ప్రతిభ కొండంత...గుర్తింపు గోరంత...
♦ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు
♦ యూత్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం
♦ ప్రభుత్వం నుంచి చేయూత శూన్యం
♦ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ ప్రస్థానం
ఏ రంగంలోనైనా కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభించాలి. లేదంటే ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. ఈ అంశం క్రీడారంగానికీ వర్తిస్తుంది. ఏడేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నా... ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు లభించపోతే ఏ క్రీడాకారుడికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ యువ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. ఒక క్రీడాంశంలో అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించగానే భారీ నజరానాలు అందజేయడం... ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతాయి. ఇతర క్రీడాంశాల వారికి మాత్రం ఆ స్థాయి ఆదరణ, గుర్తింపు లభించకపోవడం విచారకరం.
పదేళ్ల క్రితం బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న శ్యామ్ కుమార్ ఏడాది తిరిగేలోపే ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008, 2009, 2010లలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచి సంచలనం సృష్టించాడు. దాంతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని అందుకొని సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. విశాఖపట్నంలోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) శిక్షణ కేంద్రంలో కోచ్ ఐ.వెంకటేశ్వర రావు వద్ద బాక్సింగ్ పాఠాలు నేర్చుకున్న శ్యామ్ అనతికాలంలోనే ఓ మేటి బాక్సర్‌గా రూపుదిద్దుకున్నాడు. నాన్న అర్జున్ కబడ్డీ ప్లేయర్ కావడంతో శ్యామ్‌కు సహజంగానే ఆటలపై ఆసక్తి కలిగింది. తన సోదరుడు సాగర్ బాక్సింగ్ నేర్చుకోవడానికి వెళ్తుండటంతో శ్యామ్ కూడా గ్లౌవ్స్ ధరించి ‘రింగ్’లోకి అడుగు పెడతానని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
తనయుడి ఆసక్తిని గమనించిన తండ్రి అర్జున్ బాక్సింగ్ శిక్షణకు పంపించారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటంతో ఆరంభంలో కోచ్ అన్నీ తానై శ్యామ్‌కు అండగా నిలిచారు. 2010లో కోల్‌కతాలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో శ్యామ్ స్వర్ణం నెగ్గడంతో... అదే ఏడాది కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఆ టోర్నీలో శ్యామ్ పసిడి పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత శ్యామ్ భారత జూనియర్, యూత్ జట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన జాతీయ పురుషుల ఎలైట్ చాంపియన్‌షిప్‌లో శ్యామ్ రజత పతకం సాధించి సీనియర్ స్థాయిలోనూ తన ముద్ర వేశాడు. సీనియర్ స్థాయిలో 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న 21 ఏళ్ల శ్యామ్ ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నాడు. రైల్వేస్‌లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్న శ్యామ్ వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పతకాలు సాధించడమే తన ముందున్న లక్ష్యమని ‘సాక్షి’తో పేర్కొన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడం తన జీవితాశయమని వివరించాడు.
గత ఏడేళ్లలో జూనియర్, యూత్, సీనియర్ స్థాయిల్లో పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఎన్నో పతకాలు గెలిచాను. కానీ ఇప్పటి వరకు నా విజయాలను ప్రభుత్వం గుర్తించలేదు. ఇతర క్రీడాంశాల వారికి మాత్రం పతకాలు గెలిచి ఇక్కడకు వచ్చిన వెంటనే భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ఇస్తున్నారు. ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నారు. వీలైతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీలు ఇస్తున్నారు. నాకు మాత్రం ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి నగదు పురస్కారాలు అందలేదు. కొంతకాలంగా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకు, నాన్న చికిత్సకే సరిపోతోంది. ఇకనైనా ప్రభుత్వం అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న రాష్ట్ర క్రీడాకారులను స్థాయీభేదం చూడకుండా సమానంగా గౌరవించాలని అభ్యర్థిస్తున్నాను.
–శ్యామ్ కుమార్
శ్యామ్ కుమార్ ఘనతలు
ఈ నెలలో మంగోలియాలో జరిగిన ఉలాన్‌బాటర్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో కాంస్య పతకం.
గత ఏప్రిల్‌లో థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం.
2015 డిసెంబరులో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్‌లో కాంస్య పతకం.
2015 ఏప్రిల్‌లో థాయ్‌లాండ్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం.
2014 ఆగస్టులో చైనాలోని నాన్‌జింగ్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో ఐదో స్థానం.
2014 ఏప్రిల్‌లో బల్గేరియాలోని సోఫియాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం.
2013లో అజర్‌బైజాన్‌లో జరిగిన అంతర్జాతీయ యూత్ టోర్నీలో స్వర్ణం.
2012లో అజర్‌బైజాన్‌లో జరిగిన అంతర్జాతీయ జూనియర్ టోర్నీలో రజతం.
2010లో కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ జూనియర్ టోర్నీలో స్వర్ణం.