
బ్యూనస్‌ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్ షూటింగ్ మిక్స్‌డ్ డబుల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత టీనేజర్ మను భాకర్, తజకిస్తాన్ కుర్రాడు బెహ్జాన్ ఫయ్‌జులీవ్ జోడీ రజతంతో సంతృప్తి పడింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఈ జంట 3–10 తేడాతో వనెస్సా సీగర్ (జర్మనీ)–కిరిల్ కిరొవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలైంది. మహిళల వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మను... టోర్నీ నిబంధనల ప్రకారం పురుషుల విభాగంలో ఫైనల్లో 20వ స్థానంలో నిలిచిన బెహ్జాన్‌తో కలిసి మిక్స్‌డ్ ఈవెంట్‌లో పాల్గొంది.
అయితే, ఈ జంట ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక స్వర్ణం చేజార్చుకుంది. తాజా ఫలితంతో యూత్ ఒలింపిక్స్ షూటింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు దక్కినట్లైంది. ఇప్పటివరకు మొత్తం 8 పతకాలు రాగా, అందులో ఐదు షూటింగ్‌వే కావడం గమనార్హం. హాకీ ఫైవ్–ఎ–సైడ్ విభాగంలో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 4–2తో పోలాండ్‌పై... మహిళల జట్టు 3–0తో పోలాండ్‌పైనే విజయం సాధించాయి. నేడు జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత పురుషుల జట్టు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment