శివ కుమార్ ‘సిక్సర్’
ఆరు వికెట్లతో చెలరేగిన ఆంధ్ర బౌలర్
- తొలి ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 91 పరుగులకే ఆలౌట్
- రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్
రోహ్‌తక్: మహారాష్ట్రతో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ శివ కుమార్ (6/41) నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. దీంతో బన్సీలాల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు మహారాష్ట్ర 41.5 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ మోత్వాని (23) టాప్ స్కోరర్. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 3 వికెట్లకు 87 పరుగులు చేసింది. ప్రశాంత్ (26 బ్యాటింగ్), ప్రదీప్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
శ్రీరామ్ (31) ఫర్వాలేదనిపిం చినా... భరత్ (11), కైఫ్ (0)లు నిరాశపర్చారు. ప్రస్తుతం ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్రని ఆంధ్ర బౌలర్లు వణికించారు. 10 పరుగులకే ఓపెనర్లు గుగాలే (0), ఖడివాలే (6)లు వెనుదిరిగారు. అయితే మోత్వాని నిలబడినా.. రెండో ఎండ్‌లో జాదవ్ (6), బావ్నే (2)లు కూడా పెవిలియన్‌కు చేరడంతో మహారాష్ట్ర 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మోత్వాని అవుటైన తర్వాత సంక్లేచా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్‌గా ఆరుగురు సిం గిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో మహా రాష్ర్ట స్వల్ప స్కోరుకు పరిమితమైంది. విజయ్ కుమార్, స్టీఫెన్ చెరో రెండు వికెట్లు తీశారు.