారి విఫలమయ్యాడు. అయితే కోహ్లి బదులు రాయుడు ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కావలసినన్ని ఓవర్లు అందుబాటులో ఉండటంతో రాయుడు స్వేచ్ఛగా ఆడాడు. మరోవైపు ధావన్ కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. ఆ తర్వాత ధావన్ అవుటైనా... కోహ్లి, రాయుడు కలిసి మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించి గెలుపును లాంఛనం చేశారు. ప్రసన్నకు 3 వికెట్లు దక్కాయి.

 స్కోరు వివరాలు
 శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 0; దిల్షాన్ (బి) అక్షర్ 35; సంగక్కర (సి) ధావన్ (బి) ఉమేశ్ 61; జయవర్ధనే (సి) రాయుడు (బి) అశ్విన్ 4; మ్యాథ్యూస్ నాటౌట్ 92; ప్రసన్న (సి) రాయుడు (బి) జడేజా 13; ప్రియాంజన్ రనౌట్ 1; తిసారా పెరీరా (బి) అక్షర్ 10; రన్‌దీవ్ (బి) అశ్విన్ 10; దమ్మిక ప్రసాద్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 274.
 వికెట్ల పతనం: 1-4; 2-55; 3-64; 4-154; 5-177; 6-179; 7-205; 8-220

 బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 10-1-54-2; ఇషాంత్ 10-0-58-0; అశ్విన్ 10-1-49-2; అక్షర్ పటేల్ 10-1-39-2; రవీంద్ర జడేజా 10-0-64-1.

 భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) జయవర్ధనే (బి) ప్రసాద్ 8; ధావన్ (సి) ప్రియాంజన్ (బి) ప్రసన్న 79; రాయుడు నాటౌట్ 121; కోహ్లి (సి) రన్‌దీవ్ (బి) ప్రసన్న 49; రైనా ఎల్బీడబ్ల్యు (బి) ప్రసన్న 14; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (44.3 ఓవర్లలో 4 వికెట్లకు) 275.

 వికెట్ల పతనం: 1-18; 2-140; 3-256; 4-270

 బౌలింగ్: మ్యాథ్యూస్ 4-0-18-0; గమగే 8-1-28-0; దమ్మిక ప్రసాద్ 7-0-51-1; తిసారా పెరీరా 4-0-35-0; రన్‌దీవ్ 10-0-66-0; దిల్షాన్ 2-0-9-0; ప్రసన్న 7.3-0-53-3; ప్రియాంజన్ 2-0-14-0.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement