- మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల అనుమానం
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయత్నాల్లో భాగంగా సూర్యాపేటలో పోలీసుల్ని చంపి, ఇద్దరు సహచరుల్ని కోల్పోయిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే తలదాచుకునే అవకాశం ఉందని మహారాష్ట్ర యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ముఠాలో ఇంకా ఓ మహిళ సహా ఐదుగురు ఉన్నట్లు వారు నిర్ధారించారు. ఆ ఐదుగురి ఫొటోలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిన రెండు రాష్ట్రాల అధికారులు.. ప్రధానంగా జిల్లా, రాష్ట్ర సరిహద్దులు, పారిశ్రామికవాడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఖాండ్వా జైలులో ఉన్న అబు ఫైజల్, ఎజాజుద్దీన్ మహ్మద్, జాకీర్ హుస్సేన్, మహబూబ్, అస్లం అయూబ్ ఖాన్, అంజద్ రంజాన్ ఖాన్, అబిద్‌లు గత ఏడాది అక్టోబర్‌లో తప్పించుకున్నారు. వీరిలో అబు ఫైజల్, అబిద్‌లు చిక్కగా... సూర్యాపేట ఉదంతంలో ఎజాజ్, అస్లం నేలకొరిగారు.
మిగిలిన ముగ్గురితో కొత్తగా మహ్మద్ సాలక్, మహబూబ్ తల్లి నజ్మాబీ జత కట్టినట్లు అధికారులు గుర్తించారు. మరో వర్గం వ్యక్తుల పేర్లతో పాత/కొత్త వస్త్రాలు విక్రయించే వారి మాదిరిగా నివసించడం వీరి నైజమని, అందువల్ల ఇలాంటి వారిపై కన్నేసి ఉంచాల్సిందిగా సూచించారు. పుణేలో జరిగిన బాంబు పేలుడుతో పాటు మహారాష్ట్రకు సంబంధించిన పలు కేసుల్లో నిందితులుగా ఉన్న మహబూబ్, అంజాద్, జకీర్‌లపై రూ.10 లక్షల రివార్డు సైతం ఏటీఎస్ ప్రకటించింది.
ఏపీ, తెలంగాణల్లోనే సిమి ఉగ్రవాదులు!
Published Mon, Jun 15 2015 3:48 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement