సెంచూరియన్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతమైన ఫీల్డింగ్‌తో శభాష్ అనిపించాడు. మ్యాచ్‌పై సఫారీలు పట్టుబిగిస్తున్న వేళ హార్దిక్ ఒక అద్భుతమైన త్రో ద్వారా హాషీమ్ ఆమ్లా(82;153 బంతుల్లో 14 ఫోర్లు)ను రనౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ 81 ఓవర్‌ను అందుకున్న హార్దిక్.. ఐదో బంతికి ఆమ్లాకు షాకిచ్చాడు. ఆ బంతిని క్రీజ్ దగ్గరగానే డిఫెన్స్ ఆడిన ఆమ్లా పరుగు కోసం యత్నించాడు. అయితే అంతే వేగంగా అథ్లెట్‌ను తలపిస్తూ బంతిపైకి దూసుకొచ్చిన హార్దిక్.. బంతిని అందుకున్న మరుక్షణమే నాన్ స్టైకింగ్ ఎండ్ వైపు వికెట్లను నేలకూల్చాడు. అప‍్పటికి ఇంకా క్రీజ్‌లో చేరుకోలేని ఆమ్లా భారంగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనిపై రివ్యూకు వెళ్లినా ఆమ్లాకు నిరాశ తప్పలేదు. దాంతో 246 పరుగుల వద్ద సఫారీలు నాల్గో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
అటు తరువాత డీకాక్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆపై ఫిలిండర్ రనౌట్‌గా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 251 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను నష్టపోయింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఆరు వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ ఒక వికెట్ తీశాడు. రెండు వికెట్లు రనౌట్ల రూపంలో వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment