Youth Olympics
-
క్యాష్ ప్రైజ్ అంతా ఉత్తిదేనా?: అథ్లెట్ ఆవేదన
చంఢీగడ్: క్రీడాకారులు పథకాలు సాధిస్తే వారిపై వరాల జల్లులు కురిపించడం ప్రభుత్వ పెద్దలకు చాలా సాధారణ విషయం. ఇక గెలిచిన హడావుడి అయిపోయిన తర్వాత ఆ క్రీడాకారులను పట్టించుకోని సందర్భాలు చాలానే ఉంటాయి. ఇలాంటి అనుభవమే భారత యువ షూటర్ మను బాకర్‌కు ఎదుర్కొంటోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడితో పాటు యూత్ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించినప్పుడు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అక్టోబర్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మను బాకర్ స్వర్ణ పతాకం గెలిచారు. దీంతో హర్యానా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ మను బాకర్‌కు రెండు కోట్ల నజరానాను ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు క్రీడాకారులను పట్టించుకోలేదని.. పతకాలు సాధిస్తే కేవలం పది లక్షలు మాత్రమే ఇచ్చి సంతృప్తి పరిచేవారని కానీ తమ ప్రభుత్వం క్రీడాకారులను ప్రొత్సహించే ఉద్దేశంతో మను బాకర్‌కు రెండు కోట్ల నజరానా ప్రకటిస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ తనకు ఎలాంటి అర్థిక సహాయం అందలేదని.. ‘మంత్రి గారు మీరు ప్రకటించిన నజరానా నిజమా.. లేక ఉత్తిదేనా’ అంటూ శుక్రవారం మనుబాకర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా గతంలో మంత్రి చేసిన ట్వీట్‌కు సంబంధించన స్క్రీన్ షాట్లు కూడా పోస్ట్ చేశారు. ఇక ఈ యువ షూటర్ చేసిన పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారాయి. ప్రభుత్వ తీరుపై క్రీడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Sir Please confirm if it is correct... Or just Jumla... @anilvijminister pic.twitter.com/AtxpLKBSYV — Manu Bhaker (@realmanubhaker) January 4, 2019 -
ఆకాశ్‌కు రజతం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంచనాలకు మించి రాణించిన భారత క్రీడాకారులు యూత్ ఒలింపిక్స్‌లో తమ పోరాటాన్ని రజత పతకంతో ముగించారు. పోటీల చివరిరోజు భారత్‌కు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆకాశ్ మలిక్ రజతాన్ని అందించాడు. హరియాణాకు చెందిన 15 ఏళ్ల ఆకాశ్ ఫైనల్లో 0–6తో ట్రెన్టన్ కౌలెస్ (అమెరికా) చేతిల ఓడిపోయాడు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది. 2010 క్రీడల్లో భారత్ 8 పతకాలతో 58వ స్థానంలో... 2014 క్రీడల్లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌లో జరుగుతాయి. -
కూలీ కొడుకు... ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. తమిళనాడుకు చెందిన వ్యవసాయ కూలీ కుమారుడు ప్రవీణ్ చిత్రవేళ్ కాంస్య పతకంతో మెరిశాడు. అతను ట్రిపుల్ జంప్‌లో ఈ పతకం సాధించాడు. ఈ క్రీడల్లో ఓవరాల్‌గా భారత్‌కిది 12వ పతకం కాగా... అథ్లెటిక్స్‌లో రెండోది. ఈ పోటీలో అతను స్టేజ్–2లో 15.68 మీ.దూరంతో ఐదో స్థానంలో నిలిచాడు. అయితే స్టేజ్–1లో మెరుగైన 15.84 మీ. దూరంతో కలిపి 31.52 మీ. సగటుతో పోడియంలో నిలిచి కాంస్యంతో తృప్తిపడ్డాడు. ఈ యూత్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో ఫైనల్స్ నిర్వహించడం లేదు. ఒక్కో అథ్లెట్‌కు రెండు అవకాశాలిస్తారు. మెరుగైన సంయుక్త ప్రదర్శన ఆధారంగా స్థానాలను కేటాయిస్తారు. తంజావూరు జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన ప్రవీణ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి దినసరి వ్యవసాయ కూలీ. అయితే క్రీడల్లో ప్రావీణ్యమున్న ప్రవీణ్ అనుకోకుండా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అథ్లె టిక్స్ కోచ్ ఇందిరా సురేశ్ కంటపడ్డాడు. అతని ప్రతిభను గుర్తించిన ఆమె తన శిక్షణలో ప్రవీణ్ ప్రదర్శనకు మెరుగులు దిద్దింది. ఈ ఏడాది ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్‌లో అతను స్వర్ణం, జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. ప్రస్తుతం అతను మంగళూరులోని కాలేజీలో స్పోర్ట్స్ కోటాలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ ఆకాశ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ఆకాశ్ 6–0తో సెన్నా రూస్ (బెల్జియం)పై గెలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాడు. -
మహిళల జట్టుకూ రజతమే
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): బరిలోకి దిగిన తొలిసారే స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. యూత్ ఒలింపిక్స్‌లో భాగంగా మొదటిసారి నిర్వహించిన ఫైవ్–ఎ–సైడ్ హాకీ పోటీల్లో భారత పురుషుల జట్టు మాదిరిగానే భారత మహిళల జట్టు కూడా రజతంతో సంతృప్తి పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఆతిథ్య అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. ముంతాజ్ ఖాన్ చేసిన గోల్‌తో భారత్ తొలి నిమిషంలోనే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న అర్జెంటీనా ఏడో నిమిషంలో గియానెల్లా గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసింది. తొమ్మిదో నిమిషంలో సోఫియా రమాల్లో... 12వ నిమిషంలో బ్రిసా బ్రుగెస్సర్ ఒక్కో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్లో టీమిండియా 2–4తో మలేసియా చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. మూడు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 7 రజతాలతో కలిపి మొత్తం 10 పతకాలతో పదో స్థానంలో ఉంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఆకాశ్, హిమాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ఆకాశ్ 6–5తో లీ బెంజిమిన్ (కెనడా)పై, హిమాని 7–1తో జిల్ వాల్టర్ (సమోవా)పై గెలుపొందారు. -
భారత హాకీ జట్టుకు రజతం
బ్యూనస్ ఎయిర్స్: నాలుగేళ్ల క్రితం కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకున్న భారత బృందం ఈసారి యూత్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది. ఫైవ్–ఎ–సైడ్ హాకీ పురుషుల విభాగంలో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. మలేసియాతో జరిగిన ఫైనల్లో భారత్ 2–4తో ఓడింది. స్వర్ణం–రజతం కోసం అర్జెంటీనాతో భారత మహిళల జట్టు కూడా తలపడనుంది. మహిళల రెజ్లింగ్ 43 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సిమ్రన్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో సిమ్రన్ 6–11తో ఎమిలీ (అమెరికా) చేతిలో ఓడింది. నాలుగు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో ఇప్పటికే భారత్ 10 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇప్పటివరకు మను భాకర్, సౌరభ్ (షూటింగ్), లాల్రినుంగా (వెయిట్‌లిఫ్టింగ్) స్వర్ణాలు సాధించగా... తబాబి దేవి (జూడో), తుషార్ (షూటింగ్), మెహులీ (షూటింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), సిమ్రన్ (రెజ్లింగ్) రజతాలు గెలిచారు. 2010 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ రెండు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. -
లక్ష్య సేన్‌కు రజతం
బ్యూనస్ ఎయిర్స్: స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ యువతార లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. యూత్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఉత్తరాఖండ్ షట్లర్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో లక్ష్య సేన్ 15–21, 19–21తో లీ షిఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. యూత్ ఒలింపిక్స్ చరిత్రలో రజతం నెగ్గిన రెండో భారతీయ షట్లర్‌గా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. 2010 యూత్ ఒలింపిక్స్‌లో ప్రణయ్ కూడా రజత పతకమే సాధించాడు. మిక్స్డ్ టీమ్ విభాగంలో లక్ష్య సేన్ సభ్యుడిగా ఉన్న ‘ఆల్ఫా’ జట్టు స్వర్ణం నెగ్గింది. అయితే ఇది ఎగ్జిబిషన్ ఈవెంట్ కావడంతో ఈ ఫలితాలకు, పతకాలకు అధికారిక గుర్తింపు లేదు. మహిళల రెజ్లింగ్ 43 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సిమ్రన్ ఫైనల్‌కు చేరింది. ఫైవ్–ఎ–సైడ్ పురుషుల హాకీ సెమీఫైనల్లో భారత్ 3–1తో ఆతిథ్య అర్జెంటీనా జట్టును ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. -
మను భాకర్‌కు రజతం
బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్ షూటింగ్ మిక్స్డ్ డబుల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత టీనేజర్ మను భాకర్, తజకిస్తాన్ కుర్రాడు బెహ్జాన్ ఫయ్జులీవ్ జోడీ రజతంతో సంతృప్తి పడింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఈ జంట 3–10 తేడాతో వనెస్సా సీగర్ (జర్మనీ)–కిరిల్ కిరొవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలైంది. మహిళల వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మను... టోర్నీ నిబంధనల ప్రకారం పురుషుల విభాగంలో ఫైనల్లో 20వ స్థానంలో నిలిచిన బెహ్జాన్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో పాల్గొంది. అయితే, ఈ జంట ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక స్వర్ణం చేజార్చుకుంది. తాజా ఫలితంతో యూత్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్‌కు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు దక్కినట్లైంది. ఇప్పటివరకు మొత్తం 8 పతకాలు రాగా, అందులో ఐదు షూటింగ్వే కావడం గమనార్హం. హాకీ ఫైవ్–ఎ–సైడ్ విభాగంలో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 4–2తో పోలాండ్‌పై... మహిళల జట్టు 3–0తో పోలాండ్పైనే విజయం సాధించాయి. నేడు జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత పురుషుల జట్టు ఆడుతుంది. -
పసిడి బుల్లెట్..
భారత ‘గన్’ మళ్లీ గర్జించింది. గురి చూసి మళ్లీ పసిడి పతకాన్ని కొట్టింది. మంగళవారం మను భాకర్ బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... బుధవారం సౌరభ్ చౌధరీ బుల్లెట్‌కు మరో స్వర్ణం సొంతమైంది. ఫలితంగా యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. ఓవరాల్‌గా భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలతో కలిపి మొత్తం 6 పతకాలతో మూడోస్థానంలో ఉంది. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ఇటీవలే ఆసియా క్రీడల్లో, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన స్వర్ణ పతకాలు గాలివాటమేమీ కాదని 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా గురి తప్పని ప్రదర్శనతో యూత్ ఒలింపిక్స్‌లోనూ అదరగొట్టాడు. ఫలితంగా బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ బంగారు పతకాన్ని కొల్లగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ ఫైనల్లో 244.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. సుంగ్ యున్హో (దక్షిణ కొరియా–236.7 పాయింట్లు) రజతం, సొలారీ జాసన్ (స్విట్జర్లాండ్–215.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. సౌరభ్, సుంగ్ యున్హో మధ్య ఏకంగా 7.5 పాయింట్ల తేడా ఉండటం భారత షూటర్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లోనూ సౌరభ్ తన జోరు ప్రదర్శించాడు. 580 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. కాంస్యం కోసం అర్చన పోరు... టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అర్చన కామత్ కాంస్య పతకానికి విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో అర్చన 3–11, 7–11, 6–11, 11–1, 5–11తో సున్ యింగ్షా (చైనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం ఆండ్రియా (రొమేనియా)తో అర్చన ఆడనుంది. హాకీ జట్టుకు తొలి ఓటమి... ఫైవ్–ఎ–సైడ్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆతిథ్య అర్జెంటీనాతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–5 గోల్స్ తేడాతో ఓడింది. భారత్ తరఫున రీత్, ముంతాజ్ ఖాన్ ఒక్కో గోల్ చేశారు. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు సాధించి 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
భారత్ ‘బంగారు’ చరిత్ర
బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్‌లో భారత్ టీనేజ్ వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం జెరెమీ లాల్రిన్గుంగా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోరులో 15 ఏళ్ల లాల్రిన్గుంగా ఫైనల్ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడంతో పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. గ్రూప్-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించాడు. తొలుత స్నాచ్ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు. దాంతో టర్కీ వెయిట్‌లిఫ్టర్ తొప్తాస్ కానర్(263 కేజీలు)లను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఫలితంగా స్వర్ణం ఖాయమైంది. కాగా, ఓవరాల్ యూత్ ఒలింపిక్స్‌లో ఇదే భారత్‌కు తొలి స్వర్ణం కావడం విశేషం. దాంతో యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ‘బంగారు’ చరిత్రను ఆరంభించినట్లయ్యింది. సోమవారం ఆటల్లో భాగంగా షూటింగ్ సంచలనం మేహులి ఘోష్ స్వర్ణ గురి తప్పింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 18 ఏళ్ల మేహులి రజతంతో సరిపెట్టుకుంది. ఆఖరి షాట్ మినహా అన్ని షాట్లను లక్ష్యానికి దగ్గరగా గురిపెట్టిన ఆమె చివరి 24వ షాట్‌తో స్వర్ణానికి దూరమైంది. కాగా, భారత్ ఖాతాలో తాజాగా స్వర్ణం చేరడంతో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మూడో యూత్ ఒలింపిక్స్‌లో భారత్ పసిడి ఖాతాను తేరవడం గమనార్హం. ఇప్పటివరకూ ఈ యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఒక గోల్డ్ మెడల్‌తో పాటు మూడు రజత పతకాలు సాధించింది. ఇదే భారత్‌కు యూత్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకుముందు 2014లో భారత్ కేవలం రెండు పతకాల్ని మాత్రమే సాధించింది. -
బోణీ అదిరింది
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్ పోటీలు మొదలైన తొలిరోజే భారత్ రెండు రజతాలతో ఖాతా తెరిచింది. షూటర్ తుషార్ మానే... జూడో ప్లేయర్ తబాబి దేవి తంగ్జామ్ రజత పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో తుషార్ 247.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో సెర్బియా షూటర్లు గ్రిగొరి షమకోవ్ (249.2) స్వర్ణం, అలెక్సా మిత్రోవిక్ (సెర్బియా) కాంస్యం గెలుచుకున్నారు. చివరి షాట్ దాకా భారత ఆటగాడు స్వర్ణం రేసులో నిలిచాడు. అప్పటి వరకు షమకోవ్కు దీటుగా గురి కుదరగా... చివరి షాట్ తుషార్‌ను రజతానికి పడేసింది. ఇందులో అతనికి 9.6 పాయింట్లు రాగా, షమకోవ్ 9.9 పాయింట్లతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. మహిళల జూడో 44 కేజీల ఫైనల్లో తబాబి దేవి తంగ్జామ్ 1–11తో మరియా జిమినెజ్ (వెనిజులా) చేతిలో ఓడింది. మరోవైపు పురుషుల హాకీలో భారత్ 10–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. రవిచంద్ర, సాగర్, సుదీప్ రెండేసి గోల్స్, శివమ్, రాహుల్, సంజయ్, మణిందర్ తలా ఒక గోల్ చేశారు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ లీగ్ మ్యాచ్‌లో జక్కా వైష్ణవి రెడ్డి 21–13, 21–6తో ఎలీనా అండ్రూ (స్పెయిన్)పై గెలిచింది. -
పతాకధారిగా మను భాకర్
యూత్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి టీనేజ్ షూటింగ్ స్టార్ మను భాకర్ నేతృత్వం వహించనుంది. ఈ నెల 6 నుంచి 18 వరకు బ్యూనస్ ఎయిర్స్లో యూత్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో 16 ఏళ్ల మను భాకర్ త్రివర్ణ పతాకంతో జట్టును ముందుండి నడిపించనుంది. 68 మందితో కూడిన భారత జట్టు ఇందులో పాల్గొంటుంది. 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. భారత జట్టు మంగళవారం అర్జెంటీనా బయల్దేరనుంది. జట్టు సభ్యులకు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. -
విజేత యువ భారత్
బ్యాంకాక్: యూత్ ఒలింపిక్స్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ పురుషుల జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ టైబ్రేక్‌లో 2–1తో మలేసియాను ఓడించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 4–4తో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ను నిర్వహించారు. భారత్ తరఫున రాహుల్ కుమార్, వివేక్ సాగర్ రెండేసి గోల్స్ చేశారు. మరోవైపు భారత జూనియర్ మహిళల జట్టు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్ చేరే క్రమంలో అజేయంగా నిలిచిన భారత మహిళల జట్టు అంతిమ సమరంలో 1–4తో చైనా చేతిలో ఓడిపోయింది. ఫైనల్‌కు చేరిన భారత పురుషుల, మహిళల జూనియర్ జట్లతోపాటు మలేసియా, చైనా కూడా ఈ ఏడాది అక్టోబరులో అర్జెంటీనాలో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. -
ప్రతిభ కొండంత...గుర్తింపు గోరంత...
♦ అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు ♦ యూత్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం ♦ ప్రభుత్వం నుంచి చేయూత శూన్యం ♦ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ ప్రస్థానం ఏ రంగంలోనైనా కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభించాలి. లేదంటే ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. ఈ అంశం క్రీడారంగానికీ వర్తిస్తుంది. ఏడేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నా... ప్రభుత్వ పరంగా ఎలాంటి గుర్తింపు లభించపోతే ఏ క్రీడాకారుడికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ యువ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. ఒక క్రీడాంశంలో అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించగానే భారీ నజరానాలు అందజేయడం... ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతాయి. ఇతర క్రీడాంశాల వారికి మాత్రం ఆ స్థాయి ఆదరణ, గుర్తింపు లభించకపోవడం విచారకరం. పదేళ్ల క్రితం బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న శ్యామ్ కుమార్ ఏడాది తిరిగేలోపే ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008, 2009, 2010లలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచి సంచలనం సృష్టించాడు. దాంతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని అందుకొని సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. విశాఖపట్నంలోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) శిక్షణ కేంద్రంలో కోచ్ ఐ.వెంకటేశ్వర రావు వద్ద బాక్సింగ్ పాఠాలు నేర్చుకున్న శ్యామ్ అనతికాలంలోనే ఓ మేటి బాక్సర్‌గా రూపుదిద్దుకున్నాడు. నాన్న అర్జున్ కబడ్డీ ప్లేయర్ కావడంతో శ్యామ్‌కు సహజంగానే ఆటలపై ఆసక్తి కలిగింది. తన సోదరుడు సాగర్ బాక్సింగ్ నేర్చుకోవడానికి వెళ్తుండటంతో శ్యామ్ కూడా గ్లౌవ్స్ ధరించి ‘రింగ్’లోకి అడుగు పెడతానని తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనయుడి ఆసక్తిని గమనించిన తండ్రి అర్జున్ బాక్సింగ్ శిక్షణకు పంపించారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటంతో ఆరంభంలో కోచ్ అన్నీ తానై శ్యామ్‌కు అండగా నిలిచారు. 2010లో కోల్‌కతాలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో శ్యామ్ స్వర్ణం నెగ్గడంతో... అదే ఏడాది కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఆ టోర్నీలో శ్యామ్ పసిడి పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత శ్యామ్ భారత జూనియర్, యూత్ జట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన జాతీయ పురుషుల ఎలైట్ చాంపియన్‌షిప్‌లో శ్యామ్ రజత పతకం సాధించి సీనియర్ స్థాయిలోనూ తన ముద్ర వేశాడు. సీనియర్ స్థాయిలో 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న 21 ఏళ్ల శ్యామ్ ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నాడు. రైల్వేస్‌లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్న శ్యామ్ వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పతకాలు సాధించడమే తన ముందున్న లక్ష్యమని ‘సాక్షి’తో పేర్కొన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడం తన జీవితాశయమని వివరించాడు. గత ఏడేళ్లలో జూనియర్, యూత్, సీనియర్ స్థాయిల్లో పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఎన్నో పతకాలు గెలిచాను. కానీ ఇప్పటి వరకు నా విజయాలను ప్రభుత్వం గుర్తించలేదు. ఇతర క్రీడాంశాల వారికి మాత్రం పతకాలు గెలిచి ఇక్కడకు వచ్చిన వెంటనే భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ఇస్తున్నారు. ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నారు. వీలైతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీలు ఇస్తున్నారు. నాకు మాత్రం ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి నగదు పురస్కారాలు అందలేదు. కొంతకాలంగా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకు, నాన్న చికిత్సకే సరిపోతోంది. ఇకనైనా ప్రభుత్వం అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న రాష్ట్ర క్రీడాకారులను స్థాయీభేదం చూడకుండా సమానంగా గౌరవించాలని అభ్యర్థిస్తున్నాను. –శ్యామ్ కుమార్ శ్యామ్ కుమార్ ఘనతలు ఈ నెలలో మంగోలియాలో జరిగిన ఉలాన్బాటర్ కప్ అంతర్జాతీయ టోర్నమెంట్లో కాంస్య పతకం. గత ఏప్రిల్‌లో థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం. 2015 డిసెంబరులో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో కాంస్య పతకం. 2015 ఏప్రిల్‌లో థాయ్‌లాండ్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం. 2014 ఆగస్టులో చైనాలోని నాన్జింగ్లో జరిగిన యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో ఐదో స్థానం. 2014 ఏప్రిల్‌లో బల్గేరియాలోని సోఫియాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం. 2013లో అజర్బైజాన్లో జరిగిన అంతర్జాతీయ యూత్ టోర్నీలో స్వర్ణం. 2012లో అజర్బైజాన్లో జరిగిన అంతర్జాతీయ జూనియర్ టోర్నీలో రజతం. 2010లో కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ జూనియర్ టోర్నీలో స్వర్ణం. -
అతుల్ వర్మకు కాంస్యం
భారత్ ఖాతాలో రెండో పతకం యూత్ ఒలింపిక్స్ నాన్జింగ్ : చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఎట్టకేలకు మరో పతకం సాధించింది. వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో అతుల్ వర్మ కాంస్యం దక్కించుకున్నాడు. మంగళవారం హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో వర్మ 6-4 తేడాతో టర్కీకి చెందిన మెటే గజోజ్ను ఓడించాడు. రెండో సీడ్ అతుల్ వర్మ తన తొలి ఆరు బాణాలతో ఐదుసార్లు 10 పాయింట్లు సాధించి 4-0 ఆధిక్యం సాధించాడు. మూడో సెట్లో కాస్త ఏకాగ్రత కోల్పోయిన వర్మ మూడుసార్లు 9పాయింట్లు సాధించి స్కోరును సమం చేశాడు. చివరిదైన ఐదో సెట్లో గజోజ్ 29 పాయింట్లు సాధించి ఒత్తిడి పెంచినా తన చివరి బాణంతో వర్మ 10 పాయింట్లు సాధించి కాంస్యాన్ని నెగ్గాడు. దీంతో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. గత గురువారం తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన విషయం తెలిసిందే. ఆర్మీ వెతికిపట్టింది.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 17 ఏళ్ల అతుల్ యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాడు. తండ్రి వ్యవసాయదారుడు. చిన్నప్పటి నుంచీ విలు విద్యపై ఆసక్తి పెంచుకున్న అతుల్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. రెండేళ్ల క్రితం యూపీ తరఫున వారణాసిలో జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతుల్ పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేస్తున్న ఆర్మీ అధికారులు ఆ పోటీలకు వెళ్లారు. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ) మిషన్ ఒలింపిక్స్ పేరుతో భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకాలు పెంచాలనే ఉద్దేశంతో టాలెంట్ సెర్చ్ చేసింది. ఆర్మీ అధికారులు దృష్టిలో పడటంతో అతుల్ కెరీర్ ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ఏఎస్ఐలో స్పోర్ట్స్ క్యాడెట్‌గా చేరిన అతుల్‌కు అక్కడ స్కాలర్షిప్ ఇచ్చారు. ఆర్చరీ కోచ్ సుబేదార్ రవి శంకర్ శిక్షణతో మరింత రాటుదేలాడు. గత నెలలో చైనీస్ తైపీలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రి ఈవెంట్లో రజతం సాధించి... ప్రస్తుత యూత్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బరిలోకి దిగాడు. పతకం సాధించిన ఉత్సాహంతో ఉన్న అతుల్ రెండు నెలల అనంతరం ఆర్మీలోనే జూనియర్ కమిషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించనున్నాడు. ‘అతుల్లో సహజ నైపుణ్యం ఉంది. ఏదైనా విషయాన్ని చాలా తొందరగా నేర్చుకుంటాడు. ఈ పతకం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్మీలో ఉద్యోగం వల్ల జీవితం గురించి భయం, ఆందోళన ఉండవు. పూర్తిగా ఆట మీద ఏకాగ్రత పెట్టొచ్చు. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో పతకం సాధించే స్థాయికి అతుల్ ఎదుగుతాడనే నమ్మకం ఉంది’ అని కోచ్ శంకర్ ‘సాక్షి’తో చెప్పారు. -సాక్షి క్రీడా విభాగం -
రజత రాహుల్
►వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసిన తెలుగు కుర్రాడు ►యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం నాన్జింగ్ (చైనా): అంతర్జాతీయ యవనికపై తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ మరోసారి మెరిశాడు. గత నాలుగేళ్లుగా వెయిట్ లిఫ్టింగ్‌లో నిలకడగా విజయాలు సాధిస్తున్న రాహుల్ తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇక్కడ జరుగుతున్న రెండవ యూత్ ఒలింపిక్స్‌లో గురువారం 77 కేజీల విభాగంలో జరిగిన పోటీలో రాహుల్ రజత పతకం సాధించాడు. ఆరు రోజులుగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే కావడం విశేషం. స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 175 కేజీలు (మొత్తం 316 కేజీలు) బరువు ఎత్తిన రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఆర్మేనియాకు చెందిన హకోబ్ క్రిచియన్ (319 కేజీలు) స్వర్ణ పతకం గెలుచుకోగా, జస్లాన్ కలియెవ్ (కజకిస్థాన్-310 కేజీలు)కు కాంస్యం దక్కింది. ఆఖరి ప్రయత్నం విఫలం... స్నాచ్ విభాగంలో రాహుల్ తొలి ప్రయత్నంలో 135 కేజీల బరువు ఎత్తి ముందంజ వేశాడు. అయితే హకోబ్ 137 కేజీలు ఎత్తి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే రెండో ప్రయత్నంలో రాహుల్ 139 కేజీలు ఎత్తగలిగాడు. మూడో ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకుంటూ 141 కేజీలకు తీసుకెళ్లాడు. అయితే చివరి ప్రయత్నం చేసిన హకోబ్ 142 కేజీల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో రాహుల్ 170, 175 కేజీల బరువు ఎత్తాడు. మరో వైపు ప్రత్యర్థి హకోబ్ మొదటి ప్రయత్నంలో 172 కేజీలు ఎత్తినా...రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. మూడో సారి మాత్రం అతను 177 కేజీలు ఎత్తి రాహుల్‌కు సవాల్ విసిరాడు. దాంతో 179 కేజీలు ఎత్తితే స్వర్ణం నెగ్గే స్థితిలో రాహుల్ నిలిచాడు. అందు కోసం తీవ్రంగా ప్రయత్నించినా లిఫ్ట్ చేయలేకపోయాడు. ఫలితంగా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మార్చిలో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్నాచ్‌లో 133, క్లీన్ అండ్ జర్క్‌లో 163 (మొత్తం 296 కేజీలు) మాత్రమే ఎత్తగలిగిన రాహుల్... ఈ సారి తన ప్రదర్శనను అద్భుతంగా మెరుగు పర్చుకున్నాడు. ఏకంగా 20 కేజీలు ఎక్కువగా అతను బరువెత్తడం విశేషం. బార్ జారిపోయింది ‘మూడో ప్రయత్నంలో 179 స్కోరు సాధించే క్రమంలో క్లీన్ వరకు బాగానే చేశాను. అయితే జర్క్ సమయంలో మెడపై చెమట ఎక్కువై బార్ జారిపోయింది. దాంతో కొద్ది తేడాతో స్వర్ణం కోల్పోయాను. కాస్త నిరాశగా అనిపించినా ఇది నా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కాబట్టి సంతృప్తిగా ఉన్నాను. ఎన్ఐఎస్లో ఎనిమిది నెలల శిక్షణ యూత్ ఒలింపిక్స్‌లో ఫలితాన్ని ఇచ్చింది. మా కోచ్‌లు ఎంతో సహకరించారు. వచ్చే జనవరిలో ఆసియా చాంపియన్‌షిప్ నా తదుపరి ఈవెంట్. ఆ తర్వాతి నుంచి పూర్తి స్థాయిలో సీనియర్ కేటగిరీ కోసం సాధన మొదలు పెడతా. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా జీవిత లక్ష్యం’ - ‘సాక్షి’తో నాన్జింగ్ నుంచి రాహుల్ ‘పాల్గొన్న తొలిసారే రాహుల్ యూత్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది. చైనా వెళ్లే ముందే గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు. అతని ప్రదర్శన తర్వాత నాకు మిత్రులు, సన్నిహితులనుంచి వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌లోనూ గెలుస్తానని నాకు తరచూ చెబుతున్నాడు. వాడు ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా. రాహుల్ స్ఫూర్తితో మా రెండో అబ్బాయి కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నాడు’ - రాహుల్ తండ్రి మధు కెరీర్లో అత్యుత్తమ విజయం ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (ఆగస్ట్ 21), ఇదే వేదిక...యూత్ ఆసియా క్రీడల్లో రాహుల్ స్వర్ణ పతకం గెలుచుకొని సత్తా చాటాడు. యాదృచ్ఛికంగా ఇప్పుడు కూడా అదే వేదికపై ఆసియా స్థాయిని దాటి యూత్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం విశేషం. 17 ఏళ్ల రాహుల్, రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి. ఈ ఏడాదే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన అతను స్పోర్ట్స్ స్కూల్ ‘అలుమ్ని’గా ఇక్కడే శిక్షణ కొనసాగిస్తున్నాడు. కోచ్‌లు ఎస్ఏ సింగ్, పి. మాణిక్యాలరావుల పర్యవేక్షణలో అతను తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధిస్తున్నాడు. జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున నిలకడగా రాణించిన తర్వాత రెండేళ్ల క్రితం సమోవాలో జరిగిన యూత్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకొని తొలిసారి అతను అంతర్జాతీయ వేదికపై పతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత గత రెండేళ్లలో యూత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలు, యూత్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం...జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలు అందుకున్నాడు. యూత్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న రాహుల్‌ను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య అభినందించారు. - సాక్షి క్రీడావిభాగం -
ఆశల పల్లకిలో...
►నేటి నుంచి యూత్ ఒలింపిక్స్ ►15 క్రీడాంశాల్లో భారత్ పోటీ ►బరిలో నలుగురు తెలుగు క్రీడాకారులు నాన్జింగ్ (చైనా): మరో క్రీడల వేడుకకు రంగం సిద్ధమైంది.యువతలో క్రీడలపట్ల చైతన్యం కలగాలనే ఉద్దేశంతో 2010లో ఆరంభించిన యూత్ ఒలింపిక్స్ విజయవంతమయ్యాయి. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఈ క్రీడలకు తెరలేవనుంది. శనివారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌కు చైనాలోని నాన్జింగ్ నగరం ఆతిథ్యం ఇస్తోంది. 13 రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో 204 దేశాల నుంచి 3,600 మంది యువ క్రీడాకారులు 28 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 32 మంది బరిలోకి దిగనున్నారు. నాలుగేళ్ల క్రితం 2010లో సింగపూర్‌లో జరిగిన తొలి యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి 13 క్రీడాంశాల్లో 32 మంది పాల్గొన్నారు. ఆరు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి భారత్ మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గి పతకాల పట్టికలో 58వ స్థానంలో నిలిచింది. ఈసారి నలుగురు తెలుగు క్రీడాకారులు నాన్జింగ్ గేమ్స్‌లో బరిలోకి దిగనున్నారు. ఆర్చరీలో బోడ హేమలత (నల్లగొండ), బ్యాడ్మింటన్‌లో గద్దె రుత్విక శివాని (హైదరాబాద్), బాక్సింగ్‌లో కాకర శ్యామ్ కుమార్ (విశాఖపట్నం), వెయిట్‌లిఫ్టింగ్‌లో రాగాల వెంకట్ రాహుల్ (రంగారెడ్డి) పోటీపడనున్నారు. గత రెండేళ్లుగా యూత్ విభాగంలో పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు నెగ్గిన రాగాల వెంకట్ రాహుల్‌పై... బాక్సర్ శ్యామ్ కుమార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. క్రితంసారి ఒక్క స్వర్ణం కూడా నెగ్గలేకపోయిన భారత్ ఈసారి ‘పసిడి’ బోణీ చేస్తుందో లేదో వేచి చూడాలి. -
భారత్‌కు నాలుగు పతకాలు
యూత్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బ్యాంకాక్: యూత్ ఒలింపిక్స్‌కు అర్హత కోసం జరుగుతున్న ఆసియా స్థాయి క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్.. తొలిరోజే ఓ స్వర్ణంతో సహా నాలుగు పతకాలతో మెరిసింది. బాలుర 1500 మీటర్ల రేసులో అజయ్‌కుమార్ సరోజ్ 3 నిమిషాల 56.47 సెకన్లతో స్వర్ణం సాధించాడు. దీంతో ఆగస్టు 16 నుంచి 28 వరకు చైనాలోని నన్‌జింగ్‌లో జరగనున్న యూత్ ఒలింపిక్స్‌కు అజయ్ అర్హత సాధించాడు. ఇక బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో మేమన్ పౌలోజ్ 13.80 సెకన్లతో, బాలుర జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 70.54 మీటర్ల దూరంతో రజత పతకాలను సొంతం చేసుకున్నారు. భారత్‌కు దక్కిన మరో పతకాన్ని (కాంస్యం) బాలికల జావెలిన్ త్రోలో పుష్పా జఖార్ సాధించింది. 48.73 మీటర్ల దూరంతో పుష్ప మూడో స్థానంలో నిలిచింది. ఇక బాలికల హై జంప్ లిబియా షాజీ ఐదో స్థానం, బాలుర డిస్కస్ త్రోలో ఎస్.మిత్రవరుణ్ నాలుగో స్థానం పొందారు. -
పోరాడి ఓడిన శ్యామ్
ప్రపంచ యూత్ బాక్సింగ్‌లో కాంస్యంతో సరి సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ బరిలో నిలిచిన ఏకైక భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్యామ్ కుమార్ 1-2తో శాల్కర్ అఖిన్‌బే (కజకిస్థాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్లో తొలి రౌండ్‌ను చేజార్చుకున్న శ్యామ్ రెండో రౌండ్లో పైచేయి సాధించాడు. నిర్ణాయక మూడో రౌండ్లో మాత్రం అఖిన్‌బే ఆధిపత్యం చలాయించాడు. ఈ ఓటమితో శ్యామ్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ‘శ్యామ్ బాగా పోరాడాడు. అయితే ఓటమి ఓటమే. అతను యూత్ ఒలింపిక్స్‌కు అర్హత పొందడం సానుకూలాంశం’ అని భారత కోచ్ రామానంద్ తెలిపారు. భారత బాక్సింగ్ సమాఖ్యపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) నిషేధం కారణంగా ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు ‘ఐబా’ పతాకం కింద పోటీపడ్డారు. మొత్తానికి ఈ చాంపియన్‌షిప్ భారత్‌కు నిరాశనే మిగిల్చింది. కేవలం ఒక కాంస్య పతకంతో భారత్ సంతృప్తి పడింది. 2012 ఈవెంట్లో భారత్‌కు రజతం, రెండు కాంస్యాలు వచ్చాయి. 2010లో వికాస్ కృషన్ స్వర్ణం సాధించాడు. -
బైక్ మెకానిక్ కుమారుడు... బాక్సింగ్‌లో ఘనుడు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: సాధారణ బైక్ మెకానిక్ కుమారుడు, వేసవి సెలవుల్లో స్థానికంగా నిర్వహించిన శిబిరాల్లో శిక్షణ పొందిన బాలుడు.. నేడు అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌లో పతకం సాధించే స్థాయికి ఎదిగాడు. తన పదునైన పంచ్‌లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి, తొలిరౌండ్లోనే బౌట్‌ను నిలిపివేసేలా సంచలన ప్రదర్శన కనబరిచిన ఆ యువకుడే విశాఖపట్నానికి చెందిన కాకర శ్యామ్ కుమార్. ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణిస్తూ సెమీఫైనల్‌కు చేరిన శ్యామ్‌కుమార్‌ది విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతం. స్థానికంగా బైక్ మెకానిక్‌గా పనిచేసే కాకర అర్జున్ నలుగురు సంతానంలో మూడోవాడు శ్యామ్. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు తన అన్నయ్య బాక్సింగ్ పంచ్‌లు విసురుతుంటే చూసి తానూ బాక్సర్‌ను కావాలనుకున్నాడు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి.. శ్యామ్‌ను స్థానిక సాయ్ శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. అక్కడ కోచ్ వెంకటేశ్వరరావు శిక్షణలో మెళకువలు నేర్చిన శ్యామ్.. శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్‌లో ఫ్లయ్ వెయిట్లో స్వర్ణం సాధించాడు. అనంతరం మహారాష్ట్రలో జూనియర్ నేషనల్స్‌లో రజతం, ఆలిండియా సాయ్ హాస్టల్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుపొందాడు. అదే ఏడాది కజకిస్తాన్‌లో జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 46 కేజీల విభాగంలో, అజర్బైజాన్లో జూనియర్స్ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. 2012లో అకోలాలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో స్వర్ణం నెగ్గాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అంతర్జాతీయ యూత్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. గత మూడు నెలలు ఔరంగాబాద్‌లోని జాతీయ శిబిరంలో శిక్షణ పొందిన శ్యామ్... నేరుగా ఏఐబీఏ యూత్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న శ్యామ్ యూత్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.