para asian games
-
భారత్ కొత్త చరిత్ర
హంగ్జౌ: వరుసగా నాలుగో రోజు తమ పతకాల వేటను కొనసాగిస్తూ ఆసియా పారా క్రీడల్లో భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలను సొంతం చేసుకుంది. 2018 జకార్తా ఆసియా పారా క్రీడల్లో భారత్ అత్యధికంగా 72 పతకాలను దక్కించుకోగా... హాంగ్జౌలో నాలుగో రోజు పోటీలు ముగిసేసరికి భారత బృందం 18 స్వర్ణాలు, 23 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 82 పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. మరో రెండు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ఈసారి భారత్ పతకాల్లో ‘సెంచరీ’ని దాటే అవకాశముంది. గురువారం భారత్‌కు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలు వచ్చాయి. అథ్లెటిక్స్‌లో పురుషుల ఎఫ్46 కేటగిరీ షాట్‌పుట్ ఈవెంట్లో సచిన్ సర్జేరావు ఖిలారి ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అనంతరం ఆర్6 మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్1 విభాగంలో భారత షూటర్ సిద్ధార్థ బాబు 247.7 పాయింట్లు స్కోరు పసిడి పతకాన్ని సాధించాడు. ఆర్చరీలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జోడీ కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో 151–149తో లిన్ యుషాన్–అయ్ జిన్లియాంగ్ (చైనా) జంటపై నెగ్గి బంగారు పతకాన్ని దక్కించుకుంది. -
మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్
కౌలాలంపూర్: చిన్న గెలుపును కూడా ధూమ్ ధామ్ చేస్తూ ఆర్భాటంగా జరుపుకునే రోజులివి. అలాంటిది తన గెలుపును తనతో పాటు ఓడిన వ్యక్తితో కలిపి జరుపుకుని అసలైన ఛాంపియన్ గా నిలిచాడు పారా కరాటే ఛాంపియన్ ఫర్జాద్ సఫావి. మలేషియాలోని మెలాకాలో జరిగిన ఏషియన్ పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ఇరాన్ ఆటగాడు ఫర్జాద్ సఫావి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడని ప్రకటించగానే అతడు మొదట ప్రేక్షకులకు సంప్రదాయబద్ధంగా వంగి అభివాదం చేశాడు. అనంతరం ఫైనల్లో తనపై ఓటమి పాలై రన్నరప్ గా నిలిచిన ఆటగాడు స్టేజి విడిచి వెళ్తోన్న విషయాన్ని గమనించి పరుగున అతడి వద్దకు వెళ్లి అతని చేతిని పైకి ఎత్తి తన విజయాన్ని అతనికి కూడా ఆపాదించాడు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా ఛాంపియన్ ఆటగాడు ఛాంపియన్ లా వ్యవహరించాడంటూ అతడిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ దృష్యాన్ని చూసిన వారెవరైనా భావోద్వేగానికి లోనుకావడం ఖాయం. శుభాకాంక్షలు ఫర్జాద్ క్రీడాస్ఫూర్తి అంటే ఏంటో చూపించావు. దయార్ద హృదయంతో మా హృదయాలను గెలుచుకున్నావు. నుసిక్యూ అసలైన చాంపియన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) ఇది కూడా చదవండి: నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. -
క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తాం: సీఎం జగన్
-
భారత బృందం కొత్త చరిత్ర
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం ఈ క్రీడల చివరి రోజు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో రెండు స్వర్ణాలు కైవసం చేసుకోవడంతో మొత్తం 72 (15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలు) పతకాలతో పట్టికలో తొమ్మిదో స్థానంతో ముగించింది. 172 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. పారా ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. 2014 క్రీడల్లో భారత్ 33 (3 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలు) పతకాలు సాధించింది. పోటీల చివరి రోజు బ్యాడ్మింటన్ పురుషుల ఎస్ఎల్3 సింగిల్స్ ఫైనల్లో ప్రమోద్ భగత్ 21–19, 15–21, 21–14తో ఉకున్ రుకైన్‌డీ (ఇండోనేసియా)పై గెలిచాడు. ఎస్ఎల్4 ఫైనల్లో తరుణ్ 21–16, 21–6తో యుయాంగ్ (చైనా)పై నెగ్గాడు. -
మను భాకర్‌కు రజతం
బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్ షూటింగ్ మిక్స్డ్ డబుల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత టీనేజర్ మను భాకర్, తజకిస్తాన్ కుర్రాడు బెహ్జాన్ ఫయ్జులీవ్ జోడీ రజతంతో సంతృప్తి పడింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఈ జంట 3–10 తేడాతో వనెస్సా సీగర్ (జర్మనీ)–కిరిల్ కిరొవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలైంది. మహిళల వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మను... టోర్నీ నిబంధనల ప్రకారం పురుషుల విభాగంలో ఫైనల్లో 20వ స్థానంలో నిలిచిన బెహ్జాన్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో పాల్గొంది. అయితే, ఈ జంట ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక స్వర్ణం చేజార్చుకుంది. తాజా ఫలితంతో యూత్ ఒలింపిక్స్ షూటింగ్లో భారత్‌కు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు దక్కినట్లైంది. ఇప్పటివరకు మొత్తం 8 పతకాలు రాగా, అందులో ఐదు షూటింగ్వే కావడం గమనార్హం. హాకీ ఫైవ్–ఎ–సైడ్ విభాగంలో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 4–2తో పోలాండ్‌పై... మహిళల జట్టు 3–0తో పోలాండ్పైనే విజయం సాధించాయి. నేడు జరిగే సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత పురుషుల జట్టు ఆడుతుంది. -
భారత్‌కు ఐదు స్వర్ణాలు
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల ఏడోరోజు శుక్రవారం చెస్‌లో రెండు, అథ్లెటిక్స్‌లో రెండు, బ్యాడ్మింటన్‌లో ఓ స్వర్ణం లభించాయి. వీటితోపాటు ఏడు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 17 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మహిళల ర్యాపిడ్ చెస్ పి1 విభాగంలో కె. జెన్నిత 1–0తో మనురుంగ్ రోస్‌లిండా (ఇండోనేసియా)పై గెలిచి స్వర్ణం చేజిక్కించుకోగా... పురుషుల ర్యాపిడ్–6 బీ2/బీ3 విభాగంలో కిషన్ పసిడి గెలిచాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్55 విభాగంలో నీరజ్ యాదవ్ (29.24 మీటర్లు) స్వర్ణం నెగ్గగా... అమిత్ బల్యాన్ ((28.79 మీటర్లు) రజతం సొంతం చేసుకున్నాడు. మెన్స్ క్లబ్ త్రో ఎఫ్51 విభాగంలో అమిత్ కుమార్ (29.47 మీటర్లు) పసిడి పతకం గెలుచుకోగా... ధరమ్వీర్ (24.81 మీటర్లు) రజతం సాధించాడు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ఎల్3 ఫైనల్లో పరుల్ పర్మార్ 21–9, 21–5తో వన్డీ కమ్‌టమ్ (థాయ్‌లాండ్)పై నెగ్గి బంగారు పతకం సాధించింది. పురుషుల 100 మీటర్ల స్విమ్మింగ్ ఎస్10 కేటగిరీలో స్వప్నిల్ పాటిల్ రజతం నెగ్గాడు. పురుషుల 4000 మీటర్ల సైక్లింగ్ సీ4 విభాగంలో గుర్లాల్ సింగ్ కాంస్యం సాధించాడు. రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్ ఎఫ్ 51/52/53 డిస్కస్ త్రోలో కాంస్యం నెగ్గింది. మహిళల డిస్కస్ త్రో ఎఫ్11 కేటగిరీలో నిధి మిశ్రా (21.82 మీటర్లు) కాంస్యం సాధించింది. -
హైజంప్‌లో క్లీన్‌స్వీప్
జకార్తా: ఒక ఈవెంట్లో మూడు పతకాలు భారత్‌కే వచ్చాయి. మూడు త్రివర్ణ పతాకాలు ఒకేసారి రెపరెపలాడాయి. ఈ దృశ్యం పారా ఆసియా క్రీడల్లో కనువిందు చేసింది. హైజంప్‌లో భారత దివ్యాంగ అథ్లెట్లే పతకాలన్నీ కొల్లగొట్టారు. పురుషుల హైజంప్ టి42/63 కేటగిరీలో శరద్ కుమార్ (1.90 మీటర్లు) రెండు రికార్డులు నెలకొల్పి స్వర్ణం గెలుపొందగా... వరుణ్ భాటి (1.82 మీటర్లు), తంగవేలు మరియప్పన్ (1.67 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు గెలిచారు. గురువారం ఆరోరోజు పోటీల్లో ఒక్క అథ్లెటిక్స్‌లోనే డజను పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. -
హర్విందర్‌కు స్వర్ణం
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హర్విందర్ సింగ్ ఆర్చరీలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఐదో రోజు పోటీల్లో భారత్ ఈ స్వర్ణం సహా తొమ్మిది పతకాలను సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున రజత, కాంస్యాలున్నాయి. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 37కు చేరింది. బుధవారం జరిగిన పురుషుల ఆర్చరీ డబ్ల్యూ2/ఎస్టీ కేటగిరీలో హర్విందర్ 6–0తో చైనాకు చెందిన జావో లిగ్జూను కంగుతినిపించి బంగారు పతకం అందుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్11 కేటగిరీలో మోను ఘంగాస్, లాంగ్‌జంప్ టి42/టి61/టి63 కేటగిరీలో విజయ్ కుమార్ రజతాలు గెలిచారు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 కేటగిరీలో మొహమ్మద్ యాసిర్‌కు కాంస్యం లభించింది. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్ ఫైనల్లో భవినబెన్ పటేల్–సోనల్‌బెన్ పటేల్ జోడీ 4–11, 12–14తో అసయుత్ దరరత్–పాటర్వడీ వరరిడంరొంకుల్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. దీంతో భారత జోడీ రజతంతో తృప్తిపడింది. చెస్ మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం గెలుపొందిన జెన్నిత అంటో... టీమ్ ఈవెంట్లో ప్రేమ కనిశ్రీతో కలిసి కాంస్యం నెగ్గింది. మహిళల టీమ్ ఈవెంట్లో మృణాళి, మేఘ, టైజన్ పునరం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల పవర్‌లిఫ్టింగ్‌లో 80 కేజీల కేటగిరీలో పోటీపడిన సుధీర్ 192 కేజీల బరువెత్తి కాంస్యం చేజిక్కించుకున్నాడు. -
పసిడి పంట
జకార్తా: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు మంగళవారం భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలు చేరాయి. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల పి–1 ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీశ్ నర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మనీశ్ 235.9 పాయింట్లు స్కోరు చేశాడు. అథ్లెటిక్స్‌లో ఏక్తా భ్యాన్ మహిళల క్లబ్ త్రో (ఎఫ్ 32/51) విభాగంలో, పురుషుల 100 మీటర్ల (టి35) విభాగంలో నారాయణ్ ఠాకూర్ బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఏక్తా ఇనుప గుండును 16.02 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచింది. నారాయణ్ ఠాకూర్ 14.02 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్ 56/57)లో వీరేందర్, పురుషుల హైజంప్ (టి 45/46/47)లో రాంపాల్, డిస్కస్ త్రో (ఎఫ్ 43/44/62/64)లో సురేంద్రన్ పిళ్లై, అనీశ్ కుమార్ రజత పతకాలు గెలిచారు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్ 11)లో మోనూ ఘంగాస్, 200 మీటర్ల (టి 44/62/64)లో ఆనందన్ గుణశేఖరన్, డిస్కస్ త్రో (ఎఫ్ 46)లో గుర్జర్ సుందర్ సింగ్, డిస్కస్ త్రో (ఎఫ్ 43/44/62/64)లో ప్రదీప్, మహిళల 200 మీటర్ల పరుగు (టి 45/46/47)లో జయంతి బెహరా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 28 పతకాలతో తొమ్మిదో స్థానంలోఉంది. -
డబుల్ ధమాకా
ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. యూత్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో భారత క్రీడాకారులు పసిడి ఖాతా తెరిచారు. ఒకేరోజు రెండు స్వర్ణాలతో అదరగొట్టారు. మొదట వెయిట్‌లిఫ్టింగ్‌లో జెరెమి లాల్రినుంగా... ఆ తర్వాత మను భాకర్ ‘పసిడి’ ప్రదర్శనతో మెరిశారు. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): భారీ అంచనాలతో బరిలోకి దిగి... కీలకదశలో ఒత్తిడిని అధిగమించి... వెయిట్‌లిఫ్టర్ జెరెమి లాల్రినుంగా... షూటర్ మను భాకర్ యూత్ ఒలింపిక్స్‌లో పసిడి కాంతులు విరజిమ్మారు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో మిజోరం రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల జెరెమి 274 కేజీల బరువెత్తి చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూత్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన తొలి క్రీడాకారుడిగా కొత్త చరిత్ర లిఖించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన ఈ ఈవెంట్లో జెరెమి స్నాచ్‌లో 124 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 150 కేజీలు బరువెత్తాడు. గత రెండేళ్లలో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచిన జెరెమి... ఈ ఏడాది ఆరంభంలో ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం... ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. 2011లో ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్కౌట్స్‌లో చేరిన జెరెమి అక్కడే శిక్షణ తీసుకుంటున్నాడు. జెరెమి తండ్రి లాల్నీత్లువాంగా జాతీయస్థాయి బాక్సర్. ఆయన ఎనిమిది స్వర్ణాలు సాధించారు. మొదట్లో జెరెమి బాక్సర్ కావాలనుకున్న కోచ్‌ల సలహా మేరుకు వెయిట్‌లిఫ్టర్‌గా మారాడు. ‘స్వర్ణం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు పతకం అందించడమే నా లక్ష్యం’అని జెరెమి వ్యాఖ్యానించాడు. గురి అదిరింది... మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల మను భాకర్ విజేతగా నిలిచింది. ప్రపంచకప్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన మను... ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మాత్రం నిరాశ పరిచింది. అయితే యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి తన సత్తా చాటుకుంది. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో మను 236.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. లానా ఎనీనా (రష్యా–235.9 పాయింట్లు) రజతం, నినో ఖుట్సిబెరిడ్జె (జార్జియా–214.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. 20 మంది షూటర్లు బరిలోకి దిగిన క్వాలిఫయింగ్‌లో మను 576 పాయింట్లు స్కోరు చేసి ‘టాపర్’గా నిలిచింది. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. ఆసియా క్రీడల్లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఈ పతకంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని మను వ్యాఖ్యానించింది. వైష్ణవి నిష్క్రమణ... మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. గ్రూప్ ‘ఎఫ్’లో ఆమె రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచిన గాయ్ జెనీ (అమెరికా) క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. మంగళవారం రివా సపోనారా (పెరూ)తో జరిగిన మ్యాచ్‌లో వైష్ణవి 21–14, 21–8తో గెలిచింది. ఎనిమిది గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన వారు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తారు. -
పారా ఆసియాలో పసిడి పంట
జకార్తా: భారత దివ్యాంగ అథ్లెట్లు పారా ఆసియా గేమ్స్‌లో రెండో రోజు స్వర్ణాల బాట పట్టారు. సోమవారం జరిగిన పోటీల్లో 12 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో మూడు స్వర్ణాలు, నాలుగు రజత, ఐదు కాంస్య పతకాలున్నాయి. ఓవరాల్‌గా భారత్ 17 పతకాలు సాధించింది. జావెలిన్ త్రోలో సందీప్ చౌదరి ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుపొందగా, 1500 మీ. పరుగులో రక్షిత, స్విమ్మింగ్‌లో సుయశ్ జాదవ్ బంగారు పతకాలు గెలిచారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్42–44/61–64 ఈవెంట్లో సందీప్ చౌదరి ఈటెను 60.01 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. దీంతో 1980లో మింగ్జీ గావ్ (59.82 మీ.; చైనా) నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. మహిళల జావెలిన్ త్రోలో రమ్య షణ్ముగం రజతం, దీపా మాలిక్ కాంస్యం గెలిచారు. మహిళల 1500 మీ. పరుగులో రక్షిత స్వర్ణం, రాధ రజతం నెగ్గారు. పురుషుల 50మీ. బటర్‌ఫ్లయ్ ఎస్7 పోటీలో జాదవ్ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అతనికిది మూడో పతకం. తొలిరోజు రెండు కాంస్యాలు నెగ్గాడు. పురుషుల 100 మీ. ఫ్రీస్టయిల్ ఎస్ 10 ఈవెంట్లో స్వప్నిల్ సంజయ్... ఇదే విభాగం మహిళల పోటీలో సతీజా దేవాన్షి చెరో కాంస్యం గెలిచారు. పవర్ లిఫ్టింగ్‌లో మహిళల 50 కేజీల కేటగిరీలో సకీనా కాటూన్ రజతం గెలుపొందగా, మిక్స్డ్ 50 మీ. ఫ్రీ పిస్టల్ ఈవెంట్లో షూటర్లు మనీశ్ నర్వాల్, సింగ్‌రాజ్ వరుసగా రజతం, కాంస్యం చేజిక్కించుకున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్లో యతిరాజ్, చిరాగ్, రాజ్ కుమార్, తరుణ్‌లతో కూడిన భారత బృందం కాంస్య పతకం సాధించింది. -
తొలి రోజే 5 పతకాలు
జకార్తా: పారా ఆసియా క్రీడల తొలి రోజు భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. ఇందులో రెండు రజతాలతో పాటు మూడు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల 49 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో ఫర్మాన్ బాషా 128 కేజీల బరువెత్తి రజతం సొంతం చేసుకోగా... పరమ్‌జీత్ కుమార్ (127 కేజీలు) కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల 100 మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో భారత స్విమ్మర్ దేవాన్షి రజతం సాధించగా... పురుషుల 200 మీ. మెడ్లేలో సుయశ్ జాదవ్ కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సెమీస్‌లో 1–2తో మలేసియా చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. -
పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన వికలాంగుడు!!
వికలాంగుడైన ఓ ఈతగాడు.. దక్షిణకొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న ఏషియన్ పారాగేమ్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ క్రీడల్లో శరత్ గైక్వాడ్ ఆరు పతకాలు సాధించాడు. ఇంతకుముందు పీటీ ఉష ఒకే ఈవెంట్లో కేవలం ఐదు పతకాలు మాత్రమే సాధించగా.. ఇప్పుడు దానికంటే ఒకటి ఎక్కువగా.. ఆరు పతకాలు సాధించి రికార్డు కొట్టాడు. 2012లో లండన్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కూడా పాల్గొన్న శరత్ గైక్వాడ్.. సరికొత్త రికార్డు సాధించాడు. ఇంతకుముందు పీటీ ఉష 1986 ఆసియా క్రీడల్లో ఒకేసారి ఐదు పతకాలు సాధించారు. ముందుగా శరత్ గైక్వాడ్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో రజత పతకం సాధించాడు. తర్వాత 100 మీటర్ల బటర్‌ఫ్లై, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించాడు. చివరగా తన సహచరులు ప్రశాంత కర్మాకర్, స్వప్నిల్పాటిల్, నిరంజన్ ముకుందన్లతో కలిసి 4x100 మీటర్ల మెడ్లీ రిలేలో కూడా కాంస్య పతకం కొట్టాడు. ఈ క్రీడల్లో తన పెర్ఫార్మెన్సు పట్ల చాలా సంతోషంగా ఉందని, గత ఆరు నెలలుగా ఈ పోటీల కోసం కఠోర శిక్షణ తీసుకున్నానని, దానికి ఇప్పుడు ఫలితం రావడంతో చాలా ఆనందంగా ఉందని శరత్ చెప్పాడు. ఇన్నాళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్ జాన్ క్రిస్టోఫర్, జీవో స్పోర్ట్స్ ఫౌండేషన్లకు కృతజ్ఞతలు తెలిపాడు.