భారత ‘గన్’ మళ్లీ గర్జించింది. గురి చూసి మళ్లీ పసిడి పతకాన్ని కొట్టింది. మంగళవారం మను భాకర్ బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా... బుధవారం సౌరభ్ చౌధరీ బుల్లెట్‌కు మరో స్వర్ణం సొంతమైంది. ఫలితంగా యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. ఓవరాల్‌గా భారత్ మూడు స్వర్ణాలు, మూడు రజతాలతో కలిపి మొత్తం 6 పతకాలతో మూడోస్థానంలో ఉంది.
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ఇటీవలే ఆసియా క్రీడల్లో, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తాను సాధించిన స్వర్ణ పతకాలు గాలివాటమేమీ కాదని 16 ఏళ్ల భారత యువ షూటర్ సౌరభ్ చౌధరీ నిరూపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా గురి తప్పని ప్రదర్శనతో యూత్ ఒలింపిక్స్‌లోనూ అదరగొట్టాడు. ఫలితంగా బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్ బంగారు పతకాన్ని కొల్లగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ ఫైనల్లో 244.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. సుంగ్ యున్‌హో (దక్షిణ కొరియా–236.7 పాయింట్లు) రజతం, సొలారీ జాసన్ (స్విట్జర్లాండ్–215.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. సౌరభ్, సుంగ్ యున్‌హో మధ్య ఏకంగా 7.5 పాయింట్ల తేడా ఉండటం భారత షూటర్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 20 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లోనూ సౌరభ్ తన జోరు ప్రదర్శించాడు. 580 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు.
కాంస్యం కోసం అర్చన పోరు...
టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అర్చన కామత్ కాంస్య పతకానికి విజయం దూరంలో ఉంది. సెమీఫైనల్లో అర్చన 3–11, 7–11, 6–11, 11–1, 5–11తో సున్ యింగ్‌షా (చైనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం ఆండ్రియా (రొమేనియా)తో అర్చన ఆడనుంది.
హాకీ జట్టుకు తొలి ఓటమి...
ఫైవ్–ఎ–సైడ్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆతిథ్య అర్జెంటీనాతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–5 గోల్స్ తేడాతో ఓడింది. భారత్ తరఫున రీత్, ముంతాజ్ ఖాన్ ఒక్కో గోల్ చేశారు. ఆరు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు సాధించి 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment